
డీజీపీతో వేదిక పంచుకునేందుకు డీజీలు ససేమిరా
షాక్‌తో డుమ్మా కొట్టిన ముఖ్య అతిథులు సీఎస్, డీజీపీ
నిస్తేజంగా ముగిసిన క్రికెట్ మ్యాచ్
మ్యాచ్‌వైపు కన్నెత్తి చూడని
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
సాక్షి, అమరావతి: డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాపై సీనియర్ ఐపీఎస్ అధికారుల తిరుగుబాటు బావుటా పోలీసు శాఖతోపాటు ఉన్నతస్థాయి అధికారవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మధ్య సుహృద్భావపూర్వకంగా నిర్వహించిన క్రికెట్ మ్యాచ్‌పై కూడా ఈ ఆధిపత్య పోరు ప్రభావం పడింది. డీజీపీ గుప్తాతో వేదిక పంచుకునేందుకు ఇతర డైరెక్టర్ జనరల్(డీజీ)లు ససేమిరా అనడం గమనార్హం. దీంతో క్రికెట్ మ్యాచ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ముఖం చాటేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన సీనియర్ ఐఏఎస్, ఇతర ఐపీఎస్ అధికారులు ఎవరూ క్రికెట్ మ్యాచ్ వైపు తొంగి చూడనే లేదు. యావత్ ప్రభుత్వ అధికార యంత్రాంగంలో కలకలం రేపుతున్న ఈ తాజా పరిణామం ఇదిగో ఇలా ఉంది.. ఐఏఎస్, ఐపీఎస్ అ«ధికారుల మధ్య సుహృద్భావపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఏటా క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ క్రికెట్ మ్యాచ్‌కు సీఎస్, డీజీపీ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. క్రికెట్ మ్యాచ్ ఆడే అధికారులే కాకుండా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కుటుంబాలతోసహా వచ్చి మ్యాచ్‌ను వీక్షిస్తారు. కోవిడ్ వ్యాప్తితో 2020, 2021లో ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించ లేదు. అనంతరం మూడేళ్లపాటు వివిధ కారణాలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించ లేకపోయారు. దీంతో ఈ ఏడాదికిగాను ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఘనంగా నిర్వహించాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఉమ్మడిగా నిర్ణయించారు. ఆదివారం మూలపాడు స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎస్ విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరవుతారని కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఇరుజట్ల తరపున క్రికెట్ మ్యాచ్ ఆడే 11 మంది చొప్పున అధికారులతోపాటు ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు హాజరువుతామని చెప్పారు.
డీజీపీతో వేదిక పంచుకునేదే లేదన్న డీజీలు
కాగా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఒంటెత్తు పోకడలపై డీజీలు తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అసలు పోలీసు శాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్యే ఎలాంటి సహృద్భావం లేనప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్ ఎందుకని వారు తేల్చి చెప్పారు. మనసులో సామరస్య భావన లేకుండా కేవలం ముఖస్తుతి కోసం తాము వచ్చి మ్యాచ్‌ను వీక్షించలేమని స్పష్టం చేశారు.
ముఖం చాటేసిన సీఎస్, డీజీపీ
డీజీల నిర్ణయంతో సీఎస్ విజయానంద్, డీజీపీ గుప్తా కంగు తిన్నారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు సీఎస్ చేసిన యత్నాలను డీజీలు ఇప్పటికే తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో డీజీలు హాజరుకాని క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు తాను వెళితే వారు మరింత అవమానంగా భావించే అవకాశం ఉంటుందని సీఎస్ భావించారు. అందుకే తాను క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు రావడం లేదని కబురు పంపారు. సీఎస్ రానప్పుడు తాను మాత్రం ఎందుకు వెళ్లడమని డీజీపీ గుప్తా భావించారు. తన ఉనికే డీజీలకు గిట్టనప్పుడు తానెందుకు మ్యాచ్‌కు వెళ్లడమని ఆయన భావించినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో తాను కూడా మ్యాచ్‌కు రావడం లేదని గుప్తా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.
స్టేడియంవైపు తొంగి చూడని ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు
సీఎస్, డీజీలే రాలేమన్న క్రికెట్ మ్యాచ్‌కు తామెందుకు వెళ్లాలని ఇతర సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ ఆధిపత్య పోరు పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌కు దూరంగా ఉండటమే సరైందని వారు నిర్ణయానికి వచ్చారు. దీంతో ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులు, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరూ కూడా మూలపాడు స్టేడియం వైపు ఆదివారం కనీసం తొంగి చూడనే లేదు. ముందుగా ప్రకటించాం తప్పదు కాబట్టి కేవలం ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే తూతూ మంత్రంగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. మొత్తం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు వీక్షిస్తుండగా కోలాహలంగా నిర్వహించాల్సిన క్రికెట్ మ్యాచ్ కాస్త ... పోలీసు శాఖలో ఆధిపత్య పోరుతో నిస్తేజంగా ముగిసింది.