వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు షురూ

Infrastructure Works Speed Up At YSR And Jagananna Colonies - Sakshi

354 లేఅవుట్‌లలో కొనసాగుతున్న విద్యుత్‌ సరఫరా పనులు 

మరో 2,343 లేఅవుట్‌లలో విద్యుత్‌ శాఖ సర్వే 

25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన చోట సదుపాయాల కల్పన

సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు. ఇళ్లులేని పేదలకు ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 17,005 లేఅవుట్‌లలో  ప్రభుత్వం పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. తొలిదశలో 10,067 లేఅవుట్‌లలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది.  

354 లేఅవుట్‌లలో విద్యుత్‌ పనులు 
తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న 10వేల లేఅవుట్‌లలో రూ.24వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 354 లేఅవుట్‌లలో విద్యుత్‌ సరఫరా పనులు ప్రారంభించారు. విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరో 2,343 లేఅవుట్‌లలో పనులు ప్రారంభించడానికి డిస్కమ్‌లు సర్వే చేపడుతున్నాయి.

ఇక లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు విద్యుత్‌ అధికారుల సమన్వయంతో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. విదుత్‌ సదుపాయాల కల్పనకు రూ.4,600 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖకు నిధులు çసమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణదాతలకు హామీ ఇచ్చింది. మరోవైపు.. ఈ ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో–స్విస్‌ బీప్‌ (బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీంతో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఇళ్లలో 3–5 డిగ్రీలు తగ్గుతుంది. అదే విధంగా రోడ్లు, డ్రెయిన్లు, కాల్వల నిర్మాణం, నీటి సరఫరా, సహా ఇతర సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి.  

పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీకి ప్రాధాన్యం 
కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్‌ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేస్తారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. 17వేల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా ఇందులో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10,251 కోట్లు, సీసీ డ్రెయిన్లకు రూ.7,227 కోట్లు, నీటి సరఫరాకు రూ.4,128 కోట్లు, విద్యుత్‌కు రూ.7,080 కోట్లు, ఇంటర్నెట్‌కు రూ.909 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని లేఅవుట్‌లో వసతుల కల్పనకు రూ.3,204 కోట్లు కేటాయించారు. అదే విధంగా కాలనీల్లో పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం నిర్వహణకు సంబంధించిన వసతుల కల్పనకు రూ.110 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. 

ప్రైవేట్‌ గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా.. 
కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఏపీ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్, మున్సిపల్‌ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోంది. ఆ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. విద్యుత్‌ సదుపాయాల కల్పన పనులు చకచకా సాగుతున్నాయి. మిగిలిన శాఖలు తమ పనులు ప్రారంభిస్తున్నాయి. ప్రైవేట్‌ గేటెడ్‌ కమ్యూనిటీలకు దీటుగా జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన సీఎం లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నాం.  
– ఎం. శివప్రసాద్, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, గృహ నిర్మాణ సంస్థ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top