పరిశ్రమలకు 'కూటమి' కాటు | Industrialists backtrack on setting up units in the state | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు 'కూటమి' కాటు

Nov 21 2024 5:17 AM | Updated on Nov 21 2024 5:17 AM

Industrialists backtrack on setting up units in the state

నేతల అరాచకాలకు బెంబేలెత్తుతున్న పారిశ్రామికవేత్తలు

జమ్మలమడుగులో అదానీ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు ఎమ్మెల్యే ఆది పోటు

ప్రాజెక్టుపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గం దాడులు, విధ్వంసం

ఇప్పుడా ప్రాజెక్టు కొనసాగుతుందో లేదోనని స్థానికుల ఆందోళన

గతంలోనూ కూటమి నేతల చర్యలతో పారిశ్రామికవేత్తల్లో వణుకు

సినీ నటి కాదంబరిని అడ్డం పెట్టి పన్నిన కుట్రతో రాష్ట్రానికి దూరంగా జిందాల్‌ గ్రూప్‌

కృష్ణపట్నం పోర్టులో అదానీ సంస్థ సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి

సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్రంలో పరిశ్రమలు తెస్తా­మంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు తేకపోగా, ఉన్న వాటిని కూడా వెళ్లగొట్టేలా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. వారి అరాచకా­లకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకొని కూటమి నేతలు పన్నిన కుట్రతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన ప్రముఖ జెఎస్‌డబ్ల్యూ జిందాల్‌ గ్రూప్‌ వెనకడుగు వేసింది. 

గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర­మోహన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కృష్ణపట్నం పోర్టు దగ్గర అదానీ గ్రూపు ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారు. తాజాగా వైఎస్సార్‌ జిల్లా జమ్మల మడుగులో అక్కడి ఎమ్మెల్యే వర్గీయులు అదానీ ప్రాజెక్టులో విధ్వంసానికి దిగారు. దీంతో దేశంలో అతి పెద్ద పారిశ్రామిక సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూపే రాష్ట్రమంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. 

ప్రతి పనికీ కమీషన్లు ఇవ్వాలని, పనులు తమకే ఇవ్వాలంటూ పలువురు ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు పారిశ్రామికవేత్తల్లో వణుకు పుట్టిస్తు­న్నాయి. ప్రభుత్వ పెద్దలు కూడా ఎమ్మెల్యేల దుశ్చర్యలను అడ్డుకోకపోవడం పలు అనుమానా­లకు తావిస్తోంది. ఈ తీరు రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలగజేస్తుందని పారిశ్రామికవేత్తలు అంటున్నారు. 

ఇదీ జరిగింది..
వైఎస్సార్‌ జిల్లాలో గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టు అదానీ సంస్థకు దక్కింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో అదానీ సంస్థ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు సివిల్‌ పనులు దక్కాయి. పనులు కూడా మొదలు పెట్టారు. 

ఈ పనులు తమకే ఇవ్వాలని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పట్టుబట్టారు. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం ఎమ్మెల్యే ఆది­నారాయణరెడ్డి సోదరుడు శివనారాయణరెడ్డి, మరో సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యే వర్గీయులు ప్రాజెక్టు వద్ద విధ్వంసం సృష్టించారు. అక్కడి సిబ్బందిపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడి ఉద్యోగులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. 

ఇక్కడ పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదంటూ రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రతినిధి, ఎంపీ సీఎం రమేష్‌ సోదరుడు రాజేష్‌నాయుడు బుధవారం సీఎం చంద్ర­బాబుకు ఫిర్యాదు చేసినా ఎటువంటిస్పందనా రాలేదు. ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య జరుగుతున్న ఘర్షణ మొత్తం ప్రాజెక్టు పైనే పడుతుందని స్థానికులు ఆందోళన వ్యక్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గీయుల విధ్వంసంతో అదానీ సంస్థకు నష్టం కలిగిందని, నాయకుల మధ్య ఈ దందాలు ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు కొనసాగుతుందో, ఆగిపోతుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆగిపోయిన జిందాల్‌ స్టీల్‌ పరిశ్రమ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ప్రముఖ సంస్థ జేఎస్‌డబ్ల్యూ జిందాల్‌ గ్రూప్‌ ముందుకు వచ్చింది. వైఎస్సార్‌ జిల్లాలో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు మరికొన్ని భారీ పెట్టుబడులు పెట్టాలని కూడా నిర్ణయించింది. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ నటి కాదంబరి జత్వానీ పేరుతో దారుణంగా కేసులు పెట్టించి, రాష్ట్రంలో  ఆ గ్రూపు పెట్టుబడులు పెట్టకుండా కూటమి పెద్దలు అడ్డుకొంటున్నారు. దీంతో ఆ గ్రూపు ఇప్పుడు రాష్ట్రం వైపు చూడటానికే జంకుతోంది. వైఎస్సార్‌ జిల్లాలో స్టీల్‌ పరిశ్రమ నిలిచిపోయింది.

కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి దాడులు
గత నెలలో కృష్ణపట్నం పోర్టు సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డే స్వయంగా దాడికి పాల్పడ్డారు. పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ పునరుద్ధరణపై మాట్లాడుతానంటూ తన అనుచరులతో కలిసి పోర్టుకు వెళ్లిన సోమిరెడ్డి.. అక్కడి అదానీ సంస్థ ఉద్యోగులను దూషిస్తూ దాడికి దిగారు. పోర్టు డీజీఎంపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటన పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో ఆందోళన కలిగించింది.

అదానీ పవర్‌ ప్రాజెక్టుపై దాడి ఘటనలో కేసు నమోదు
కొండాపురం: అదానీ సంస్థ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుపై మంగళవారం జరిగిన దాడి ఘటనకు సంబంధించి కొందరిపై కేసు నమోదు చేసినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. అదానీ సంస్థకు చెందిన రామకృష్ణ, రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement