అమెరికా విద్యలో భారత్ హవా | India tops in international student enrollment | Sakshi
Sakshi News home page

అమెరికా విద్యలో భారత్ హవా

Published Sat, Nov 30 2024 5:56 AM | Last Updated on Sat, Nov 30 2024 7:21 AM

India tops in international student enrollment

అంతర్జాతీయ విద్యార్థుల్లో మూడో వంతు భారతీయులే

2023–24లో 3.31 లక్షల మంది అమెరికా వర్సిటీల్లో చదువులు

అంతర్జాతీయ విద్యార్థులతో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు

ఇందులో 20 శాతం భారతీయ విద్యార్థుల నుంచే..

అమెరికాలో ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు

స్టెమ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులపై ఎక్కువగా ఆసక్తి

సాక్షి, అమరావతి: అమెరికా విద్యా సంస్థల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో భారత్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. దాదాపు దశాబ్దంన్నర తర్వాత అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గరిష్టస్థాయికి చేరుకుంది. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాల్లో భారత్‌ వాటా 29 శాతంగా ఉన్నట్లు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఓపెన్‌ డోర్స్‌ 2024 నివేదిక వెల్లడించింది. 

గత విద్యా సంవత్సరం 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 23 శాతం అధికం. 2023–24లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రూ.4.22 లక్షల కోట్లు సమకూరగా ఇందులో భారత్‌ వాటా 20 శాతంగా ఉంది.

డ్రాగన్‌ను దాటేశాం..!
అమెరికా వర్సిటీలు, కళాశాలల్లో అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో చైనాను భారత్‌ అధిగవిుంచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2022–23లో 27.4 శాతం ఉండగా 2023–24లో 24.6 శాతానికి పడిపోయింది. 15 ఏళ్లలో ఇదే తక్కువ. గత విద్యా సంవత్సరం అమెరికాలో 11.26 లక్షల మంది అంతర్జాతీయ విద్య అభ్యసిస్తున్నట్టు నివేదిక తెలి­పింది. ఇది ఆల్‌టైమ్‌ రికార్డుగా పేర్కొంది. 

ఇందులో అగ్రస్థానంలో భారతీయ విద్యార్థులు (3.31 లక్షలు) ఉండగా 2.77 లక్షలతో చైనా విద్యార్థులు, 43,149 మందితో సౌత్‌ కొరియా విద్యార్థులు తరువాత స్థానాల్లో నిలిచారు. 64.5 శాతం మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో పబ్లిక్‌ వర్సిటీలను ఎంచుకుంటున్నారు. 35.5 శాతం మంది స్పెషలైజ్డ్‌ ప్రోగ్రామ్స్, పరిశోధనల కోసం ప్రైవేట్‌ వర్సిటీలకు వెళ్తున్నారు.
 


ఈ ఏడాది 3 శాతం పెరుగుదల..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలు మూడు శాతం పెరిగినట్లు  స్నాప్‌చాట్‌ నివేదిక చెబుతోంది. యూఎస్‌లోని చాలా విద్యా సంస్థలు గ్రాడ్యుయేట్‌ విద్యలో ప్రవేశాలను పెంచుకునేందుకు భారత్, చైనా, ఘనా, నైజీరియాలపై దృష్టి పెట్టినట్టు తెలిపింది. 

2022–23లో అమెరికాకు చెందిన 2.80 లక్షల మంది విద్యార్థులు ఇతర దేశాల్లో విద్యనభ్యసించారు. ఇటలీ, యూకే, స్పెయిన్, ఫ్రాన్స్‌ వారి ప్రధాన గమ్యస్థానాలుగా (45 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా, న్యూజిలాండ్‌ (25 శాతం)లో ఎక్కువగా చేరికలున్నాయి. 

స్టెమ్‌ కోర్సులపై దృష్టి..
భారతీయ విద్యార్థులకు అమెరికాలో అత్యంత ప్రాధాన్య విద్యా గమ్యస్థానాలుగా కాలిఫోరి్నయా, న్యూయార్క్, టెక్సాస్, మసాచుసెట్స్, ఇల్లినాయిస్‌ నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 56 శాతం మంది స్టెమ్‌ కోర్సులను అభ్యసించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కంప్యూటర్‌ సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌లో ఎక్కువగా ప్రవేశాలు పొందుతున్నారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశాల్లో  2 శాతం, ఫైన్, అప్లైడ్‌ ఆర్ట్స్‌లో 5 శాతం పెరుగుదల నమోదైంది. 
 
గ్లోబల్‌ డెస్టినేషన్‌..
2014 నుంచి అంతర్జాతీయ విద్యార్థుల గ్లోబల్‌ డెస్టినేషన్‌గా అమెరికా కొనసాగుతోంది. కెనడా, యూకే తరువాత వరుసలో ఉన్నాయి. యూకేలో మొత్తం విద్యార్థుల్లో అంతర్జాతీయ విద్యార్థులు 27 శాతం, కెనడాలో 38 శాతం, ఆస్ట్రేలియాలో 31 శాతం ఉన్నారు. మరోవైపు భారత్‌ను అధ్యయన కేంద్రంగా ఎంచుకున్న అమెరికా విద్యార్థుల్లో 300 శాతం పెరుగుదల కనిపించింది. 2022–23లో భారత్‌లో చ­దు­వుతున్న అమెరికన్ల సంఖ్య 300 నుంచి 1,300కి పెరి­గింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement