AP: చికెన్‌ తెగ తినేశారు | Increased Chicken Sales In West Godavari During AP Assembly Elections 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

AP Chicken Sales: చికెన్‌ తెగ తినేశారు

Published Wed, May 15 2024 8:45 AM

increased chicken sales in West Godavari

    సార్వత్రిక పోరు వేళలో చికెన్‌ విక్రయాల జోరు 

    సంఘాలు, సామాజిక వర్గాల వారీగా విందులు 

    నోటిఫికేషన్‌కు ముందు నుంచే హడావిడి మొదలు 

    ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల వినియోగం  

    ఎన్నికల నెల రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలు 

    సాధారణ వేసవికి భిన్నంగా రూ.290 పలికిన కిలో ధర 

    ఒక నెలలో రూ.435 కోట్ల విలువైన చికెన్‌ లాగించేశారు  

­­సార్వత్రిక పోరు సందర్భంగా ఉమ్మడి జిల్లాలో చికెన్‌ విక్రయాలు రెట్టింపు స్థాయిలో జరిగాయి. నోటిఫికేషన్‌కు ముందు నుంచే విందు భోజనాల హడావిడి మొదలైంది. ఓట్ల పండుగలో నాన్‌వేజ్‌ వంటకాలెన్ని వడ్డించినా చికెన్‌దే సింహ భాగమైంది. రికార్డు స్థాయిలో బ్రాయిలర్‌ కోళ్ల అమ్మకాలు జరగ్గా, గత నెల రోజుల్లో మాంసాహార ప్రియులు రూ.435 కోట్లు విలువైన చికెన్‌ను లొట్టలేసుకుంటూ లాగించేశారు.  

సాక్షి, భీమవరం: ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విందు భోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. చుట్టూ ఉన్న కేడర్‌ను కాపాడుకునేందుకు ఆశావాహుల ఇంట నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఈ సందడి మొదలవుతుంది. ఎన్నికల సమీపించే కొద్ది వివిధ సంఘాల వారికి విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలో గత నెల రోజులోగా జిల్లాలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఆతీ్మయ కలయికల పేరిట రాజకీయ విందులే. 

అభ్యర్థులు తమ ఎన్నికల కార్యాలయాల వద్ద ప్రతి రోజు కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వచ్చారు. నామినేషన్లు, ప్రచార కార్యక్రమాల్లో కేడర్‌ కోసం ప్రత్యేక విందులు వడ్డించారు. మరో పక్క మండల, నియోజకవర్గ స్థాయిలో వివిధ సామాజిక వర్గాలు, ఆటో, తోపుడుబండ్లు యూనియన్లు, వివిధ వర్తక సంఘాలతో పాటు ఎక్కువగా ప్రజల్లో ఉండే పీఎంపీలు, పాస్టర్లు, డ్వాక్రా సంఘాల లీడర్లు తదితర వర్గాల వారికి పోటాపోటీగా ఆతీ్మయ సమ్మేళనాలు నిర్వహించారు. వారి కోసం ఏర్పాటు చేసిన విందు భోజనాల్లో చేప, రొయ్య వంటకాలు చేసినా మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడే చికెన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు.  

గరిష్ట స్థాయి విక్రయాలు 
సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 2.5 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. ఎన్నికల సంగ్రామం నేపథ్యంలో గత నెల రోజులుగా రాజకీయ పారీ్టల నేతల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులకు రోజూ వందల కిలోల చికెన్‌ ఆర్డర్లు వచ్చాయి. గత నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా అంతకు వారం పది రోజుల ముందు నుంచి చికెన్‌ ఆర్డర్లు రావడం మొదలైందని వ్యాపారులు అంటున్నారు. నామినేషన్లు, ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆర్డర్ల జోరు మరింత పెరిగిందంటున్నారు. రోజువారి అమ్మకాలతో పోలిస్తే సగటున గత నెల రోజులుగా రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయని వారు తెలిపారు. మునుపెన్నడూ ఇంత భారీస్థాయిలో వరుసగా అమ్మకాలు జరిగింది లేదంటున్నారు. 

కోళ్లు సిద్ధంగా.. ధర నిలకడగా  
ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం తదితర ప్రాంతాల్లోని ఫాంలలో ఏడు లక్షలకు పైగా కోళ్ల పెంపకం చేస్తున్నారు. బ్రాయిలర్‌ కోడి వేసవిలో 40 రోజులకు, శీతాకాలంలో మేత ఎక్కువగా తీసుకోవడం వలన 35 రోజుల్లోనే రెండు కేజీలు వరకు బరువు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. సాధారణంగా వేసవిలో ఎండల తీవ్రతకు కోళ్లు ఎక్కువగా మృత్యువాత పడుతుంటాయి. వేసవి తాపం నుంచి వాటికి ఉపశమనం కలిగించేందుకు షెడ్లపై వాటర్‌ స్ప్రింక్లర్లు, ఫ్యాన్లు తదితర వాటి ఏర్పాటుతో నిర్వహణ ఖర్చు తడిసిమోపెడవుతుంది. వేడి చేస్తుందన్న భావనతో చికెన్‌ వినియోగం తక్కువగా ఉండటం వలన డిమాండ్‌ లేక ధర పతనమవుతుంది. 

ఆయా కారణాలతో నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వేసవిలో కొత్త బ్యాచ్‌లు తక్కువగా వేస్తుంటారు. అయితే ఈసారి ఎన్నికల సీజన్‌ కావడం వ్యాపారం బాగుంటుందని ముందే ఊహించి కొత్త బ్యాచ్‌లు సిద్ధం చేయడం వారికి కలిసొచ్చింది. వేసవిలో కిలో రూ.220 నుంచి రూ.250 మధ్య పలికే చికెన్‌ ధర ఈసారి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో రూ.280 నుంచి రూ.300 మధ్య నిలకడగా ఉందని హోల్‌సేల్‌ వర్గాలు అంటున్నాయి. సగటున కిలో రూ.290 చొప్పున సాధారణ అమ్మకాలు మేరకు రోజుకు రూ.7.25 కోట్ల చొప్పున నెలకు రూ. 217.5 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా. అయితే నెల రోజులుగా ఎన్నికల నేపథ్యంలో రెట్టింపు స్థాయిలో జరిగిన అమ్మకాల మేరకు జిల్లాలో రికార్డు స్థాయిలో రూ.435 కోట్లు మేర చికెన్‌ను మాంసాహారప్రియులు లాగించేశారంటున్నారు.  

 

Advertisement
 
Advertisement
 
Advertisement