అన్నయ్య అఘాయిత్యం.. బాలిక ఆత్మహత్యాయత్నం | Incident took place in Kovvur mandal of East Godavari district | Sakshi
Sakshi News home page

అన్నయ్య అఘాయిత్యం.. బాలిక ఆత్మహత్యాయత్నం

Jul 6 2026 5:43 AM | Updated on Jul 6 2026 5:43 AM

Incident took place in Kovvur mandal of East Godavari district

బాధితురాలు కొనఊపిరితో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాటం

కేవలం పోలీసులు కిడ్నాప్‌ కేసు పెట్టారని కుటుంబ సభ్యుల ఆరోపణ 

బంధువే కదా.. సర్దుకుపోవాలంటున్నారని ఆవేదన 

నిందితుడిపై అత్యాచారం, మరణానికి ప్రేరేపించడం నేరాల కింద కేసు పెట్టాలంటూ డిమాండ్‌ 

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఘటన  

కాకినాడ క్రైం : వరుసకు అన్న అయినవాడే వంచిస్తే.. బలవంతంగా శారీరక వాంఛ తీర్చుకుంటే.. వీడియోలు రికార్డుచేసి కావలసినప్పుడల్లా రావాలంటూ వేధిస్తుంటే.. పాపం అభం శుభం తెలియని ఆ చిట్టితల్లి ఎంతగానో తల్లడిల్లిపోయింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక కుటుంబం కూలి పనులు చేసుకుంటూ ఉంటోంది. బాలిక తొమ్మిదో తరగతి వరకు చదివి ఆపేసింది. 

2022లో వీరి ఇంటి సమీపంలోకి 22 ఏళ్ల బసవాని లక్ష్మణ్‌ కుటుంబం అద్దెకు వచ్చింది. లక్ష్మణ్‌కు బాలిక సోదరి వరుస అవుతుంది. అదే ఏడాదిలో బాలిక పుష్పాలంకరణ కార్యక్రమాన్ని అన్న హోదాలో ఉండి తల్లిదండ్రులతో కలిసి వైభవంగా జరిపించాడు. ఏడాదిలోనే చెల్లిపై లక్ష్మణ్‌ ఆలోచన మారిపోయింది. అన్నయ్య అని పిలిస్తే సహించేవాడు కాదు. ఈ నేపథ్యంలో.. బాలిక కుటుంబ సభ్యులు 2024లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే, స్వగ్రామంలో కొన్ని పనుల నిమిత్తం బాలిక కుటుంబం ఈ ఏడాది జూన్‌ 16న సొంతూరుకు వెళ్లింది. ఇంతలో 20న బాలిక అదృశ్యమవడం.. ఫోన్‌ కూడా పనిచేయకపోవడంతో ఆమె బాబాయి, పిన్ని కొవ్వూరు పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆమె ఉనికి గుర్తించిన పోలీసులు 21న తీసుకొచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ రోజంతా ముభావంగా ఉన్న బాలిక.. 22వ తేదీ రాత్రి తల్లిని పట్టుకుని భోరున ఏడ్చేసింది. తనను లక్ష్మణ్‌ విజయవాడకు తీసుకెళ్లి గదిలో బలవంతంగా కోరిక తీర్చుకున్నాడని తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వీడియోలు తీసి తాను రమ్మన్నప్పుడు రాకపోతే యూట్యూబ్‌లో పెడతానని, కుటుంబం అంతా ఉరేసుకుని చస్తారని బెదిరించాడని రోదిస్తూ తల్లి వద్ద కుమిలిపోయింది. ఆమె కుమార్తెకు ధైర్యం చెప్పినప్పటికీ 23వ తేదీ తెల్లవారుజా­ము­న బాధితురాలు ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. తల్లి ఇది గమనించి భర్త సా­యంతో కిందికి దింపి స్థానిక ఆసుపత్రిలో చేర్పించా­రు.  

అత్యంత విషమంగా బాలిక పరిస్థితి 
అక్కడనుంచి బాలికను నిడదవోలులో మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరికి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వైద్యుల సూచన మేరకు కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు.  ప్రస్తుతం బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెదడు పనితీరు నిలిచిపోవడంతో శరీరంలో ఒక్కో భాగం చచ్చుబడుతున్నాయన్నారు.  

నిందితుడికి పోలీసుల వత్తాసు.. 
ఇదిలా ఉంటే.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన లక్ష్మణ్‌కు పోలీసులు వంత పాడుతున్నారని బా«ధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటూ కిడ్నాప్‌ కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డకు ఈ గతి పట్టించిన లక్ష్మణ్‌ ఊర్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని చెప్పారు. పైగా.. బంధువే కదా.. సర్దుకుపోవాలంటూ కుటుంబ సభ్యులకు పోలీసులు హితబోధ చేస్తున్నారంటున్నారు. పోలీసులు నిందితుడిపై అత్యాచారం, మరణానికి ప్రేరేపించడం నేరాల కింద కేసు నమోదుచేసి, చిత్రీకరించిన వీడియోలు తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement