బొజ్జన్న కొండకు మైనింగ్‌ ముప్పు

Illegal Mining Threat To Bojjannakonda In Anakapalle To Visakhapatnam - Sakshi

ప్రాచీన బౌద్ధ శిల్ప సంపదకు నష్టం 

బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ నివేదికలోనూ స్పష్టం 

అటకెక్కిన లోకాయుక్త దర్యాప్తు

అనకాపల్లి: ఏకశిలా స్థూపాలు.. కొండలో తొలచిన గుహలు.. వాటిలో ఇరవై గదులు.. ధ్యాన బుద్ధ విగ్రహాలు వంటి ప్రత్యేకతలెన్నో బొజ్జన్నకొండ సొంతం. విశాఖ జిల్లా శంకరం గ్రామంలోని బొజ్జన్నకొండ, లింగాల కొండలపై గల ఈ బౌద్ధ స్థలాలు క్రీ.శ. 4–9 శతాబ్దాల మధ్య నిర్మితమైనట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రధాన స్థూపం రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంటుంది. ఇటుకలతో కట్టిన బౌద్ధ విహారాలు, చైత్యం, భిక్షువుల గదులు ఉన్నాయి. 1907లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 4వ శతాబ్దం నాటి సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలం నాటి నాణేలు దొరికాయి.

ఇంతటి విశిష్టత గల బొజ్జన్నకొండలోని ప్రధాన గుహతోపాటు అనేక అపురూప కట్టడాలకు క్వారీ పేలుళ్లతో ప్రమాదం పొంచి ఉంది. 30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో 16 స్తంభాలపై విశేషంగా నిర్మించిన ఈ గుహాలయంలోని స్తంభాల పెచ్చులూడుతున్నాయి. మైనింగ్‌ ప్రకంపనల వల్లే ఈ ప్రమాదం ఏర్పడుతోందని నిపుణుల అంచనా. బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ నిర్వహించిన సర్వేలో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొజ్జన్నకొండ, లింగాలకొండలోని అపురూప శిల్ప సంపదకు నిత్యం నష్టం వాటిల్లుతూనే ఉంది.

శతాబ్దం క్రితం వెలుగులోకి..
బొజ్జన్నకొండ చరిత్ర 1906లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బయటపడిన శాసనాలు, బౌద్ధ శిథిలాలు, అవశేషాలు నాటి చరిత్రను తేటతెల్లం చేశాయి. దక్షిణ భారతదేశంలో విశిష్టత ఉన్న బౌద్ధారామంగా బొజ్జన్నకొండకు గుర్తింపు ఉంది. ఈ కొండలోని హారతి అనే స్త్రీ మూర్తి శిల్పాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారట. మత విద్వేషాలతో కొందరు ఇక్కడి శిల్ప సంపదను నాశనం చేశారు. కొండ పైభాగాన దంగోడు గొయ్యికి ఓ భారీ రంధ్రముంటుంది. దీనిపై రాళ్లు విసిరే సంప్రదాయం ఉండగా.. పురావస్తు శాఖ రంగంలోకి దిగి దానిని నిలిపివేయించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. 

మైనింగ్‌ బాబులతో ముప్పు 
బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల సమీపంలోని మార్టూరులో 140 హెక్టార్లలో ఓ కొండ ఉంది. దానిని బినామీ పేర్లతో కొందరు బడా వ్యక్తులు లీజుకు తీసుకుని 30 ఏళ్లుగా భారీగా మైనింగ్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో బ్యూరో ఆఫ్‌ మైనింగ్‌ ఇక్కడి పరిస్థితులపై పరిశీలన జరిపి బొజ్జన్నకొండ పరిధిలో 3 నుంచి 6 కిలోమీటర్ల లోపల బ్లాíస్టింగ్‌లు చేస్తే అత్యంత విలువైన శిల్ప సంపదకు నష్టం వాటిల్లుతుందని తేల్చింది. అయినా.. ఇక్కడి గుహలకు, ఇటుక నిర్మాణాలకు ముప్పు వాటిల్లేవిధంగా మార్టూరులో దర్జాగా క్వారీ తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

అటకెక్కిన లోకాయుక్త దర్యాప్తు 
మార్టూరు, గుంకల్లోవ గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌–1లో ఎన్ని క్వారీలున్నాయి, ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో తేల్చాలంటూ మార్టూరు గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించారు. అప్పట్లో దర్యాప్తు జరపగా.. విచిత్రంగా 72 క్వారీలకు సంబంధించి అసలు యజమానులు 10 మంది మాత్రమే దొరికారు. మిగిలిన యజమానులు కాగితాల్లో ఉన్నారే తప్ప వారి అడ్రసులు అధికారులకు చిక్కలేదు. దీంతో బినామీ పేర్లతో క్వారీలను కొనసాగిస్తున్నారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. కానీ.. కొన్నాళ్లకే లోకాయుక్త దర్యాప్తు సైతం అటకెక్కింది.

విచారణ చేపడతాం
బొజ్జన్నకొండ వంటి పురావస్తు కట్టడాలకు మైనింగ్‌ వల్ల నష్టం కలుగుతోందని  ఇప్పటికే ఫిర్యాదులొచ్చాయి. గతంలో వచ్చిన నివేదికలు, నిజంగా క్వారీ కార్యకలాపాల వలన ఎంత నష్టం జరుగుతుందనే అంశాలపై ఆరా తీసి కచ్చితమైన చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్‌రెడ్డి, ఏడీ, మైనింగ్‌ విజిలెన్స్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top