చేయి తిరుగుతోంది! | Illegal Activities In West Godavari district | Sakshi
Sakshi News home page

చేయి తిరుగుతోంది!

Aug 6 2025 5:40 AM | Updated on Aug 6 2025 5:41 AM

Illegal Activities In West Godavari district

‘పశ్చిమ’లో జోరుగా పేకాట దందా

టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులు

అనుమతుల పేరిట క్లబ్బుల్లో భారీగా నిర్వహణ

అనధికారికంగా ప్రధాన పట్టణాల్లో శిబిరాలు

భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు

జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌

ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాట రాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు

తణుకులో ప్రతిరోజూ మారుతున్న శిబిరాలు

పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా

ప్రజాప్రతినిధులకు, పోలీసులకు వారం మామూళ్లు ఖరారు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్‌కు రూ.20 వేలు, మిడిల్‌ డ్రాప్‌కు రూ.40 వేలు, ఫుల్‌ కౌంట్‌కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్‌. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతిని«ధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్‌చేసి ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారడం మినహా మిగతాదంతా సేమ్‌ టూ సేమ్‌.

టీడీపీ కూటమి సర్కారు రాగానే..
పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్‌లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనిష్టా వరకు భారీగా నిర్వహిస్తున్నారు. అంతేకాక.. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు.

ఒక్కొక్కచోట ఒక్కోలా..
తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో అయితే ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. అలాగే, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్‌లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం.

భీమవరంలో భారీస్థాయిలో స్పెషల్‌ శిబిరం..
భీమవరంలోని మురుగు కాల్వగట్టు సమీపంలో ఓ శిబిరం భారీస్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లుచేశాడు. ఎలా అంటే.. ఉ.10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు క్రీడ నిర్వహణ. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనిష్టా బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు.

ప్రధానంగా ఓకుకు రూ.20 వేలు చొప్పున.. ఫుల్‌ కౌంట్‌ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్‌కు రూ.5 లక్షలు డిపాజిట్‌.. మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్‌గేమ్‌ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్‌ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడుగా ఉన్న క్లబ్‌లో గెస్ట్‌ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్‌ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు.

భీమవరంలోని పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఒక్కో ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలుచేస్తున్నాడు. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతిని«ధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి ఠంఛనుగా పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు.

మరో విషయమేమంటే.. ఇక్కడ పేకాట కోసం వచ్చేవారికి త్రీస్టార్‌ హోటల్‌ సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే పైఎత్తున చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్‌ గేమ్‌ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement