AP: తెలుగు రాష్ట్రాల మధ్య ఐకానిక్‌ వంతెన.. తగ్గనున్న 80 కిలోమీటర్ల దూరం

Iconic Bridge to be Constructed on Krishna River connecting Telugu states - Sakshi

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ కృష్ణా నదిపై ముచ్చటగొలిపే ఐకానిక్‌ వంతెన నిర్మాణం కానుంది. దీని నిర్మాణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. పర్యాటకానికి ఊతమిచ్చేలా ఈ వంతెన నిర్మించనున్నారు. రూ.1,082.65 కోట్లతో రూపొందించిన ఈ వంతెన నిర్మాణ ప్రణాళికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. మొదటి విడతగా రూ.436 కోట్లు కూడా మంజూరు చేసింది. దాంతో నంద్యాల జిల్లాలో వరద ముంపు బాధిత గ్రామాల ప్రజల సౌకర్యార్థం కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది.

కృష్ణా నదిపై కొత్త వంతెన నిర్మాణ ప్రతిపాదన 2008 నుంచి పెండింగులో ఉంది. 2007లో నాటు పడవలో కృష్ణా నదిని దాటుతూ ప్రమాదానికి గురై 61 మంది మరణించారు. దీంతో సిద్ధేశ్వరం –  సోమశిల మధ్య వంతెన నిర్మించాలని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. 2008లో శంకుస్థాపన కూడా చేశారు. ఆయన హఠాన్మరణంతో దాని నిర్మాణం నిలిచిపోయింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని పట్టించుకోలేదు.

2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ఎన్‌హెచ్‌–167 కె గా ప్రకటించి కృష్ణా నదిపై వంతెనతో సహా ఆరులేన్ల  రహదారి నిర్మాణానికి నిర్ణయించారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల బైపాస్‌ రోడ్డు వరకు 174 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–167కె)ని రూ.1,200 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ సమ్మతించింది. దాంతోపాటు కృష్ణా నదిపై వంతెన కూడా నిర్మించాలని నిర్ణయించారు.

తగ్గనున్న దూరం
ఈ వంతెన నిర్మాణంతో నంద్యాల జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు నదిలో ప్రయాణించాల్సిన అవసరం లేకుండా రోడ్‌ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఆత్మకూరు, నందికొట్కూరు, పడిగ్యాల, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 35 గ్రామాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ఏపీ, తెలంగాణ మధ్య దూరమూ 80 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రస్తుతం నంద్యాల నుంచి హైదరాబాద్‌ వెళ్లాలంటే కర్నూలు, వనపర్తి మీదుగా వెళ్లాలి. ఈ వంతెన నిర్మిస్తే నంద్యాల నుంచి నేరుగా నాగర్‌కర్నూలు మీదుగా హైదరాబాద్‌ వెళ్లిపోవచ్చు. తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కూడా వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. 

ఐకానిక్‌ వంతెన ఇలా..
ఇక్కడ సాధారణ వంతెన కాకుండా పర్యాటక ఆకర్షణగా ఐకానిక్‌ వంతెన నిర్మించాలని నిర్ణయించారు. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం – తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా సోమశిల మధ్య దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మిస్తారు. కేబుల్‌ ఆధారిత సస్పెన్షన్‌ వంతెనగా నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఆమోదించారు.

నల్లమల ప్రాంతంలో, శ్రీశైలం రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌లో విహరించే సందర్శకులకు ఈ వంతెన పెద్ద ఆకర్షణగా నిలవనుంది. దీనిపై ప్రత్యేకంగా ఆద్దాల నడక దారిని ఏర్పాటు చేయనున్నారు. ఆలయ శిఖరం రూపంలో పైలాన్, ఎల్‌ఈడీ లైట్ల కాంతులతో ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి. వంతెన నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top