ఆమ్రపాలి: ఒంగోలు టూ పీఎంవో 

IAS Officer Kata Amrapali Special Story In Prakasam District - Sakshi

ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపికైన మన ఆడపడుచు

ఐఏఎస్‌ అధికారిణి కాటా ఆమ్రపాలికి అరుదైన అవకాశం 

ఆమ్రపాలి స్వగ్రామం ఒంగోలు నగర శివారు గ్రామం ఎన్‌.అగ్రహారం 

కుటుంబ సభ్యులంతా ఉన్నతాధికారులే 

సాక్షి, ఒంగోలు‌: జిల్లాకు చెందిన ఆడపడుచు, ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలిని ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నియమించారు. అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ కేబినెట్‌ సెలక్షన్‌ కమిటీ ఆమెను పీఎంవో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది. ఆమ్రపాలి స్వగ్రామం  ఒంగోలు నగర శివారులోని ఎన్‌.అగ్రహారం. గ్రామానికి చెందిన కాటా వెంకటరెడ్డి, పద్మావతిలకు ఆమె మొదటి సంతానం. అగ్రహారంలో పుట్టి విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌లో 2010 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారిణిగా విధుల్లో చేరారు. రాష్ట్ర విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం  పీఎంవోలో డిప్యూటీ  సెక్రటరీగా నియమితులయ్యారు.

అతి చిన్నవయసులోనే ఈ పోస్టులో నియమితులైన వారిలో ఒకరిగా ఆమ్రపాలి నిలిచారు. ఈ పోస్టులో ఆమె 2023 అక్టోబర్‌ 23 వరకు అంటే మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తారు. ఆమ్రపాలి ఇప్పటి వరకు కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూ వచ్చారు. ఐఏఎస్‌కు ఎంపికైన తరువాత  2011లో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా మొదట విధుల్లో చేరారు. అనంతరం రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.

ఎన్‌.అగ్రహారంలోని ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాసం 
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగర కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో జాయింట్‌ సీఈఓగా, కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమ్రపాలి.. తన నిబద్ధత గల పనితీరుతో సంచలనాల కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్‌లలో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఆమె తండ్రి కాటా వెంకటరెడ్డి ఆంధ్ర యూనివర్శిటీలో ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన నివాస గృహం ఎన్‌.అగ్రహారంలో ఇప్పటికీ ఉంది. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. 

కుటుంబం అంతా ఉన్నతాధికారులే.. 
ఆమ్రపాలి భర్త సమీర్‌ శర్మ కూడా ఐపీఎస్‌ అధికారి. 2011 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయనను 2018 ఫిబ్రవరి 18న వివాహం చేసుకున్నారు. సమీర్‌ శర్మది జమ్మూ కాశ్మీర్‌. ప్రస్తుతం ఆయన డయ్యూ, డామన్‌లో సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌(ఎస్పీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమ్రపాలి సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారిణి. ప్రస్తుతం కర్నాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్‌ విభాగంలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రవీణ్‌ కుమార్‌ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన కూడా 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. తమిళనాడు క్యాడర్‌ ఐఏఎస్‌కు చెందిన ప్రవీణ్‌ కుమార్‌ ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తరువాత జరిగిన ఉప ఎన్నికకు రెండుసార్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top