
అధికార దుర్వినియోగ సిఫార్సులకు సహకరించలేదనే జీఏడీకి అటాచ్
చికిత్సల్లో అక్రమాలకు పాల్పడిన ప్రముఖ ఆసుపత్రికి గత ప్రభుత్వంలో రూ.20 కోట్ల మేర పెనాల్టీ
దానిని మాఫీ చేయాలని పెదబాబును ఆశ్రయించిన ఆస్పత్రి యాజమాన్యం
యాజమాన్యం వినతిపై పెదబాబు కార్యాలయం నుంచి సిఫార్సు..
అయినా పెనాల్టీ మాఫీకి ఆ యువ ఐఏఎస్ ససేమిరా
సాక్షి, అమరావతి: రాష్ట్రాన్ని ఏలుతున్న తమతో పాటు టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అడ్డగోలు సిఫార్సులను కనీసం పరిగణనలోకి కూడా తీసుకోవడంలేదనే యువ ఐఏఎస్‌పై పెదబాబు, చినబాబు చాలారోజులుగా కస్సుబుస్సులాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకే ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం.
అడ్డగోలు దోపిడీ అగ్రిమెంట్‌పై సంతకం పెట్టకపోవడమే కాక.. పెదబాబు చెప్పిన సిఫార్సులు సైతం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వాటిని నిర్ద్వందంగా ఆయన తిరస్కరించారు. ఈ సిఫార్సులకు ఆమోదం తెలపాలని ఎంత ఒత్తిడి చేసినా తలొగ్గకపోవడంతో సెలవుపై వెళ్లిన ఆయన తిరిగి వచ్చాక జీఏడీకి అటాచ్ చేసేశారు. ఈ నేపథ్యంలో.. యువ ఐఏఎస్ అధికారి పెద్దల ఆగ్రహానికి గురికావడానికి గల కారణాలు మరికొన్ని ‘సాక్షి’ దృష్టికొచ్చాయి.
పెనాల్టీ మాఫీ చేసేదే లే..
క్యాన్సర్ వైద్యానికి విశాఖ, గుంటూరుల్లో పేరుగాంచిన ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి అక్రమాలకు పాల్పడింది. వీటిపై విచారణ జరిపిన గత ప్రభుత్వం.. యాజమాన్యానికి రూ.20 కోట్ల మేర పెనాల్టీ విధించింది. అయితే, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే తమకు విధించిన పెనాల్టీ మాఫీ చేయాలంటూ పెదబాబుతో సదరు ఆస్పత్రి యాజమాన్యం మంతనాలు జరిపింది. అదే విధంగా హైదరాబాద్‌లోని తమ ఆస్పత్రిలో ఏపీ ప్రభుత్వ పథకం కింద సేవలకు అనుమతులివ్వాలని అభ్యర్థించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో.. యాజమాన్యం వినతిని అమలుచేయాలని పెదబాబు యువ ఐఏఎస్ విభాగానికి ఆ ఫైలును పంపారు. పెనాలీ్టకి గల కారణాలపై ఆరా తీశాక మాఫీ చేయడానికి వీలుపడదని, పైగా.. సదరు ఆస్పత్రి పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడిందని పెదబాబు కార్యాలయానికి యువ ఐఏఎస్ అధికారి స్పష్టంచేసినట్లు సమాచారం. కానీ, పెదబాబు చెప్పినందున ఎలాగోలా పనికానిచ్చేయాలని పై అధికారులు ఆదేశించడంతో ఆ యువ ఐఏఎస్ ససేమిరా అనేశారు. పై నుంచి పదేపదే ఒత్తిడి చేసినా ఆయన తలొగ్గలేదు.
మరోవైపు.. ఏపీలో అక్రమాలకు పాల్పడిన వారికి మరో ఆస్పత్రికి అనుమతులివ్వడం కూడా కుదరదని ఈ అభ్యర్థనను సైతం పరిగణనలోకి తీసుకోలేదు. అలాగే, కర్నూలు నగరంలోని మరో ఆస్పత్రిలో కూడా గత ప్రభుత్వంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. పక్షవాత రోగులకు చికిత్స అందించినట్లు తప్పుడు నివేదికలతో రూ.కోట్లలో ప్రజాధనాన్ని యాజమాన్యం కొల్లగొట్టింది. దీంతో.. ఆస్పత్రికి పెనాల్టీ వేయడంతో పాటు, పథకం కింద చికిత్సలకు అనుమతులు రద్దుచేశారు. అయితే, బాబు గద్దెనెక్కిన వెంటనే ఆ జిల్లా మంత్రి సదరు ఆస్పత్రికి తిరిగి అనుమతులు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు వెల్లడైంది. ఇందుకు ఆ యువ ఐఏఎస్ ఒప్పుకోలేదు.
వచ్చిన నెల నుంచే పంపేస్తామని..
ఇలా పై నుంచి ఏ పనిచేయమన్నా నిబంధనలకు లోబడి ఉంటేనే చేస్తానని.. లేదంటే కుదరదని యువ ఐఏఎస్ భీషి్మంచుకు కూర్చోవడంతో పెదబాబు, చినబాబులతో పాటు, అమాత్యుడికి మింగుడుపడలేదు. దీంతో ఈయన బా«ధ్యతలు చేపట్టిన నెల, రెండు నెలలకే బదిలీ చేసేస్తామని లీకులు వదిలారు. ఈ నేపథ్యంలో.. సంస్థలో పనిచేసే మంత్రుల తాలూకు అధికారులు సైతం బాస్ బదిలీ అవుతున్నారని, అనుకూలమైన ఐఏఎస్ వస్తారని ప్రచారం చేశారు. కానీ, ఈ స్థానంపై మక్కువలేని యువ ఐఏఎస్ సైతం ఏ క్షణమైనా వెళ్లిపోదాం అన్నట్లుగానే వ్యవహరించారు.