అల్లూరి తొలి దాడికి వందేళ్లు 

Hundred Years Alluri Sitarama Raju Attack On Chintapalli Police Station - Sakshi

1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మెరుపు దాడి 

నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ నేడు చింతపల్లిలో సభ 

హాజరుకానున్న కేంద్ర మంత్రి అర్జున్‌ ముండా, డిప్యూటీ సీఎం రాజన్న దొర 

సాక్షి, అమరావతి/చింతపల్లి/చింతపల్లి రూరల్‌: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విల్లంబులు ఎక్కుపెట్టి.. చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మెరుపు దాడి చేసిన ఘటనకు సరిగ్గా వందేళ్లు నిండాయి. 1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై అల్లూరి తన బృందంతో తొలి దాడి జరిపారు. నాటి వీరోచిత ఘట్టాన్ని స్మరించుకుంటూ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సభ జరగబోతోంది.   

చింతపల్లితో మొదలుపెట్టి.. 
మన్యంలో గిరిజనులపై బ్రిటిష్‌ సేనలు సాగిస్తున్న దౌర్జన్యాలను ఎదురించాలంటే.. సాయుధ పోరాటమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చాడు అల్లూరి సీతారామరాజు. మన్యానికే చెందిన గంటం దొర, మల్లు దొర, మొట్టడం వీరయ్యదొర, కంకిపాటి ఎండు పడాలు, సంకోజి ముక్కడు, వేగిరాజు సత్యనారాయణరాజు (అగ్గిరాజు), గోకిరి ఎర్రేసు (మాకవరం), బొంకుల మోదిగాడు వంటి 150 మందికి పైగా వీరులతో బృందాన్ని ఏర్పాటు చేశాడు. తొలుత చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేయాలని 1922 ఆగస్టు 19న నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడికి పాల్పడటంతో మన్యంలో తిరుగుబాటు మొదలైంది.

ఈ దాడిలో 11 తుపాకులు, 5 కత్తులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లను ఆ బృందం ఎత్తుకెళ్లింది. ఆగస్టు 23న రాత్రి కృష్ణదేవిపేట, ఆగస్టు 24న రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్లపైనా అల్లూరి బృందం దాడి చేసింది. ఆ మూడు పోలీస్‌ స్టేషన్ల నుంచి మొత్తం 26 తుపాకులు, 2,500కు పైగా మందుగుండు సామగ్రిని అల్లూరి బృందం ఎత్తుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన బ్రిటిష్‌ పాలకులు మన్యంలో విప్లవ దళాన్ని అంతం చేయడానికి కబార్డు, హైటర్‌ అనే అధికారులను చింతపల్లి ప్రాంతానికి పంపించింది. ఆ ఇద్దరు అధికారులను రామరాజు దళం గెరిల్లా యుద్ధరీతిలో సెప్టెంబర్‌ 24న హతమార్చింది.

ఆ తరువాత ఆక్టోబర్‌ 15న ముందుగానే సమాచారం ఇచ్చి మరీ అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌పై అల్లూరి బృందం దాడి చేయడం అత్యంత సాహసోపేతమైనదిగా గుర్తింపు పొందింది. అక్టోబర్‌ 19న రంపచోడవరం స్టేషన్‌ను పట్టపగలే ముట్టడించారు. ఆ తరువాత 1923 ఏప్రిల్‌ 17న అన్నవరం పోలీస్‌ స్టేషన్, 1923 జూన్‌ 10న మల్కన్‌గిరి పోలీస్‌ స్టేషన్, ట్రెజరీ, సెప్టెంబర్‌ 22న పాడేరు పోలీస్‌ స్టేషన్‌పైన దాడులు జరిగాయి. కాగా, కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తున్న రామరాజును 1924 మే 7న బ్రిటిష్‌ పోలీసులు బంధించగా.. మేజర్‌ గుడాల్‌ తుపాకీతో కాల్చి చంపాడు. 

నేడు భారీ బహిరంగ సభ 
చింతపల్లి స్టేషన్‌పై అల్లూరి బృందం దాడిచేసి వందేళ్లయిన సందర్భంగా సోమవారం చింతపల్లిలోని డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్‌ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హాజరు కానున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top