మామోగ్రఫీ పరికరాన్ని రూ.83.20లక్షలకు కొన్న తమిళనాడు మెడికల్ సర్వీస్ కార్పొరేషన్
కమీషన్లు పంచు.. ధరలు దంచు
వైద్య ఆరోగ్య శాఖలో భారీ కుంభకోణం
ఎంఎస్‌ఐడీసీ నుంచి నేతల వరకూ వసూళ్ల పర్వం
అంతా కలిపి 15 నుంచి 25% మేర కమీషన్ల బాదుడు
వాటాల పంపిణీతో రెట్టింపు రేట్లు కోట్ చేస్తున్న కాంట్రాక్టర్లు
కమీషన్ల కోసం ఆస్పత్రుల్లో అవసరం లేని పరికరాలు భారీగా కొనుగోళ్లు
సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో పరికరాల కొనుగోళ్లు భారీ స్కామ్‌లా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేసి నాణ్యమైన అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన ప్రభుత్వ పెద్దలు కమీషన్లే లక్ష్యంగా భారీ అవినీతికి తెర తీసినట్లు విమర్శలు హోరెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ ఎంఎస్‌ఐడీసీ) వైద్య శాఖ ఉన్నతాధికారి.. కీలక నేతలు.. ఇలా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకూ గొలుసు కట్టుగా ఈ కమీషన్ల దందా సాగుతోంది. దీంతో ముడుపుల భారాన్ని కూడా పరికరాల ధరలో కలిపేసి కాంట్రాక్టర్లు రెట్టింపు రేట్లు కోట్ చేస్తుండటంతో ఖజానాకు భారీగా గండి పడుతోంది.
కమీషన్లు ఇవ్వండి.. ధర మీ ఇష్టం..!
చంద్రబాబు సర్కారు వచ్చాక ప్రభుత్వాస్పత్రులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఎంఎస్‌ఐడీసీ అవినీతికి అడ్డాగా మారిపోయింది. మందులు, సర్జికల్స్, వైద్య పరికరాల కొనుగోళ్ల కాంట్రాక్ట్ ఖరారు మొదలు పర్చేజ్ ఆర్డర్ (పీవో), బిల్లులు మంజూరు దాకా ప్రతి స్థాయిలో ముడుపుల తంతు సాగుతోంది. ముఖ్యంగా పరికరాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఎంఎస్‌ఐడీసీ ఎక్యుప్‌మెంట్ విభాగానికి చెందిన కీలక అధికారి కమీషన్ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు. కొత్త కాంట్రాక్ట్‌లు, పీవోల జారీకి ఆయన స్థాయిలో మూడు శాతం కమీషన్ గుంజుతున్నట్లు తెలుస్తోంది.
ఇక బిడ్‌ల పరిశీలన, డెమోలలో లబ్ధి చేకూర్చే ఒప్పందం, బిల్లులు ప్రాసెసింగ్.. ఇలా వివిధ స్థాయిల్లో రెండు శాతం మేర దండుకుంటున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇలా ఎంఎస్‌ఐడీసీ స్థాయిలో ఐదు శాతం మేర కమీషన్లు వసూలు చేస్తున్నట్లు కాంట్రాక్టర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మరోవైపు కాంట్రాక్ట్ దక్కాలన్నా, పీవో రావాలన్నా సర్కార్‌లో కీలక నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందేనని కమీషన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న అధికారి తేల్చి చెబుతున్నారు. అలా కీలక నేతలు కనిష్టంగా 5 శాతం నుంచి 10 శాతానికిపైగా దోచుకుంటున్నట్లు సమాచారం.
అంతేకాదు.. కమీషన్‌లు దండుకోవడంలో ఆరోగ్య శాఖలోని ఓ అత్యున్నత అధికారి రాజకీయ నేతలతో పోటీపడుతున్నారు. ఆయన కూడా 5 శాతం నుంచి 10 శాతం మేర రాబడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాదికి చెందిన సదరు అత్యున్నత అధికారి అక్కడి డిస్ట్రిబ్యూటర్ సంస్థలతో పెద్ద మొత్తంలో వాటాలు మాట్లాడుకుని పారదర్శకంగా జరగాల్సిన టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా ఎంఎస్‌ఐడీసీ మొదలుకుని ప్రభుత్వంలోని నేతల వరకూ 15 నుంచి 25 శాతం మేర కమీషన్లు డిమాండ్ చేస్తుండటంతో కంపెనీలు వాటిలాభాలు కూడా వేసుకుని వైద్య పరికరాల ధరలను చుక్కలను తాకిస్తున్నాయి.
అయినా సరే.. తాము అడిగినంత కమీషన్ చెల్లిస్తే ఎంత ధర కోట్ చేసినా ఫర్వాలేదనే రీతిలో లోపాయికారీ ఒప్పందాలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో అటు అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దల అండదండలతో కాంట్రాక్టర్‌లు పక్క రాష్ట్రంలో విక్రయిస్తున్న వైద్య పరికరాల ధరల కంటే రెండు మూడు రెట్లు అధికంగా కోట్ చేస్తున్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవిగో..!
ధరలో ‘ఎక్స్‌ట్రా’క్టర్
తెలంగాణాలో రూ.1.04 లక్షలతో ప్రభుత్వాస్పత్రులకు సరఫరా చేసిన వ్యాక్యూమ్ ఎక్స్‌ట్రాక్టర్ పరికరాన్ని మన దగ్గర రూ.3.13 లక్షల చొప్పున సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏకంగా రూ.2 లక్షలకు పైగా అధికంగా చెల్లించి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై ఈ ఏడాది జనవరిలో ‘సాక్షి’లో కథనం రావడంతో సెకండరీ హెల్త్‌లో దాదాపు 230 పరికరాల కొనుగోలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే పెద్ద మొత్తంలో కమీషన్ల డీల్ కుదరడంతో ఎలాగైనా కొనుగోలు చేయాలనే లక్ష్యంతో రూ.3.13 లక్షల ధరకు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎంఎస్‌ఐడీసీ జస్టిఫికేషన్ తీసుకుంది. అదే ధర ఆధారంగా పరికరాల కొనుగోలుకు ఇండెంట్‌లు పంపాలని డీఎంఈ, డీఎస్‌హెచ్, డీహెచ్‌లకు లేఖ రాసింది.
ఈఎన్‌టీ సిమ్యులేటర్.. దబిడి ది‘బిడ్’!
బోధనాస్పత్రుల్లో పెద్దగా అవసరం లేని ఈఎన్‌టీ సిమ్యులేటర్ పరికరాల కొనుగోలు పేరిట స్కామ్‌కు తెర తీశారు. ఒకే రకం కంపెనీ పరికరాలను సరఫరా చేస్తామని రెండు సంస్థలు బిడ్‌లు వేస్తే సింగిల్ బిడ్‌గా పరిగణించి తిరస్కరించకుండా ఆమోదించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి నుంచి రూ.3 కోట్లు పలికే ఒక్కో పరికరాన్ని ఏకంగా రూ.4.44 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరోగ్య శాఖ అత్యున్నత అధికారి నేరుగా ఓ ఉత్తరాది కంపెనీతో డీల్ కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
హిస్టోస్కోపి.. మా‘యేఐ’నా..!
గైనిక్ విభాగాలకు సంబంధించి హిస్టోస్కోపి పరికరాల కొనుగోలుకు గత నెలలో ఆర్సీ ఖరారు చేశారు. ఈ పరికరాన్ని గత ప్రభుత్వంలో రూ.46 లక్షలతో సరఫరా చేసేలా బిడ్‌లు రాగా ఇప్పుడదే కంపెనీకి చెందిన పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట ఏకంగా రూ.69.45 లక్షలకు ఆర్సీ ఖరారు చేశారు.
ఎక్స్‌రే.. బాప్‌రే
800 ఎంఏ డిజిటల్ ఎక్స్‌రే పరికరాన్ని రూ.1.23 కోట్లతో కొనుగోలుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంట్రాక్ట్ ఖరారు చేశారు. తమిళనాడులో రూ.69 లక్షలతో కొనుగోలు చేసిన ఇదే పరికరాన్ని ఇక్కడ ఏకంగా రూ.50 లక్షలకుపైగా అధిక ధరతో కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఎంత మెరుగైన పరికరం కొన్నప్పటికి రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాటదని వైద్యవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇండెంటే లేకుండా ఆస్పత్రులకు పరికరాలు!
సాధారణంగా వైద్య పరికరాల కొనుగోలుకు ఆస్పత్రుల నుంచి ఆయా విభాగాధిపతుల కార్యాలయాలకు ఇండెంట్ రావాలి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు/సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు, చికిత్సల అవసరాల నివేదికను సేకరించాలి. అయితే ఈ ప్రక్రియను పక్కనపెట్టి నేరుగా డీఎంఈ కార్యాలయం నుంచి ఇండెంట్ పంపి గతేడాది ‘పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ 3 ఇన్ 1 ప్రోబ్’ పరికరాల కొనుగోళ్లను చేపట్టారు. ఏకంగా 78 పాయింట్ ఆఫ్ కేర్ అ్రల్టాసౌండ్ పరికరాలను బోధనాస్పత్రులకు డంప్ చేసినట్లు తెలుస్తోంది.
ఒక్కో పరికరానికి రూ.11.33 లక్షల చొప్పున దాదాపు రూ.9 కోట్లు ఇందుకు వెచ్చించారు. కీలక నేతతో కాంట్రాక్ట్ సంస్థ డీల్ కుదుర్చుకోవడంతో అవసరం లేని పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. 17 బోధనాస్పత్రులకు 78 పరికరాలు సమకూర్చాలని గతేడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) నుంచి ఎంఎస్‌ఐడీసీకి ప్రతిపాదన వెళ్లింది. ఒక్కో ఆస్పత్రికి రెండు నుంచి ఆరు పరికరాల చొప్పున అవసరముందని అందులో పేర్కొన్నారు.
కాంట్రాక్టు సంస్థ ఈ ఏడాది ప్రారంభం నుంచి పరికరాల సరఫరా చేపట్టింది. అసలు ఇండెంటే పెట్టకుండా ఈ పరికరాలు ఆస్పత్రులకు చేరుతుండడంతో ఖంగుతిన్న వైద్యులు అవి తమకెందుకని, వాటి అవసరమేలేదంటూ ఏకంగా డీఎంఈకి రాసిన లేఖల్లో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. కేవలం ప్రాథమిక నిర్ధారణ కోసం వాడే ఈ పాయింట్ ఆఫ్ కేర్ పరికరాలు తమకెందుకని వైద్యులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడ, విజయనగరం తదితర ఆస్పత్రుల్లో ఈ పరికరాల అవసరమేలేదని.. వెనక్కు తీసుకెళ్లిపోవాలని కాంట్రాక్టర్‌కు తేల్చి చెప్పినట్లు తెలిసింది. అయితే పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో కొన్నిచోట్ల వీటిని తీసుకుని స్టోర్స్, వార్డుల్లో మూలనపడేశారు. నిజానికి బోధనాస్పత్రులలో ఇప్పటికే అధునాతన అ్రల్టాసౌండ్, రేడియాలజీ స్కానింగ్ యంత్రాలున్నాయని వైద్య వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కమీషన్ల కోసం ఆస్పత్రులకు అవసరం లేని పరికరాలను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున ప్రజాధనం లూటీ చేస్తున్నారని చర్చించుకుంటున్నాయి.
ట్రెడ్‌మిల్ రూ.11లక్షలు!
మార్కెట్‌లో రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు పలికే ట్రెడ్‌మిల్‌ను ఏకంగా రూ.11 లక్షల చొప్పున బోధనాస్పత్రుల కోసం కొనుగోలు చేసేలా రేట్ కాంట్రాక్ట్ (ఆర్సీ) ఖరారు చేశారు. ఈ ధర చూసి అవాక్కైన డీఎంఈ అధికారులు కొనుగోలును వాయిదా వేస్తూ వస్తున్నట్లు సమాచారం.
అక్రమాల అ‘క్షయ’పాత్ర
టీబీ కార్యక్రమంలో భాగంగా 100 పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాల కొనుగోలుకు ఇటీవల టెండర్ ఖరారు చేశారు. ఒక్కో పరికరాన్ని రూ.21.84 లక్షలకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పోర్టబుల్ ఎక్స్‌రే పరికరాలను కేంద్ర ఆరోగ్య శాఖ టీబీ కార్యక్రమంలో భాగంగానే రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షలకే పలు రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఏపీకి కూడా 40 వరకూ పరికరాలు ఇప్పటికే అందాయి. బ్లూటూత్ కనెక్షన్‌తో కూడిన పోర్టబుల్ ఎక్స్‌రే, ల్యాప్‌ట్యాప్, ఇతర పరికరాలు కేంద్రం సరఫరా చేసిన ఎక్యుప్‌మెంట్‌లో ఉన్నాయి.
ఎక్స్‌రే తీస్తే రిపోర్ట్ ల్యాప్‌ట్యాప్‌లో జనరేట్ అయ్యే సౌకర్యం ఉంది. ఐతే ఇదే తరహా పరికరానికి ఏఐ సౌకర్యం పేరిట దాదాపు రూ.22 లక్షలతో ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. ఇది కేంద్రం సరఫరా చేసిన పరికరాల ధరలతో పోలిస్తే రూ.7 లక్షల మేర అధికం. రాష్ట్ర ప్రభుత్వం 100 పరికరాలను ప్రస్తుతం కొనుగోలు చేయబోతోంది. ఈ లెక్కన ఒక్కో పరికరానికి రూ.7 లక్షల చొప్పున రూ.7 కోట్ల మేర అదనంగా ఖర్చు చేస్తోంది. ఈ ఏడాది జనవరిలో టెండర్ పిలవగా కేవలం రెండు సంస్థల బిడ్‌లు మాత్రమే అర్హత సాధించాయి.
నామమాత్రపు పోటీ ఉన్నప్పటికీ తొలి పిలుపులోనే కాంట్రాక్ట్ ఖరారు చేశారు. మరోవైపు వెంటిలేటర్‌లు, అనస్తీషియా వర్క్‌స్టేషన్స్, ఇతర వైద్య పరికరాల కొరత ఆస్పత్రులను తీవ్రంగా వేధిస్తోంది. రోగులకు ఊపిరి పోయాల్సిన ఈ పరికరాల కొనుగోళ్లను మాత్రం ఏడాదిగా సాగదీస్తున్నారు. వివిధ టెండర్‌లలో రెండు మూడు బిడ్‌లు అర్హత సాధించినా పోటీ లేదని తిరస్కరిస్తున్నారు. దీన్నిబట్టి రేటు కుదిరితే ఒకలా లేదంటే మరోలా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అమ్మో.. మామోగ్రఫీ..
డీఎంఈ పరిధిలోని ఆరు బోధనాస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున మామోగ్రఫీ పరికరాల కొనుగోలుకు గత మార్చిలో కాంట్రాక్టు ఖరారు చేశారు. అల్లెంజర్స్ కంపెనీకి చెందిన ‘మామ్ వీనస్+’ మామోగ్రామ్ కొనుగోలు, ఇన్‌స్టలేషన్‌కు రూ.1.71 కోట్ల చొప్పున ధర ఖరారు చేశారు. ఇదే మోడల్ పరికరాన్ని నేరుగా తయారీ సంస్థ నుంచి తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ రూ.83.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఇన్‌స్టలేషన్‌కు రూ.12.82 లక్షలు ఇచ్చింది. అంటే ఒక్కో పరికరానికి సుమారు రూ.96 లక్షలు వెచ్చించారు.
ఇదే పరికరాన్ని ఏపీలో ఏకంగా రూ.1.71 కోట్లకు అంటే ఒక్కో పరికరంపై ఏకంగా రూ.75 లక్షలు అధిక ధరకు కొనుగోలు చేయడం గమనార్హం. అంటే ఆరు పరికరాలకు రూ.4.50 కోట్ల మేర అధికంగా ప్రజాధనాన్ని వెచ్చించారు. ఢిల్లీకి చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అత్యధిక ధరకు మామోగ్రఫీ పరికరాల కొనుగోలులో భారీ అవినీతికి తెర తీశారనే విమర్శలున్నాయి. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సదరు సంస్థకు ఎంఎస్‌ఐడీసీ దాసోహం అవుతోందన్న ఆరోపణలున్నాయి.


