బెడిసికొట్టిన బడా మోసం

Huge Scam Planned In The Name Of CMRF Check - Sakshi

ఎస్‌బీఐ నుంచి రూ.117.15కోట్లు కొల్లగొట్టేందుకు యత్నం

సీఎంఆర్‌ఎఫ్‌ నకిలీ చెక్కుల పేరిట పన్నాగం

బ్యాంకు అధికారుల అప్రమత్తతతో బయటపడిన బాగోతం

సాక్షి, అమరావతి: నకిలీ బ్యాంకు చెక్కులతో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి మూడు బ్యాంకుల ద్వారా ఏకంగా రూ.117.15 కోట్లు కొల్లగొట్టాలన్న కొందరి ఘరానా మోసం బెడిసికొట్టింది. చివరి నిమిషంలో ఆయా బ్యాంకు అధికారులు అప్రమత్తం కావడంతో భారీ మోసానికి అడ్డుకట్ట పడింది. ఒకేసారి మూడు రాష్ట్రాల నుంచి సీఎంఆర్‌ఎఫ్‌ నిధులను కొల్లగొట్టడానికి పకడ్బందీ పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ముఠాతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అటు ఎస్‌బీఐ ఉన్నతాధికారులను ఇటు సీఎంఆర్‌ఎఫ్‌ అధికారులను విస్మయానికి గురిచేసిన ఈ పన్నాగం వివరాలిలా ఉన్నాయి..

మూడు చెక్‌లు.. రూ.117.15 కోట్లు
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచిలో బ్యాంకు ఖాతా ఉంది. సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం జారీచేసిన రూ.52,65,00,000 విలువైన ఎస్‌బీఐ చెక్‌ను కర్ణాటకలోని మంగుళూరు బ్రాంచిలో డ్రా చేసేందుకు శుక్రవారం ఓ వ్యక్తి సమర్పించాడు. అంత పెద్ద మొత్తం కావడంతో ఆ చెక్‌ను పాస్‌ చేస్తున్న మిగతా బ్యాంకు అధికారికి చివరి నిమిషంలో సందేహం వచ్చింది. దాంతో ఆయన వెంటనే వెలగపూడిలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ అధికారులను.. వారు సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులను వాకబు చేశారు. అంత మొత్తంతో తాము ఎవరికీ చెక్‌ ఇవ్వలేదని సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ చెక్‌ను పాస్‌ చేయొద్దని మంగుళూరులోని బ్రాంచి అధికారులను ఆదేశించారు. దాంతో ఎస్‌బీఐ అధికారులు తమ ప్రధాన కార్యాలయంతోపాటు ప్రాంతీయ కార్యాలయాలనూ  అప్రమత్తం చేశారు. 

  • ఇదే తరహాలో ఢిల్లీలోని ఎస్‌బీఐ సీసీపీసీ–1 బ్రాంచ్‌లో శనివారం రూ.39,85,95,540 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌  ఖాతా నుంచి ఎస్‌బీఐ చెక్‌ను డ్రా చేసేందుకు సమర్పించారు. ఆ బ్యాంకు అధికారులు కూడా ఆ చెక్‌ను నిర్ధారించుకునేందుకు వెలగపూడి ఎస్‌బీఐ శాఖను వాకబు చేశారు. ఆ చెక్‌ కూడా తాము జారీచేయలేదని సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులు చెప్పారు. దాంతో ఆ చెక్‌ను కూడా పాస్‌ చేయకుండా బ్యాంకు అధికారులు నిలుపుదల చేశారు.
  • ఇక కోల్‌కతలోని మోగ్రాహట్‌ ఎస్‌బీఐ బ్రాంచిలో కూడా రూ.24,65,00,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ను డ్రా చేసేందుకు శనివారం సమర్పించారు. దానిపై ఆరా తీయగా అది కూడా నకిలీ చెక్‌ అనే నిర్ధారణ అయ్యింది. దాంతో మూడు వేర్వేరు చెక్‌ల ద్వారా రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు వేసిన పన్నాగాన్ని బ్యాంకు అధికారులు సమర్థంగా నిలువరించగలిగారు. 

ప్రొఫెషనల్‌ ముఠా పనే?
కేవలం రెండ్రోజుల్లో మూడు వేర్వురు రాష్ట్రాల నుంచి మూడు నకిలీ చెక్‌లతో ఏకంగా రూ.117కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు యత్నించడం ఎస్‌బీఐ, సీఎంఆర్‌ఎఫ్‌ విభాగం అధికారులను కలవరపరుస్తోంది. ఇంత పకడ్బందీగా పన్నాగం పన్నారంటే దీని వెనుక ఓ ప్రొఫెషనల్‌ ముఠానే ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆ చెక్‌లు వారికి ఎలా వచ్చాయన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎవరైనా ఉద్యోగులు ఇందుకు సహకరించి ఉంటారా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారిస్తే ఈ ఘరానా మోసం గుట్టు వీడుతుంది. అందుకే ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top