మూడు రాజధానుల కోసం గళమెత్తిన విద్యార్థి లోకం 

Huge rally in Ongole city for Three Capitals Andhra Pradesh - Sakshi

ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ నినాదాలు 

ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ 

ఒంగోలు సబర్బన్‌: మూడు రాజధానుల కోసం విద్యార్థి లోకం గళమెత్తింది. ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు అంటూ ఒంగోలు నగరం మార్మోగింది. శనివారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముంగమూరు రోడ్డు జంక్షన్‌ నుంచి లాయర్‌ పేట షిర్డీ సాయిబాబా గుడి వరకు సాగింది.

విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణతో పాటు పరిపాలనా వికేంద్రీకరణ జరిగిన నాడే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి పథంలో నడుస్తాయన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తుంటే.. ప్రతిపక్ష టీడీపీతో పాటు దాని తోక పార్టీలు అమరావతే రాజధాని కావాలని పట్టుబట్టడం వెనుక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలే కారణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ యువనేత బాలినేని ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవశ్యమని పేర్కొన్నారు.

తెలంగాణ విషయంలో మోసపోయింది చాలదన్నట్లు అమరావతి ఒక్కదానినే రాజధానిని చేయాలని టీడీపీ పట్టుబట్టడం వెనుక ఆంతర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయం నిర్మిస్తే వర్షం వస్తే వర్షపు నీరు కారి బకెట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన ఘనత టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుదేనని విమర్శించారు.

రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాల్సింది పోయి ఏ ప్రాంతం ఏమైపోతే మాకేమి.. అమరావతి ఒక్కటే బాగుపడితే చాలు అన్న చందంగా చంద్రబాబు ఉండటాన్ని మిగతా ప్రాంతాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రేల్లా అమర్‌నాథరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కుప్పం ప్రసాదు, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు దాట్ల యశ్వంత్, విద్యార్థి విభాగం నాయకులు కొండూరు నవీన్, కృష్ణారెడ్డి, పురిణి శ్రీనివాసులురెడ్డి, నరశింహ, శ్రీకాంత్‌రెడ్డి, చంద్ర, హరీష్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top