అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపం.. | Huge lapse in Amaravati construction works | Sakshi
Sakshi News home page

అమరావతి నిర్మాణ పనుల్లో భారీ లోపం..

May 15 2026 9:11 AM | Updated on May 15 2026 12:06 PM

Huge lapse in Amaravati construction works

20 రోజులుగా క్రేన్‌ అడ్డుపెట్టి బ్రిడ్జి పడకుండా పాట్లు

బకింగ్‌హామ్‌ కాలువపై రూ.68 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి

ఒరిగిన గడ్డర్లను తొలగిస్తున్న అధికారులు

అమరావతి నిర్మాణ పనుల్లో ఇదీ సంగతి!

తాడేపల్లి రూరల్‌: అమరావతి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం కారణంగా నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గడ్డర్లు ఒరిగిపోయాయి. 20 రోజులుగా ఈ బ్రిడ్జి పూర్తిగా పడిపోకుండా అధికారులు క్రేన్‌ను అడ్డంపెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాజధానికి అతి ముఖ్యమైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అనుసంధానంగా బకింగ్‌హామ్‌ కాలువ–కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్లుగా చెబుతున్న స్టీలు బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తాయి.

స్టీలు బ్రిడ్జి ఏర్పాటు చేసే సమయంలో రెండు పిల్లర్ల మధ్య నిర్మించిన గడ్డర్లు ఒక పక్కకు వాలిపోయాయి. అవి పడిపోకుండా క్రేను అడ్డంపెట్టిన అధికారులు.. గురువారం వాటిని తొలగించే పనులు చేపట్టారు. రాజధానికి, 16వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ఉండవల్లి వరకు నిర్మించారు. ఇక్కడి నుంచి ఉండవల్లి సెంటర్‌ బకింగ్‌హామ్‌ కెనాల్‌ మీదుగా తాడేపల్లి కృష్ణాకెనాల్‌ రైల్వే బ్రిడ్జిని దాటిస్తూ మణిపాల్‌ ఆస్పత్రి వరకు బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఆ బ్రిడ్జి నిర్మాణం వ్యయంతో కూడుకున్నది కావడంతో సీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ పెద్దలు మంగళగిరి – ప్రకాశం బ్యారేజ్‌ పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ కొండవీటి వాగు, బకింగ్‌హామ్‌ కెనాల్‌ను దాటిస్తూ అనుమతులు లేకపోయినా తాత్కాలికంగా రూ.68 కోట్లతో స్టీలు బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.

బకింగ్‌హామ్‌ కెనాల్‌లో నీటి ప్రవాహానికి అడ్డురాకుండా ఆ చివర, ఈ చివర నాలుగు పిల్లర్లు ఏర్పాటు చేసి మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్‌ గడ్డర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జికి.. ప్రకాశం బ్యారేజ్‌కి దక్షిణం వైపు బిగించిన స్టీలు గడ్డర్లు వంకర పోయి ఒరిగిపోయినట్లు సీఆర్‌డీఏ, ఇంజినీరింగ్‌ అధికారులు గుర్తించారు. గతనెల 20వ తేదీన స్టీలు బ్రిడ్జిపై కాంక్రీట్‌ వేసే సమయంలో ఈ లోపాన్ని గమనించారు. అప్పటి నుంచి బ్రిడ్జి మరింత ఒరగకుండా భారీ క్రేన్‌తో గడ్డర్‌ను నిలబెట్టారు. ఇంజినీర్లు పరిశీలించి.. ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించడంతో అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గడ్డర్లు తొలగింపు చేపట్టారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో చేపడుతున్నామని చెప్పారు. కానీ, రాజధాని పనులు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement