Nuziveedu Mango: లండన్‌కు బంగినపల్లి మామిడి

Huge Exports of mangoes even in corona times - Sakshi

విపత్తులోనూ ఎగుమతుల జోరు

నూజివీడు నుంచి 1.5 టన్నులు ఎగుమతి

సాక్షి, అమరావతి: కరోనా విపత్తులోనూ మామిడి ఎగుమతుల జోరు కొనసాగుతుంది. రెండ్రోజుల క్రితం దక్షిణకొరియాకు తొలి కన్‌సైన్‌మెంట్‌ వెళ్లగా, తాజాగా నూజివీడు నుంచి లండన్‌కు తొలి కన్‌సైన్‌మెంట్‌ వెళ్లింది. లండన్‌కు చెందిన వ్యాపారులు నూజివీడు ప్రాంతంలో పండే బంగినపల్లి రకం మామిడి 50 టన్నుల కోసం ఇక్కడి రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు తొలి కన్‌సైన్‌మెంట్‌గా నూజివీడు మండలం హనుమంతునిగూడెంకు చెందిన రాఘవులుకు చెందిన 1.5 టన్నుల బంగినపల్లి మామిడిలోడు ముంబై మీదుగా విమానంలో లండన్‌ బయల్దేరింది.

రాఘవులు తోటలో పండిన బంగినపల్లి మామిడిని పామర్రు ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌లో ప్రాసెస్‌ చేయగా, ప్రత్యేక కంటైనర్‌ ద్వారా విమానంలో ముంబై పంపించారు. అక్కడ నుంచి లండన్‌కు పంపించనున్నారు. ఈ నెలాఖరులోగా ఒప్పందం మేరకు మిగిలిన బంగినపల్లి మామిడిని లండన్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నూజివీడు ఉద్యాన శాఖ ఏడీ శ్రీనివాసులు ‘సాక్షి’కి తెలిపారు. రైతుకు టన్నుకు రూ.32 వేలు చొప్పున చెల్లించారని చెప్పారు. కరోనా ఉధృతి కాస్త తగ్గితే నిర్దేశించిన లక్ష్యం మేరకు యూరప్, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తాయన్న ఆశాభావంతో ఉన్నామని ఆయన చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top