Heavy Rains in Andhra Pradesh: ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

Heavy Rains In Andhra Pradesh for next two days - Sakshi

ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఉప్పొంగిన కొండ వాగులు, వంకలు

ఏజెన్సీలో రాకపోకలకు ఆటంకం

నీటి మునిగిన పంట పొలాలు

జలకళతో ఉట్టిపడుతున్న జలాశయాలు, చెరువులు

పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో ఇద్దరు గల్లంతు, మరో ఇద్దరు మృతి

నేడు, రేపు ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం

గత రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కోస్తా జిల్లాలు తడిసిముద్దయ్యాయి. పంట పొలాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో వరద ఉధృతికి, పిడుగుపాటుకు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఇద్దరు గల్లంతవ్వగా, మరో ఇద్దరు మృతి చెందారు. కుండపోతగా కురిసిన వానలకు కొండ వాగులు, వంకలు, నదులు ఉధృతరూపం దాల్చాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

సాక్షి, నెట్‌వర్క్‌: కృష్ణా జిల్లాలో సోమవారం 1.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు మెట్ట, డెల్టా, ఏజెన్సీ ప్రాంతాలు జలమయమయ్యాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని చుట్టుముట్టాయి. ఎటపాకలో మిర్చి తోటలు నీట మునిగాయి. కాకినాడలో జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం, ప్రభుత్వ ఆస్పత్రిలోకి వర్షపు నీరు భారీగా చేరడంతో అధికారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోట్‌క్లబ్‌ కాంపౌండ్‌ వాల్‌ కూలిపోయింది. జిల్లాలో సగటు 25.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్‌ శ్రీకేష్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. తోటపల్లి, మడ్డువలస జలాశయాలకు భారీగా నీరు వచ్చి చేరుతోంది. విజయనగరం జిల్లాలో చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. చంపావతి, సువర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తోటపల్లి, వట్టిగెడ్డ, తాటిపూడి జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తడిసి ముద్దయింది. ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గుండేటి వాగు పొంగి ప్రవహించడంతో 10 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లింగపాలెం మండలం యడవల్లిలో భారీ వర్షానికి ఇంటి గోడ కూలి గొడ్డేటి నాగేశ్‌ (55) మృతి చెందాడు. 

యువతి గల్లంతు
బుట్టాయగూడెం మండలం అటవీ ప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయ దర్శనానికి వెళ్లిన మనీషా వర్మ (23) అనే యువతి కొండవాగుల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సోదరుడు, మరో ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. 

రాష్ట్రానికి భారీ వర్ష సూచన
వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. రాగల రెండు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతుందని తెలిపారు. ఇక గురువారం మోస్తరు వర్షం పడుతుందన్నారు. కాగా, సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సగటున 6.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

విశాఖ జిల్లాలో ఉధృతంగా వరాహ, శారదా నదులు
విశాఖ ఏజెన్సీలో గెడ్డలు, కొండవాగులు, వరాహ, శారద నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అనంతగిరి మండలం పైడపర్తికి చెందిన పాడి కన్నయ్య (41) వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. అలాగే మాడుగుల మండలం గొప్పులపాలెంకు చెందిన పాగి నాగమణి (28) పిడుగుపాటుతో మృతి చెందింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top