కృష్ణా జిల్లాలో వర్ష బీభత్సం

Heavy Rainfall Hits Krishna District In Andhra Pradesh - Sakshi

సాక్షి, కృష్ణా : వాయుగుండం కృష్ణా జిల్లా పాలిట జలగండంగా మారింది . ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా..రహదారులు నీటమునిగాయి . లోతట్టుప్రాంతాలు జలమయమవ్వగా..  భారీగా పంటనష్టం వాటిల్లింది. వర్ష బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవళ్ళుతొక్కుతోంది. వరద ప్రవాహ ఉదృతి గంటగంటకూ పెరిగిపోతోంది .జలాశయాలు ,చెరువులు నిండుకుండలని తలపిస్తున్నాయి . వైరా ఏరు ,కట్టలేరు ,మున్నేరు లతో పాటు పిల్లవాగులు వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. (చదవండి : అత్యధికంగా భోగాపురంలో 11 సెం.మి వర్షపాతం)

విజయవాడ సిటీ లో వన్ టౌన్ ,గాంధీ బొమ్మ సెంటర్, గణపతి రోడ్ ,కబేలా సెంటర్ ,రోటరీ నగర్ ,భవానిపురం,సింగ్ నగర్ ,మొగల్రాజ పురం , పాలిక్లినిక్ రోడ్ ,రామవరప్పాడు  ,ఆటోనగర్ ,అపిక్ కాలనీ , చిట్టినగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది.లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీటిని మోటార్ల  ద్వారా తోడి  మున్సిపల్ సిబ్బంది  ఊరట కల్పించారు. విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో నివాసాలపై కొండచరియలు విరిగిపడి వ్యక్తి మృతిచెందాడు. ఇల్లు  ధ్వంసం కాగా .. మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని  హాస్పిటల్ కి తరలించినా ఫలితం దక్కలేదు .దుర్గ గుడి ఘాట్ రోడ్డు లో కొండ చరియలు  విరిగిపడ్డాయి .భక్తులు ఎవరు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది .ఘాట్ రోడ్డు లో వచ్చే వాహనాలనుయ ముందుజాగ్రత్త చర్యగా అధికారులు  నిలిపివేశారు .

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి రాజీవ్ నగర్లో  ఇళ్లలోకి  వరద నీరు చేరింది.ముసునూరు మండలం చెక్కపల్లి, పెదపాటివారిగూడెం హరిజనవాడలు జలదిగ్బంధంలో  చిక్కుకున్నాయి. తిరువూరు,గంపలగూడెం,ఏ-కొండూరు, విస్సన్నపేట మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది . ఏ-కొండూరు మండలంలో మారేపల్లి- పొలిశెట్టిపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.తిరువూరు మండలంలో అక్కపాలెం-తిరువూరు మధ్య సంబంధాలు తెగిపోయాయి. గంపలగూడెం మండలం వినగడప- తోటమూల మధ్య కట్టలేరు వాగు ఉదృతంగా ప్రవహించటంతో వాహనరాకపోకలు నిలిచిపోయాయి. వల్లంపట్ల- కాకర్ల రహదారిపై వాగు ఉగ్రరూపం దాల్చింది. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాగులు వద్ద రెవెన్యూ అధికారులు సిబ్బందిని నియమించారు. మైలవరం దేవుని చెరువులో, రోడ్లన్నీ జలమయమై ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చేసింది . 

రెడ్డిగూడెం మండలం ఓబుళాపురం, నరుకుళ్లపాడు వద్ద వరద నీరు వచ్చేసింది .నాగసానిపాటి చెరువు వద్ద ఆర్ అండ్ బీ రహదారి ని వరద ముంచెత్తింది. కైకలూరు  నియోజకవర్గ పరిధిలో భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . వెలమపేట కాలనీలొ ఇళ్ళలోకి వర్షపు నీరు వచ్చేసింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెడన, బంటుమిల్లి ,కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో  వర్షాలకు పల్లపు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి .బుడమేరు వాగు పొంగి రోడ్డు పై  ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం పోలీస్ స్టేషన్ ప్రాంగణం జలమయం అయింది .కంచికచర్ల వద్ద 65 నెంబర్  జాతీయ రహదారిపై రెండు అడుగుల మేర నీటి ప్రవాహం రావటంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. వర్షం బీభత్సానికి కొటికలపూడి వద్ద వాగులో  ఒక యువకుడు గల్లంతయ్యాడు . ఇబ్రహీంపట్నం సమీపంలోని పెదలంకకు చెందిన కొత్తపల్లి నవీన్‌గా గుర్తించి గాలిస్తున్నారు. నందిగామ మండలం అన్నాసాగరం వద్ద  శనగపాడు వాగులో మరో ఇద్దరు  చిక్కుకోగా.. వారిని రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా అరటి ,పసుపు ,వరి ,ఆకుతోటలు తదితర పంటలు నీటమునిగాయి .

అల్లకల్లోలంగా మారిన సముద్రం
వాయుగుండం తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా మారింది .తీరంలో ఈదురు గాలులు ఉదృతంగా వీస్తున్నాయి .కడలి కల్లోలంగా మారటంతో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి .వేటపై నిషేధం విధించిన అధికారులు పరిస్థితి చక్కపడే వరకు సముద్రం లోకి వెళ్లవద్దని జాలర్లకు హెచ్చరికలు జారీ చేసారు .కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు .సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన పోలీస్ శాఖ తీరం లో బందోబస్తు ఏర్పాటు చేసింది .అన్నిశాఖలను సమన్వయ పరుచుకొంటూ ముందుకు సాగుతోంది .

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top