ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే..ఇప్పుడు కర్మాగారాల ఖిల్లా!

Gundlapalli Growth Center Now It Is Factory Fort - Sakshi

గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో పారిశ్రామిక ప్రగతి

400కుపైగా పరిశ్రమల ఏర్పాటు

గ్రానైట్, కెమికల్, ఫార్మా, కుర్చీలు, రంగులు, తదితర ఫ్యాక్టరీల నిర్వహణ

ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి

పరోక్షంగా మరో 20 వేల మందికి చేతినిండా పని

ప్రభుత్వ చేయూతతో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు

గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌.. మద్దిపాడు మండలంలో జాతీయ రహదారి పక్కనున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు చిన్నపాటి టీ బంకు మాత్రమే ఉండేది. కాలక్రమంలో కర్మాగారాల ఖిల్లాగా మారింది. ప్రస్తుతం 400కుపైగా పరిశ్రమలతో 40 వేల మందికిపైగా ఉపాధి కల్పిస్తోంది. వృత్తి నైపుణ్యం గల వారికి వరంగా నిలిచింది. మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వేల మందికి ఉపాధి లభిస్తోంది. భారీ ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో అనేక రంగాల వారికి జీవనోపాధి దొరుకుతోంది. ప్రత్యక్షంగా కొంతమందికి, పరోక్షంగా మరికొంత మందికి బతుకుదెరువైంది. ఎంతోమంది ఆకలి తీరుస్తున్న గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... 

మద్దిపాడు: అది 1986వ సంవత్సరం.. జిల్లా కలెక్టర్‌గా ఎన్‌.జయప్రకాష్‌ నారాయణ్‌ పనిచేస్తున్నారు. అప్పటికి పూర్తిగా వెనకబడిన జిల్లాగా ఉన్న ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అభివృద్ధి వైపు నడిపించాలని భావించారు. మద్దిపాడు మండలంలోని వెయ్యి ఎకరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ప్రభుత్వ భూములు కాగా, మరికొన్ని భూములను రైతులు ఇచ్చేశారు. 

మండలంలోని గుండ్లాపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 112 ఎకరాలు, అన్నంగి రెవెన్యూ పరిధిలోని 952 ఎకరాలు కలిపి మొత్తం 1,062 ఎకరాల భూములను ఏపీఐఐసీ ద్వారా ఆధీనంలోకి తీసుకున్నారు. వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తులు ప్రారంభించారు. ఆ తర్వాత చాలా కాలం వరకూ కూడా ఆ ప్రాంతంలో ఒకేఒక టీ బంకు మినహా మరేమీ ఉండేవి కావు. ఆ టీ బంకు కూడా హైవే పక్కనున్న ప్రాంతం కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మాత్రమే నడిచేది. అలాంటి ప్రాంతం నేడు 24/7 టీ స్టాళ్లతో కళకళలాడుతోంది. పరిశ్రమలకు పెట్టింది పేరుగా మారింది. ఉపాధికి నిలయంగా నిలిచింది. గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ పేరుతో పారిశ్రామిక పట్టణంగా రూపుదిద్దుకుంది. 

వైఎస్సార్‌ హయాంలో అభివృద్ధికి అడుగులు... 
గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ ఏర్పాటైన తర్వాత చాలా కాలం వరకూ విద్యుత్‌ సౌకర్యం కూడా లేదు. లోపలికి వెళ్లేందుకు రహదారులు కూడా లేవు. పదేళ్ల వరకూ పారిశ్రామికవేత్తలు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అతికష్టం మీద 1995లో ఒకటీరెండు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. 

మెల్లగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడం మొదలైంది. మద్దిపాడు మండలంలోని మల్లవరం కొండ వద్ద గుండ్లకమ్మ నదిపై రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌.. అనతికాలంలోనే 2008 నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. ఈ పరిణామం గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ అభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. గుండ్లకమ్మ డ్యామ్‌తో ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ సబ్సిడీపై రుణాలిచ్చారు. విద్యుత్‌ చార్జీల్లో రాయితీలు ప్రకటించారు. ప్రభుత్వం అందించిన పలు రకాల ప్రోత్సాహాలతో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌లో ప్లాట్ల కొనుగోలుకు పారిశ్రామికవేత్తలు పరుగులు తీశారు. పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడటంతో ఏపీఐఐసీ అధికారులు అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు, నీరు, విద్యుత్, తదితర మౌలిక వసతులు కల్పించారు. 

పలు రకాల ఫ్యాక్టరీలు ఏర్పాటు... 
పరిశ్రమల స్థాపనకు ముఖ్యంగా కావాల్సింది రవాణా సౌకర్యం. ఆ తర్వాత కనీస వసతులు. అలాంటిది గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం గొప్ప అవకాశంగా మారింది. ప్రభుత్వం కూడా ప్రోత్సహించడంతో పలు ఫ్యాక్టరీల యజమానులు గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఇప్పటి వరకూ మొత్తం 400 పైచిలుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఎక్కువ శాతం గ్రానైట్‌ రంగానికి చెందిన ఫ్యాక్టరీలే ఉన్నాయి. వాటితో పాటు కెమికల్‌ ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, నీల్‌కమల్‌ కుర్చీల తయారీ ఫ్యాక్టరీ, విండ్‌మిల్స్‌ తయారీ ఫ్యాక్టరీ, రంగులు, గ్లౌజ్‌ల తయారీ వంటి పలు రకాల ఫ్యాక్టరీలు ప్రస్తుతం నడుస్తున్నాయి. 

పెద్దపెద్ద ఫ్యాక్టరీల నుంచి చిన్నపాటి పరిశ్రమల వరకూ నిర్వహిస్తుండటంతో వాటిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వెల్లువలా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సుమారు 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 20 వేల మందికిపైగా పరోక్షంగా గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. మన రాష్ట్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలు, జిల్లాలతో పాటు చిత్తూరు, శ్రీకాకుళం వంటి దూర ప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్‌ వర్కర్లు వచ్చి పనిచేస్తున్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బీహార్, రాంచి, యూపీ, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా కార్మికులు వచ్చి పనిచేస్తున్నారు. 

శరవేగంగా గ్రోత్‌ సెంటర్‌ అభివృద్ధి 
గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాల పాటు ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఆగిపోయినా.. ప్రస్తుతం అన్ని పరిశ్రమలు పుంజుకుంటున్నా యి. విద్యుత్‌ సమస్యను అధిగమిస్తే పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగే ఆవకాశాలున్నాయి. గ్రోత్‌ సెంటర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు జంగిల్‌ క్లియరెన్స్, వీధి దీపాల ఏర్పాటు, సైడు డ్రెయిన్ల నిర్మాణాలకు అంచనాలు వేస్తున్నాం. అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించేలా గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ను తీర్చిదిద్దుతాం. 
– జే వెంకటేశ్వర్లు,జోనల్‌ మేనేజర్, ఏపీఐఐసీ 

గ్రానైట్‌ మార్కర్‌గా స్థిరపడ్డా 
గతంలో గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్లో పలు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటవడంతో ప్రస్తుతం సొంతంగా గ్రానైట్‌ మార్కింగ్‌ చేసుకుంటున్నాను. కంపెనీల వారికి సరఫరా చేసే స్థాయికి ఎదిగాను. నాతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల యువతకు గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ ఉపాధి కల్పించింది. దూరప్రాంతాల నుంచి కూడా స్కిల్డ్‌ వర్కర్లు వచ్చినా.. ఇక్కడి వారికి ఉపాధి ఏమాత్రం తగ్గలేదు.
– నలమలపు శ్యామసుందరరెడ్డి, గ్రానైట్‌ మార్కర్‌ 

గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌తో అన్ని రకాలుగా అభివృద్ధి 
వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందేందుకు గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగపడుతోంది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ప్రస్తుతం అధిక సంఖ్యలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. చుట్టుపక్కల నిరుద్యోగులకు చక్కటి ఉపాధి అవకాశాలు దొరికాయి. 2004లో ఫ్యాక్టరీల యజమానులకు రాయితీలు ప్రకటించడంతో గ్రోత్‌ సెంటర్‌ అభివృద్ధి ఊపందుకుంది.   
– చుండూరి రవిబాబు, రైస్‌మిల్‌ ఓనర్‌ 

త్వరలో ఐటీ కంపెనీ ప్రారంభం... 
గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌లోకి త్వరలో ఒక ఐటీ కంపెనీ కూడా చేరనుంది. టెక్‌ బుల్స్‌ పేరుతో ఏర్పాటు చేయనున్న ఐటీ కంపెనీ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రారంభమే తరువాయి. నాలుగు రోజుల క్రితమే మాజీ మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి కార్జ్‌ సర్ఫేస్‌ పేరుతో గ్రానైట్‌ రంగానికి చెందిన భారీ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించారు. సెజ్‌లో మరికొన్ని భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 

జాతీయ రహదారికి రెండోవైపు బూరేపల్లి గ్రామస్తులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా ప్రస్తుతం రద్దీగా మారింది. జనజీవనం పెరిగిపోవడంతో టీ స్టాళ్లు, హోటళ్లు, సెల్‌ఫోన్‌ దుకాణాలు, నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు షాపులతో నిండిపోయి నిరుద్యోగులకు పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. గ్రోత్‌సెంటర్లలోని ఫ్యాక్టరీల్లో తయారయ్యే ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు కంపెనీలు,ఆఫీసులు వచ్చాయి. వాటి ద్వారా మరికొంత మందికి ఉపాధి లభిస్తోంది. ఈ విధంగా రోజురోజుకూ పలు రకాలుగా అభివృద్ధి చెందుతున్న గుండ్లాపల్లి గ్రోత్‌ సెంటర్‌ ఉపాధికి అడ్డాగా మారడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top