Terrace Gardens: డాబాలే.. పొలాలై..  | Sakshi
Sakshi News home page

Terrace Gardens: డాబాలే.. పొలాలై.. 

Published Sat, Aug 27 2022 9:10 AM

Growing Terrace Garden Culture Now - Sakshi

ఉదయం లేచింది మొదలు ఈ రోజు ఏం కూర వండాలని తెగ ఆలోచిస్తుంటారు ఆడవాళ్లు. కానీ డా.బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వల్లూరి సత్యవేణి మాత్రం డాబా మీదకు వెళతారు. అప్పుడే తాజాగా కాసిన కూరగాయలు తెచ్చి వంట కానిచ్చేస్తారు. అక్కడేమి అద్భుతం ఉండదు. సత్యవేణి ప్రేమగా పెంచుకుంటున్న గార్డెన్‌ ఉంటుంది. ఆమె ఒక్కరే కాదు.. ఇప్పుడు చాలా ఇళ్ల వద్ద కనిపిస్తున్న పరిస్థితి ఇది. కోవిడ్‌ తర్వాత ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధకు ప్రభుత్వ ప్రోత్సాహం తోడవడంతో చాలా ఇళ్లపై డాబాలు మినీ వనాలను తలపిస్తున్నాయి. వీటితో పాటు పొలం గట్లు, దిమ్మలు కూరగాయల పాదులు, ఆకుకూరలతో నిండిపోతున్నాయి. 

గతంలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయం చేయడం వలన కౌలు రైతులు పెద్దగా ఉండేవారు కాదు. పొలాల్లో దిమ్మలపై పశువుల మకాంలు ఏర్పాటు చేసుకుని ఖాళీ స్థలాల్లో కూరగాయలు, పొలం గట్లపై కందులు సాగు చేసేవారు. తద్వారా ఇంటి అవసరాలు తీరడంతో పాటు మార్కెట్‌లో అమ్మడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేవారు. మరోపక్క గృహిణులు ఇంటి పెరటిలో కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచేవారు. కాలక్రమంలో వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోగా కౌలు రైతులు పెరిగారు. శిస్తు చెల్లించే క్రమంలో సాగు విస్తీర్ణం పెంచుకునేందుకు కౌలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. పారలంకతో గట్లు కుచించుకుపోతుండగా దిమ్మలు కరిగిపోయి పొలాల్లో చాలా వరకూ కూరగాయల సాగు తగ్గిపోయింది. మరోపక్క ఇళ్ల వద్ద పెరడులు కనుమరుగైపోయి మార్కెట్‌లో దొరికే ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరల పైనే ఆధారపడాల్సి వస్తోంది. 

వెలగతోడులో పొలం గట్లపై వేసిన బెండ మొక్కలను పరిశీలిస్తున్న ప్రకృతి వ్యవసాయాధికారి 

కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం 
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా సేంద్రియ పద్ధతిలో ఇళ్ల వద్ద, పొలాల్లోను కూరగాయలు, ఆకుకూరల సాగును ప్రోత్సహిస్తోంది. గ్రామాల్లోని డ్వాక్రా మహిళలకు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సేంద్రియ సేద్యం ద్వారా తక్కువ ఖర్చుతో కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ ఇస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల (ఆర్‌బీకే) ద్వారా వారికి వంగ, మిరప, టమాటా, ఆనప, బెండ వంటి కూరగాయలతో పాటు గోంగూర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరల విత్తనాలు అందజేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యం పట్ల ప్రజల్లో శ్రద్ధ పెరిగింది. మార్కెట్‌లో రసాయనాలు వినియోగించిన కూరగాయలు కొనే కన్నా ఇంటి వద్ద సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

వీలైనంతలో ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలు, మేడ పైన కూరగాయలు, ఆకుకూరలు పెంచుకుంటున్నారు. మరోపక్క పొలంబడి ద్వారా రైతులకు శిక్షణ ఇచ్చి గట్లు, దిమ్మలపై కూరగాయల సాగును కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రోత్సహిస్తోంది. ఆకుకూరలు, కాయగూరలతో పాటు మునగ, బొప్పాయి విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతిలో లభించే వనరులతో కషాయాల తయారీపై శిక్షణ ఇస్తూ సేంద్రియ పద్ధతిలో రైతులతో సాగు చేయిస్తున్నారు. ఆయా పంటలను ఎప్పటికప్పుడు వ్యవసాయ సిబ్బంది పరీక్షించి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ఈ తరహాలో పండించిన వాటికి మంచి డిమాండ్‌ ఉంటోంది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే సేంద్రియ కూరగాయలను రెట్టింపు ధరకు కొనుగోలు చేసేందుకు కూడా వినియోగదారులు వెనుకాడటం లేదు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలోని 14,800 మంది మహిళలు కిచెన్‌ గార్డెన్‌ ద్వారా సేంద్రియ పద్దతిలో ఇళ్ల వద్ద కూరగాయలు పెంచుతుండగా, 5,400 మంది రైతులు పొలం గట్లు, దిమ్మలపై వీటిని సాగు చేస్తున్నారు. మరింత మందితో సాగు చేయించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ప్రకృతి వ్యవసాయ అధికారులు తెలిపారు. 

మా ఇల్లే మినీ వనం 
ప్రకృతి వ్యవసాయ అధికారుల సూచనలతో సేంద్రియ సాగుపై అవగాహన పెంచుకుని మేడపై సాగు చేయడం మొదలు పెట్టాం. ఆకుకూరలు, కూరగాయలతో పాటు డ్రాగన్‌ ఫ్రూట్, ద్రాక్ష, అంజీర వంటి పండ్లు, పూల మొక్కలు కూడా పెంచుతున్నాం. ఇంట్లో కూరల కోసం వీటి నుంచి వచ్చిన కూరగాయలు, ఆకు కూరలనే వినియోగిస్తుంటాం. ఎక్కువగా కాపుకొచ్చినప్పుడు ఇరుగుపొరుగు వారికి ఇస్తూంటాం. 
– వల్లూరి సత్యవేణి, అర్తమూరు

ఆరోగ్యవంతమైన జీవనం 
పొలం గట్లు, ఇళ్ల వద్ద సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. డ్వాక్రా మహిళలు, రైతులకు శిక్షణతో పాటు విత్తనాలు, మొక్కలు అందజేస్తున్నాం. సేంద్రియ సాగు వలన ఆరోగ్యవంతమైన జీవనంతో పాటు పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుంది. గట్లపై కందులు, కూరగాయల సాగుతో వరిపై మొవ్వు, పచ్చదోమ వంటి చీడపీడల బెడద చాలా తక్కువగా ఉంటుంది. 
– బి.జగన్, మండల ప్రకృతి వ్యవసాయ అధికారి, మండపేట

Advertisement
 
Advertisement
 
Advertisement