‘కరోనా అని ముందే తెలుసుకుంటే బావ బతికేవాడు’ | Sakshi
Sakshi News home page

‘కరోనా అని ముందే తెలుసుకుంటే బావ బతికేవాడు’

Published Mon, May 24 2021 10:17 AM

Groom Deceased Due To Corona In Visakha District - Sakshi

రోలుగుంట/విశాఖపట్నం: ఇక మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతికి తన మేనమామ కుమారుడైన చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్‌ (24)తో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 26న వీరి వివాహం జరగాల్సి ఉంది. రజనీకాంత్‌ పరవాడలో పోస్టల్‌ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు. వరుడు ఈ నెల 13న పెళ్లి పనుల నిమిత్తం అర్ల గ్రామానికి వచ్చాడు.

అప్పటికే కొద్దిపాటి జ్వరం ఉండడంతో నర్సీపట్నంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిల్లో వైద్యం చేయించుకుని అర్ల వచ్చి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు 14వ తేదీన ఫీల్డ్‌కు వచ్చిన హరిబాబు అనే హెల్త్‌ అసిస్టెంట్‌ రజనీకాంత్‌ పరిస్థితి తెలుసుకొని ఆందోళన చెందొద్దని.. మూడు రోజుల్లో తగ్గిస్తానని చెప్పి రూ. 1500కు ఫీజు మాట్లాడుకొని అతనే సొంతంగా వైద్యం ప్రారంభించాడు. సెలైన్‌ బాటిల్స్‌  ఎక్కించి, మూడు రోజులపాటు వైద్యం అందించాడు. పరిస్థితి విషమించడంతో  ప్రభుత్వం ఆస్పత్రికి కాకుండా నర్సీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షలు చేయించి, కరోనా పాజిటివ్‌ వచ్చిందని రూ.5 వేలు వసూలు చేశాడు. అప్పటికే ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి, పరిస్థితి విషమించడంతో   విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రజనీకాంత్‌ శనివారం మృతి చెందాడు. హెల్త్‌ అసిస్టెంట్‌ వైద్యం కారణంగానే రజనీకాంత్‌ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ముందుగానే టెస్ట్‌లు చేసి నిర్ధారించి తగిన చికిత్స అందించి ఉంటే తనను వివాహం చేసుకోవలసిన తన బావ బతికే వాడని పెళ్లి కుమార్తె, బంధువులు బోరున విలపిస్తున్నారు. వివరణ కోరేందుకు హెల్త్‌ అసిస్టెంటుకు సాక్షి విలేకరి ఫోన్‌ చేసినా ఆయన లిఫ్ట్‌ చేయలేదు.

చదవండి: అగ్గిపెట్టి వివాదం.. హత్యకు దారితీసింది 
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు 

Advertisement
Advertisement