బారాత్‌లో ‘ధురంధర్’ స్టెప్పులు
గుర్రం ఎక్కలేదు.. కారు రాలేదు.. అక్షయ్ ఖన్నాలా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఓ పెళ్లికొడుకు. పెళ్లంటే కాస్త హడావుడి, బోలెడంత సందడి ఉండాలి. కానీ ఈ పెళ్లి కొడుకు చేసిన పనికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఏకంగా ధురంధర్ సినిమాలోని క్రేజీ డాన్స్ స్టెప్పును దించేసి, నెటిజన్ల మనసు గెలుచుకున్నాడు.
ఏమిటా ‘ధురంధర్’ మాయ?
షోయబ్ ఖురేషీ అనే వ్యక్తి తన పెళ్లి బారాత్‌లో ‘ధురంధర్ ’సినిమాలోని అక్షయ్ ఖన్నా ఐకానిక్ డాన్స్ వాక్‌ను పునఃసృష్టించాడు. ఎఫ్‌ఏ9ఎల్‌ఏ పాటకు ఎంతో క్యాజువల్‌గా, భుజాలు ఎగరేస్తూ అతను వేసిన అడుగులు చూసి బంధుమిత్రులే కాదు, ఇంటర్నెట్ లోకం కూడా ఫిదా అయిపోయింది.
ఎందుకీ సీన్ అంత ప్రత్యేకం?
నిజానికి సినిమాలో అక్షయ్ ఖన్నా ఆ స్టెప్పును ఏ ప్రణాళిక లేకుండా అప్పటికప్పుడే ఏదో అలా సరదాగా వేసేశారట. అదే ఇప్పుడు ఒక ‘మీమ్’ మెటీరియల్‌గా మారి ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు మన వరుడు కూడా అదే ఆత్మవిశ్వాసంతో పెళ్లి వేదిక మీదకు వస్తుంటే.. నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ‘పెళ్లి కూతురు గారూ.. మీరు ఒక లైఫ్ టైమ్ ఎంటర్‌టైనర్‌ని పెళ్లి చేసుకున్నారు!’.. అని ఒకరు, ‘నువ్వు తోపు బ్రదర్.. అందరికీ స్ఫూర్తి ఇచ్చావు’.. అని మరొకరు ప్రశంసించారు. పాప్ సంస్కృతిని పాకెట్‌లో పెట్టుకుని, పక్కా స్టైల్‌తో వరుడు ఇచి్చన ఎంట్రీ ఇప్పుడు వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ప్రపంచంలో ఒక కొత్త మైలురాయి. గుర్రాలు, ఏనుగులు కంటే ఈ ‘ధురంధర్’నడకే వెరీ వెరీ స్పెషల్!
– సాక్షి, నేషనల్ డెస్క్


