ఎట్టకేలకు పోలవరం ఎత్తిపోతల | Green Signal For Polavaram Project Works: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు పోలవరం ఎత్తిపోతల

Apr 21 2026 5:29 AM | Updated on Apr 21 2026 5:29 AM

Green Signal For Polavaram Project Works: Andhra pradesh

పనులు కొనసాగించడానికి అనుమతిస్తూ సర్కార్‌ ఉత్తర్వులు 

సాక్షి, అమరావతి: పోలవరం ఎత్తిపోతలకు ఎట్టకేలకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో దీన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు ఆ ఎత్తిపోతల అత్యంత అవసరమంటూ వాస్తవాలను అంగీకరించారు. దాంతో పోలవరం ఎత్తిపోతల పనులను రద్దు చేస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని.. పనులు కొనసాగించడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ప్రాజెక్టు కనీస నీటి మట్టం 41.15 మీటర్లు కాగా.. కనిష్ట నీటి నిల్వ 119.4 టీఎంసీలు. పోలవరం జలాశయంలో 35.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటేనే కుడి, ఎడమ కాలువలకు నీళ్లందుతాయి.

అంతకంటే తక్కువ స్థాయిలో ఉంటే నీళ్లందవు. పోలవరంలో 35.5 మీటర్ల దిగువన ఉండే నీళ్లన్నీ డెడ్‌ స్టోరేజీ కింద లెక్క. ఇందులో 35.5 నుంచి 32 మీటర్ల మధ్య నిల్వ ఉండే సుమారు 30 టీఎంసీలను కుడి కాలువ ద్వారా తరలించి.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌కు ముందస్తుగా సాగునీరు అందించడం, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.912.84 కోట్లతో 2021 ఏప్రిల్‌ 19న పోలవరం ఎత్తిపోతలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 32 మీటర్ల కాంటూర్‌ దిగువన ఉండే నీటిని రివర్‌ స్లూయిజ్‌ల ద్వారా తరలించి గోదావరి డెల్టాలో రబీ పంటకు సమృద్ధిగా నీళ్లందించడంతోపాటు తాగునీటి అవసరాలు తీర్చాలని నిర్ణయించారు.

ఆ నీటిని ఉపయోగించుకోకపోతే జూన్‌లో వరద ప్రవాహం ప్రారంభమవుతుంది.. పోలవరం నిండగానే ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా గోదావరి వరద సముద్రం పాలవుతుంది. ఈ నేపథ్యంలో మహత్తర ఆశయంతో చేపట్టిన ఆ ఎత్తిపోతలను 2021 జూలై 24న నిర్వహించిన టెండర్లలో రూ.765.94 కోట్లకు మేఘా సంస్థ దక్కించుకుంది. 17.05 శాతం పనులను పూర్తి చేసింది. అప్పట్లో ఈ ఎత్తిపోతలను చంద్రబాబు తప్పుబట్టారు. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా పోలవరం ఎత్తిపోతల ఎందుకంటూ దబాయించారు. పోలవరం ఎత్తిపోతల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవని.. రూ.912 కోట్లు వృథా అంటూ విమర్శించారు. వాస్తవానికి గోదావరిలో నీటి మట్టం 14 మీటర్లు కంటే ఎగువన ఉన్నప్పుడే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందుతాయి.

కానీ.. పోలవరం డెడ్‌ స్టోరేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తే పట్టిసీమ ఎత్తిపోతలకు నీళ్లందవు. అయితే చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించి వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై బురదచల్లారు. కృష్ణా డెల్టా, ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి పోలవరం ఎత్తిపోతలను తప్పుబట్టిన చంద్రబాబు తీరును ఖండిస్తూ అప్పట్లో ఇంజనీరింగ్‌ నిపుణులు, రైతులు దుమ్మెత్తిపోశారు.

ఈ క్రమంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ ఎత్తిపోతల పనులను రద్దు చేశారు. కానీ.. ఇప్పుడు అదే ఎత్తిపోతల ఆవశ్యకతను గుర్తిస్తూ పనులు కొనసాగించడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు వరదాయిని లాంటి రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్‌ జగన్‌కు మంచి పేరొస్తుందనే అక్కసుతో... తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుదిరిన చీకటి ఒప్పందం మేరకు ఆ ఎత్తిపోతలను చంద్రబాబు నిలిపేసి రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారని సాగునీటిరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement