
నేటి నుంచి జూన్ 2 వరకు నిర్వహణ
అప్పటివరకు నిషేధం సడలింపు
ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తే స్థానచలనం తప్పదు
వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారూ అర్హులు
ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వోద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేటి (శుక్రవారం) నుంచి జూన్ 2 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తూ, ప్రస్తుతమున్న నిషేధాన్ని సడలిస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మే 31 నాటికి ఒక స్టేషన్‌లో ఐదేళ్లు నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి. వీరేకాక..
» వ్యక్తిగతంగా అభ్యర్థన చేసుకునే వారు కూడా ఈ బదిలీలకు అర్హులు.
» మే 31, 2026 లేదా అంతకుముందు పదవీ విరమణచేసే ఉద్యోగులను పరిపాలన కారణాలు లేదా వారి అభ్యర్థన అయితే తప్ప బదిలీ చేయరు.
» దృష్టిలోపం ఉన్న ఉద్యోగులు, మానసిక వికలాంగ పిల్లలున్న వారు సంబంధిత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న కేంద్రానికి బదిలీ కోరుకుంటే ప్రాధాన్య™నివ్వాలి.
» ఇక గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులు, నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఉద్యోగులు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వైద్య కారణాలపై (స్వీయ లేదా జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన పిల్లలకు సంబంధించిన) బదిలీ కోరుకునే ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
» కారుణ్య కారణాలపై నియమితులైన వితంతువుల బదిలీలకూ ప్రాధాన్యత ఇవ్వాలి.
» దృష్టి లోపం ఉన్న ఉద్యోగులు బదిలీల నుండి మినహాయింపు పొందుతారు. వారు అభ్యర్థించినప్పుడు ఖాళీ లభ్యతకు లోబడి వారు ఎంచుకున్న ప్రదేశానికి బదిలీ చెయ్యొచ్చు.
» భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులైతే, వారిద్దరినీ ఒకే స్టేషన్‌లో లేదా దగ్గరగా ఉన్న స్టేషన్లలో బదిలీ చేయడానికి ప్రయత్నించాలి.
నోటిఫైడ్ ఏజెన్సీల్లో ఇలా..
ఇక నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న స్టేషన్లకు బదిలీ చేయాలి. 50 ఏళ్ల కన్నా తక్కువ వయస్సుగల ఉద్యోగులను ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి. ఇప్పటివరకు ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేయని ఉద్యోగుల సర్వీసు కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేయాలి. జూన్ 3 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుంది.