విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను | Government plans to relax CRZ rules | Sakshi
Sakshi News home page

విశాఖ తీరంపై చంద్రబాబు కన్ను

Jun 4 2026 4:46 AM | Updated on Jun 4 2026 4:46 AM

Government plans to relax CRZ rules

సీఆర్‌జెడ్‌ నిబంధనల సడలింపునకు సర్కార్‌ ప్లాన్‌! 

మధురవాడ టు భీమిలి.. ఇక కాంక్రీట్‌ వనం 

సీఆర్‌జెడ్‌–3 నుంచి సీఆర్‌జెడ్‌–2కు మార్పు 

అడ్డగోలు నిర్మాణాలకు సై 

ఏపీసీజెడ్‌ఎంఏ సమావేశంలో నిర్ణయం 

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ప్రతిపాదనలు 

సముద్ర తీరాన్ని నాశనం చేసేందుకు సన్నద్ధం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ తీర ప్రాంతంలో అభివృద్ధి మాటున రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు, అనుయాయ కంపెనీలకు అడ్డగోలుగా భూకేటాయింపులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖ తీర ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి.. కోస్తా తీర ప్రాంతానికి ముప్పు వాటిల్లజేసేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మధురవాడ నుంచి భీమిలి వరకూ కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌) నిబంధనలను సడలించాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను కోరాలని నిర్ణయించింది. 

ఇందులో భాగంగా ఈ మొత్తం ప్రాంతాన్ని ప్రస్తుతం ఉన్న సీఆర్‌జెడ్‌–3 నుంచి సీఆర్‌జెడ్‌–2కు మార్చేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా మే నెల 5న జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ) సమావేశంలో మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్‌జెడ్‌–2 పరిధిలోకి తేవాలంటూ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వ అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కాంతిలాల్‌ దండే ఏపీసీజెడ్‌ఎంఏకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 

ఈ సమావేశంలో ఆయనతోపాటు మెంబర్‌ సెక్రటరీగా ఉన్న శరవణన్‌ (ఐఎఫ్‌ఎస్‌), విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్, పీసీబీ ఆర్‌వో తదితరులు హాజరయ్యారు. 2019లో జారీ చేసిన సీఆర్‌జెడ్‌ నోటిఫికేషన్‌లో ఈ మేరకు మార్పులు చేయాలంటూ కేంద్ర అటవీ, పర్యావరణశాఖను కోరాలని సమావేశం అభిప్రాయపడింది. తద్వారా మధురవాడ నుంచి భీమిలి వరకు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది.  

కోస్టల్‌ కారిడార్‌కు ముప్పు! 
వాస్తవానికి 2019లో ఇచ్చిన సీఆర్‌జెడ్‌ నోటిఫికేషన్‌ ప్రకారం మధురవాడ నుంచి భీమిలి వరకూ సీఆర్‌జెడ్‌–3 జోన్‌ పరిధిలో ఉంది. దీని ప్రకారం ఈ ప్రాంతంలో సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల వరకూ ఎలాంటి శాశ్వత నిర్మాణాలూ చేపట్టకూడదు. ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న సహజ ఇసుక దిబ్బలు, చిత్తడి నేలలు అలల తాకిడిని, తుపానులను అడ్డుకునే కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. సీఆర్‌జెడ్‌–3 పరిధిలో ఉండటంతో ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేదు. 

అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన నేతలు ఈ ప్రాంతంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. వీటిని ఇప్పుడు సీఆర్‌జెడ్‌–2 పరిధిలోకి తీసుకరావడం ద్వారా శాశ్వత కాంక్రీట్‌ నిర్మాణాలకు అవకాశం ఏర్పడనుంది. తద్వారా ఇప్పటికే తాము చేపట్టిన నిర్మాణాలను శాశ్వతం చేసుకోవడంతో  పాటు తమ అనుయాయులకు భూకేటాయింపులతో రానున్న రోజుల్లో విశాఖ తీరాన్ని కాంక్రీట్‌ జంగిల్‌గా మార్చేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమవుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

పర్యావరణ విధ్వంసం 
చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విశాఖలోని విలువైన భూములపై కన్నేసింది. మొదటగా తమ బంధువు ఆక్రమించుకున్న 5 వేల కోట్ల విలువైన ఎండాడలోని స్థలాన్ని గీతం పేరిట అక్రమాన్ని సక్రమం చేసేందుకు జీవీఎంసీలో తీర్మానం చేసింది. అం తేకాకుండా విశాఖలో ఉన్న పర్యావరణాన్ని రక్షిస్తున్న పచ్చని కొండలను ఎక్కడికక్కడ గుండు గీయిస్తోంది. 

ఇది చాలదన్నట్టుగా ఇప్పుడు ఏకంగా సీఆర్‌జెడ్‌–3 నుంచి సీఆర్‌జెడ్‌–2లోకి మార్చడం ద్వారా సహజ రక్షణ కవచాలుగా ఉన్న పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతోంది. టూరిజం పేరుతో పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతోంది. దీనిపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement