ప్రభుత్వ శాఖల్లో అద్దెకు సొంత వాహనాలు..

Government Official Using Personal Car On Rent In Chittoor - Sakshi

ఉన్నతమైన ఉద్యోగం.. రూ.లక్షల్లో వేతనం.. అయినప్పటికీ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటున్నా అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ప్రభుత్వం కల్పించిన వాహన సౌకర్యాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. సొంత వాహనాలనే అద్దెకు తీసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు పెట్టి ప్రజాధనాన్ని జేబులో వేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా పలుశాఖల్లో సాగుతున్న ‘అద్దె’ బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం.  

సాక్షి,చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి అద్దె వాహనాల దందా సాగుతోంది. ట్రెజరీ, రెవెన్యూ, ఎంపీడీఓలు, విద్యా శాఖ, పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు, హౌసింగ్, మున్సిపల్‌ అధికారులు.. ఇతర శాఖల్లో సొంత కార్లను వినియోగిస్తూ ప్రతి నెలా బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. పలు కార్యాలయాల ఉన్నతాధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రజాసేవ నిమిత్తం క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు అవసరమైతే వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇచ్చింది. నిబంధనల ప్రకారం జిల్లాస్థాయి అధికారి వాహనానికి నెలకు రూ.45వేలు, మండలస్థాయి అధికారి అయితే రూ.35వేలు అద్దె చెల్లిస్తోంది. నిరుద్యోగులకు బ్యాంకు రుణాలు, కార్పొరేషన్ల కింద సబ్సిడీపై ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌స్కీం ప్రవేశపెట్టి ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి పలువురు ఉన్నతాధికారులు తూట్లు పొడుస్తున్నారు.

తమ సొంత వాహనాలను వారు పనిచేస్తున్న శాఖలోనే అద్దెకు వినియోగిస్తున్నారు. మరికొందరు బినామీ పేర్లతో బిల్లులు పెట్టి అద్దెను జేబుల్లోకి వేసుకుంటున్నారు. నకిలీ బిల్లులు! కొందరు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లకుండానే నకిలీ బిల్లులు పెడుతున్నారు. తమకు కేటాయించిన వాహనంలో నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు తిరగకపోయినా నకిలీ బిల్లులు పెట్టి ప్రతి నెలా అద్దె పేరుతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఏళ్ల తరబడి గుట్టుగా దందా సాగిస్తున్నారు. ఉపాధికి గండి జిల్లా వ్యాప్తంగా దాదాపు 85 ప్రభుత్వ శాఖలున్నాయి. అందులో సగానికి పైగా శాఖల్లోని అధికారులు వైట్‌బోర్డు వాహనాలను వినియోగిస్తుండడం గమనార్హం. అదే ఎల్లోబోర్డు వాహనాలను అద్దెకు తీసుకుంటే పలువురికి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. ఒకవేళ ఎవరైనా తమ వాహనాన్ని అద్దెకు పెడితే సంబంధిత బిల్లుల మంజూరుకు చుక్కలు చూపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top