ఈ ‘అసైన్డ్‌’ భూములపై పట్టాదారులకే హక్కులు  | The Government Has Given More Clarity On Land Ownership Rights, See All Details Inside - Sakshi
Sakshi News home page

ఈ ‘అసైన్డ్‌’ భూములపై పట్టాదారులకే హక్కులు 

Published Mon, Nov 27 2023 4:50 AM | Last Updated on Mon, Nov 27 2023 2:54 PM

The government has given more clarity on land ownership rights - Sakshi

సాక్షి, అమరావతి: అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. అర్హత ఉన్న అసైన్డ్‌ భూములకు సైతం యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో వెనుకాడుతుండడంతో, వారికి ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తూ  ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం అసైన్‌మెంట్‌ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన భూములన్నింటిపైనా ఆంక్షలు తొలగించి యాజమాన్య హక్కులు కల్పించాలని తెలిపింది.

వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల జరిగిన వర్క్‌షాప్‌లో అసైన్డ్‌ భూములు, చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్‌ ఎల్‌పీఎంల విభజన, ప్రొవిజినల్‌ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం వీటిపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కేసుల్లో యాజమాన్య హక్కులు ఇవ్వొచ్చు 
♦ డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్‌ కాపీ, అసైన్‌మెంట్‌ కమిటీ మినిట్స్‌ లేకపోయినా వెబ్‌ల్యాండ్, పీఓఎల్‌ఆర్‌ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదార్‌ పాస్‌ బుక్‌ ఆధారంగానైనా ఆ భూములకు యాజమాన్య హక్కులివ్వాలి. భూమి పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఎవరైనా పట్టాదారు పాస్‌బుక్‌ నకిలీదని తహశీల్దార్‌ ధృవీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా తహశీల్దార్‌దే. 
♦ భూ బదలాయింపు (ల్యాండ్‌ కన్వర్షన్‌), అసైన్‌మెంట్‌ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ఈ తరహా భూముల రికార్డులు లభించకపోయినా, లోతుగా పరిశీలన జరిపి, యాజమాన్య హక్కులివ్వాలి. 
♦ భూ బదలాయింపు జరగని సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రిట్‌ పిటిషన్‌ 140/20­22­పై హైకోర్టు ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. 
♦ ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్‌ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యాజమాన్య హక్కులివ్వొచ్చు. 
♦  డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబ­­ర్‌తో సరిపోలకపోతే, వారి ఆ«దీనంలో ఉన్న భూ­మి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. యా­జమాన్య హక్కులివ్వడానికి వారికి భూమి అసై­న్‌ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. 
♦ ఖాతా నంబర్‌ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి అసైన్డ్‌ భూములుగా నమోదవని వాటిని అసైన్‌మెంట్‌ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఈ భూములకు యాజమాన్య హక్కు­లిచ్చేందుకు ఎల్రక్టానిక్‌ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్‌ పేరును చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను మారుస్తారు.  
♦  ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాని అసైన్డ్‌ భూములను అసైన్డ్‌ జాబితాలో చేర్చేందుకు దరఖాస్తుల కోసం ఏపీ సేవా పోర్టల్‌లో ఓ ఆప్షన్‌ ఏర్పాటు. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వొచ్చు. 
♦ అసైన్‌మెంట్‌ చేసిన రాస్తా పోరంబోకు భూములకు భూ మార్పిడి (ల్యాండ్‌ కన్వర్షన్‌) చేసి వాటికి హక్కులివ్వాలి. 
♦  ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి, అసైన్‌మెంట్‌ జరిగి ఆర్‌ఓఆర్‌ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టం సెక్షన్‌ 4(1) కింద నోటిఫికేషన్‌ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. 
♦  భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి–నాట్‌ ఎలాటెడ్‌’గా నమోదై.. వాస్తవానికి ఆ భూమి అసైన్‌మెంట్‌ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. పరిశీలనలో అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. 
♦ అర్హత ఉన్న అసైన్డ్‌ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి 
తొలగించాలి. రిమార్క్స్‌ కాలమ్‌లో యాజ­మాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు.  
♦  రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులు­గా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కు­లు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్‌ భూములన్నింటినీ మళ్లీ ధృవీకరణ కోసం వీఆర్‌వో లాగిన్‌కు పంపాలి. ధృవీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. 
♦  20 ఏళ్ల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాజమాన్య హక్కులివ్వాలి.  

చుక్కల భూములపై.. 
1.12 లక్షల ఎకరాల చుక్కల భూములు అసైన్డ్‌ భూములు కావడంతో అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ భూములన్నీ 20 ఏళ్ల క్రితం అసైన్‌మెంట్‌ చేసినవి. ఈ భూములన్నింటినీ 22ఏ జాబితాతోపాటు చుక్కల భూముల జాబితా నుంచి కూడా తొలగించాలి.  

ఈనాం భూములపై.. 
♦   22ఎ జాబితా నుండి తొలగించిన గ్రామ సర్విస్‌ ఈనాం భూములు వెబ్‌ల్యాండ్‌ ఎల్రక్టానిక్‌ రికార్డుల్లో కనపడాలి. ఆలయాలు, ఎండోమెంట్, వక్ఫ్, ధార్మిక సేవా ఈనాంలు మినహా మిగిలిన అన్ని ఈనాం భూములను 22ఎ జాబితా నుండి తొలగించాలి. అలాంటి ఈనాం భూములన్నీ ఈనాం/ఎస్టేట్‌/రైత్వారీ గ్రామంలో భాగమైనా, దాంతో సంబంధం లేకుండా తొలగించాలి. 

♦   భవిష్యత్తులో ఏ రీ సర్వే గ్రామాల్లోనూ ఉమ్మడి ఎల్‌పీఎంలు సృష్టించకూడదు. ఎక్కడైనా ప్రజా సంఘాలు ఉమ్మడి ఎల్‌పీఎంల కోసం అభ్యర్థిస్తే తహశీల్దార్లు వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసి వాటి ఆమోదం కోసం ఆర్డీవోలకు పంపాలి.  

♦  తనఖాలో ఉన్న భూములు యాజమాన్య హక్కుల కల్పనకు అర్హత కలిగి ఉంటే కేవలం తనఖాలో పెట్టారనే కారణంతో వాటిని తిరస్కరించకూడదు. యాజమాన్య హక్కులు కల్పించిన వెంటనే వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement