క్రీడా కోటా డీఎస్సీ పోస్టుల భర్తీపై ప్రభుత్వం వక్రభాష్యం
కేంద్ర ప్రభుత్వ మయాస్‌లో 65 క్రీడలను రెండు గ్రూపులుగా
విభజించారంటూ అబద్ధపు ప్రచారం
దేశవ్యాప్తంగా నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యం ఇస్తే.. డీఎస్సీలో నేషనల్ గేమ్స్ ప్రయార్టీ
వర్సిటీల్లో వార్షిక స్పోర్ట్స్‌డే సర్టిఫికెట్లను సైతం బ్యాకప్‌గా చూపించడాన్ని సమర్థించుకున్న వైనం
మీడియా సమావేశంలో శాప్ ఎండీ నోట పచ్చి అబద్ధాలు వల్లెవేయించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అక్రమాలు వెలుగు చూడటంతో ప్రభుత్వం నిండా మునిగిపోయింది. ‘సాక్షి’లో కథనాల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ తీవ్రం అవుతుండటంతో తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారుల చేత నోటికొచ్చిన అబద్ధాలు, వక్రభాష్యాలు పలికిస్తోంది. సాధారణ పరిపాలన శాఖ(సర్వీసెస్) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, శాప్ ఎండీ భరణితో కూడిన అధికారుల బృందం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యింది.
ఈ సందర్భంగా శాప్ ఎండీ భరణి మీడియాతో మాట్లాడుతూ.. అక్రమాలు, అవినీతి లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టు ప్రకటించారు. వాస్తవానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేయడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది. భరణి చెప్పిన అంశాలు... ఇందుకు విరుద్ధంగా ఉన్న వాస్తవాలను పరిశీలిస్తే..
1 శాప్ ఎండీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనూ కొన్ని చోట్ల ఏ, బీ కేటగిరీలుగా క్రీడలను విభజించారు. మేము కేంద్ర ప్రభుత్వ క్రీడలనే ఏపీలో పెట్టాం.
వాస్తవం: కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (మయాస్)లో ఈ విభజన ఎక్కడా లేదు. 65 క్రీడాంశాలను సమానంగానే పరిగణిస్తున్నారు. కానీ, ఏపీలో 65 క్రీడాంశాల్లో కేవలం 63 మాత్రమే కేంద్ర ప్రభుత్వంలోనివి ఉంచారు. కుడో, ఈక్వెస్టారియాన్(గుర్రపుస్వారీ)లను తొలగించి వాటి స్థానంలో మెట్రన్ పెంటాథ్లాన్, సెయిలింగ్‌ను తీసుకొచ్చి.. వాటిని ‘ఏ’ కేటగిరీలో పెట్టారు. ఈ వాస్తవాన్ని దాచేసి మొత్తం మయాస్‌ను అనుసరిస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఎక్కువ మంది ఆడే క్రీడలను ‘ఏ’ కేటగిరీలో పెట్టామన్నారు. ఏపీలో గోల్ఫ్, సైలింగ్ ఎంత మంది ఆడుతున్నారు? దానిని ‘ఏ’ కేటగిరీలో ఎందుకు పెట్టారు? అన్నది పాలకులకే అర్థం కావాలి.
2 శాప్ ఎండీ: అనిగి దుర్గయ్య దరఖాస్తు సమయంలో తప్పులు చేశారు. దీంతో ఉద్యోగాన్ని కోల్పోయారు. దరఖాస్తులో నేషనల్ గేమ్స్‌కు కాకుండా నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉన్నా ఉద్యోగం రాలేదు.
వాస్తవం: దేశవ్యాప్తంగా సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్‌కు ప్రాధాన్యత తర్వాత నేషనల్ గేమ్స్ ను పరిశీలిస్తారు. కానీ, ఏపీలో క్రీడా పాలసీ సమయంలో అక్రమాలకు బీజం వేశారు. మాస్టర్‌మైండ్ చక్రం తిప్పడంతో నేషనల్ గేమ్స్ ముందు వరసలోకి వచ్చి నేషనల్ చాంపియన్ షిప్ కిందికి పోయింది. వాస్తవానికి భారత జట్టు ఎంపిక మొత్తం సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ ఆధారంగానే జరుగుతుంది. వాటి ఆధారంగానే కేంద్రప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఏపీలో పతకం రాకున్నా నేషనల్ గేమ్స్‌లో పాల్గొంటే చాలు ఉద్యోగం ఇచ్చేసేలా పాలసీ తెచ్చి కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. దుర్గయ్యకు నేషనల్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్, నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం ఉంది. తప్పుగా అప్లై చేయడంతో ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం దారుణం.
3 శాప్ ఎండీ: సౌత్ జోన్, ఆలిండియా ఇంటర్ వర్సిటీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాలంటే బ్యాకప్ ఇంటర్ కాలేజియేట్ సర్టిఫికెట్ ఉండాలి. అనంతపురంలో ఎస్‌ఏ హిందీ ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఇంటర్ కాలేజియేట్ బ్యాకప్ సబ్మిట్ చేశారు. ఉద్యోగం ఇచ్చాం.
వాస్తవం: వాస్తవానికి సదరు వ్యక్తి సౌత్ జోన్‌లో వాలీబాల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ సమర్పించాడు. దానికి బ్యాకప్‌గా వార్షిక స్పోర్ట్స్ మీట్ సర్టిఫికెట్ పెట్టారు. ఇది ఇంటర్ యూనివర్సిటీ/కాలేజియేట్ ఎలా అవుతుంది? ఒక వర్సిటీకి అనుబంధ కళాశాలలు లేనప్పుడు, స్పోర్ట్స్ డే జరుపుకుని అందించే సర్టిఫికెట్‌ను ఎలా బ్యాకప్‌గా పరిగణిస్తారు? ఒక వర్సిటీ జట్టును ఎంపిక చేసి సౌత్ జోన్‌కు పంపిస్తే వర్సిటీ తరఫున ఆడొచ్చు గానీ, ఆ బ్యాకప్ సర్టిఫికెట్‌తో ఎలా ఉద్యోగం ఇస్తారు? దీనిని కేంద్ర ప్రభుత్వ శాఖలు గుర్తిస్తాయా? ఈ విషయాన్ని శాప్ ఎండీ చాలా చాకచక్యంగా మాట్లాడి తప్పించుకోవడం గమనార్హం.
4 శాప్ ఎండీ: స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ప్రభుత్వం ఇచ్చేవి కావు. నేషనల్ ఫెడరేషన్, వర్సిటీలు, రాష్ట్ర అసోసియేషన్లు ఇస్తాయి. ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే, అభ్యర్థులు వాటితో ఉద్యోగాలు పొందితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము జెన్యూనిటీని పరిశీలించిన తర్వాతే ఉద్యోగాలు ఇచ్చాం.
వాస్తవం: ప్రభుత్వం డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాలను అసోసియేషన్లపై నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పైగా జెన్యూనిటీ సర్టిఫికెట్లు పరిశీలించినట్టు చెబుతున్న ఎండీ.. సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్‌కు మయాస్‌లో, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌లో గుర్తింపు లేనప్పుడు దానికి అనుబంధంగా ఏపీలో ఉండే సాఫ్ట్ అసోసియేషన్ ఇచ్చిన జెన్యూనిటీని ఎలా వాస్తవమని నిర్ధారిస్తారో చెప్పలేదు.
5 శాప్ ఎండీ: ఒలింపిక్స్ నుంచి స్టేట్ చాంపియన్‌షిప్ వరకు ప్రాధాన్యత ప్రకారం 382 పోస్టులు భర్తీ చేశాం. స్టేట్ పార్టిసిపేషన్ పెడితేనే చాలా పోస్టులు మిగిలిపోయాయి. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ ను చేర్చాం. గతంలో స్కూల్స్ గేమ్స్, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.
వాస్తవం: ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఒలింపిక్స్ పెట్టినప్పటికీ పోస్టుల భర్తీలో మాత్రం అన్నీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లే. పతకాలు గెలిచిన వారిని వేళ్లపై లెక్కించొచ్చు. పథకం ప్రకారమే క్రీడా పాలసీ, జీవోలను తీసుకొచ్చి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. స్కూల్స్ గేమ్స్‌కు, డిస్ట్రిక్ట్ ఫెస్టివల్స్‌కు గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కాలేజీ అడ్మిషన్లలో మాత్రమే క్రీడా ప్రతిభ ఆధారంగా వెయిటేజీ ఉండేది.


