అనాథలకు రైస్‌ కార్డు 

Government Decides to Supply Rice Bags To Transgenders - Sakshi

సాక్షి, కర్నూలు: ఒంటరి నిరుపేద జీవితం ఎంతో దుర్భరం. తమను తాము పోషించుకునే శక్తి లేక పూట గడవడమే కష్టంగా బతకాల్సి వస్తోంది. అలాగే సమాజ వివక్షకు గురవుతూ జీవితాంతం ఒంటరిగా జీవించే ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి మరీ అధ్వానం. అటువంటి వారికి రైస్‌ కార్డులు మంజూరు చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిని గుర్తించే బాధ్యతను అధికారులు వలంటీర్లకు అప్పగించారు. తమ పరిధిలో కార్డులు లేని అనాథలు, ట్రాన్స్‌జెండర్లు, పిల్లలు లేని వితంతువులు, ఇల్లులేని వారిని గుర్తించాలి. అలా గుర్తించిన వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో రైస్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ రైస్‌ కార్డు మాదిరిగానే ఆరు అంశాల ప్రాతిపదికన అర్హత ఉంటే చాలు. వీరికి కూడా పది రోజుల్లోనే కొత్త రైస్‌ కార్డులను మంజూరు చేస్తారు. ఈ మేరకు జిల్లాలో దాదాపు 5 వేల మంది కొత్తగా రైస్‌ కార్డు పొందే అవకాశం ఉన్నట్లు అంచనా.   

ఇకపై సంక్షేమ పథకాలకూ అర్హులు.. 
ఏ సంక్షేమ పథకానికైనా అర్హత ఉండాలంటే ముఖ్యంగా రైస్‌ కార్డు ఉండాలి. ఆ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అనాథలు, ఒంటరిలు, ట్రాన్స్‌జెండర్లు దూరం కావాల్సి వస్తోంది. దీంతో కార్డు పొందేందుకు వారు అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోవాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. ప్రభుత్వమే అర్హులైన వారిని గుర్తించి రైస్‌ కార్డులు 
ఇస్తుండటంతో సంక్షేమ పథకాలకు అర్హత పొందనున్నారు.  

ప్రభుత్వ నిర్ణయంపై హర్షం.. 
ఒంటరిగా జీవించే వారికి చేయూత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ డిమాండ్‌ ఉన్నా పాలకులు పట్టించుకోలేదు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మానవత్వంతో ఆలోచించి ఒంటరి బతుకులకు అండగా నిలవాలని నిర్ణయించడం అభినందనీయం. ఈ నిర్ణయంతో పలువురి ఒంటరి బతుకుల్లో వెలుగులు నిండనున్నాయి.     

సర్వే జరుగుతోంది 
గతంలో ఒంటరిగా జీవించే వారికి రేషన్‌కార్డులు ఇచ్చేవాళ్లం కాదు.  ఈ ప్రభుత్వం వారికి అండగా నిలవాలని సంకల్పించింది. ఒంటరిగా జీవించే వ్యక్తులకు కూడా కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. వలంటీర్లతో సర్వే జరుగుతోంది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు రైస్‌ కార్డు మంజూరవుతుంది. సయ్యద్‌ యాసిన్, డీఎస్‌ఓ 

మా జీవితాలకు భరోసా 
రెక్కల కష్టంపై బతికే మా జీవితాలకు ఓ భరోసా లభించింది. రైస్‌ కార్డు వస్తుందని ఇప్పటి వరకు కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు వలంటీర్‌ వచ్చి నాతో దరఖాస్తు చేయించారు. చాలా సంతోషం.– కె.రాజేశ్వరి, - ట్రాన్స్‌జెండర్, కర్నూలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top