Andhra Pradesh: సుదీర్ఘ చర్చలు

Government Advisor Sajjala Ramakrishna Reddy  Held Talks With The Employees Association Leaders - Sakshi

ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకున్న ఆర్థిక మంత్రి బుగ్గన, సజ్జల  

ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించిన ప్రభుత్వ పెద్దలు 

నేడు మరోసారి చర్చలకు అవకాశం 

ఆందోళనలను విరమించుకోవాలని కోరిన సజ్జల

సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం బుధవారం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఏడు గంటలకుపైగా చర్చలు జరిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయాలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. ఫిట్‌మెంట్, హెచ్‌ఆర్‌ఏ సహా ప్రతి అంశంపైనా బుగ్గన రాజేంద్రనాథ్, సజ్జల రామకృష్ణారెడ్డి కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించి తమ ఆలోచనలు చెప్పారు.

కార్యదర్శుల కమిటీ నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని, 11వ పీఆర్సీని యథాతథంగా అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. కేంద్ర వేతన సంఘంతో తమకు సంబంధం లేదంటూ ఫిట్‌మెంట్‌పై తమ డిమాండ్లు తెలిపాయి. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ఫిట్‌మెంట్‌పై ఇప్పుడు చేస్తున్న డిమాండ్‌ కాకుండా అందరు కలిసి ఒక అంకె చెప్పాలని కోరారు. దానిపై నాయకులు ఇప్పటికిప్పుడు చెప్పలేమని తెలిపారు. దీంతో ఫిట్‌మెంట్‌పై మళ్లీ చర్చిద్దామని చెప్పిన సజ్జల మిగిలిన అంశాలపై వివరంగా చర్చించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జల హమీ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించి త్వరలో ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఆ తర్వాత ఆందోళనలు చేస్తున్న ఉద్యోగుల జేఏసీ నేతలతో విడిగా మాట్లాడి ఆందోళనలు విరమించుకోవాలని సజ్జల, ఆర్థిక మంత్రి కోరారు. సమస్యల పరిష్కారంపై రూట్‌ మ్యాప్‌ ఇస్తే ఆందోళనలు విరమిస్తామని జేఏసీ నేతలు చెప్పారు. కాగా, నేడు మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు. ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఫిట్‌మెంట్‌ విషయంలో స్పష్టత రాలేదన్నారు.

ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు మాట్లాడుతూ.. పీఆర్సీ నివేదిక కాకుండా అధికారుల కమిటీ కొత్తగా సిఫార్సులు చేయడం సంప్రదాయం కాదన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. కనీసంగా 34 శాతం ఫిట్‌మెంట్‌ æఇవ్వాలని అడిగామని, మెడికల్‌ రీయింబర్సుమెంటు రూ. 10 లక్షలకు పెంచాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఫిట్‌మెంట్‌ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ 20 అంశాలపై అన్ని సంఘాలు ఒకే తాటిపై నిలబడ్డాయన్నారు. 

నిబద్ధతతో ఉన్నాం: సజ్జల
ఉద్యోగుల సంక్షేమం పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.  సీపీఎస్‌ మీద తన వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. సీపీఎస్‌ సమస్యకు పరిష్కారం చూపే దిశగా కసరత్తు చేస్తున్నామని సజ్జల చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top