ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతున్నారు

Gopalakrishna Dwivedi Comments On Nimmagadda Ramesh - Sakshi

‘స్థానిక’ ఎన్నికలపై నిమ్మగడ్డ నిర్ణయం ఏకపక్షం 

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై నివేదించినా మొండివైఖరి అవలంబిస్తున్నారు

ఇది సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమే  

పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్‌ నిర్ణయం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేలా ఉందని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం.. వారి ప్రాణాలు కాపాడడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ గురించి ఏమాత్రం ఆలోచించకుండా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ ముందుగా నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం, మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరుపుతామంటున్నారని తెలిపారు. ఈ మేరకు ద్వివేది శుక్రవారం రాత్రి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటనలో ఆయన ఏం పేర్కొన్నారంటే.. 
సీఎస్‌ సూచనలను పట్టించుకోలేదు ‘రాష్ట్ర ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. అధికారులు, సిబ్బంది మొత్తం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సన్నాహక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కూడా వ్యాక్సినేషన్‌పై అన్ని రాష్ట్రాలకూ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 11న ప్రధాని మోదీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ వివరాలన్నీ ఎస్‌ఈసీ దృష్టికి తీసుకొచ్చి 13 తర్వాత ఎన్నికలపై సంప్రదింపుల ప్రక్రియ చేపడదామని కోరినప్పటికీ పట్టించుకోలేదు’.  
 
అధికార దురహంకారంతో వ్యవహరించారు.. 

‘గత ఏడాది మార్చి 15 నాటికి రాష్ట్రంలో ఒకేఒక్క కోవిడ్‌ కేసు నమోదు అయినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల కమిషనర్‌ ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేయగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కచ్చితంగా సంప్రదించిన తరువాతే ఎన్నికల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. కానీ, రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం ఎన్నికలు జరిపేందుకు అనువైన పరిస్థితుల్లేవని, అనుకూల పరిస్థితులు ఏర్పడిన వెంటనే తెలియజేయగలమని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 2020 అక్టోబరు 28న లిఖిత పూర్వకంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెలియజేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా, ఏకపక్షంగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం షెడ్యూలు ప్రకటించారు. ఎలక్షన్‌ కమిషనర్‌ వాస్తవాలను విస్మరించడమే కాకుండా, తాను ముందుగానే నిర్ణయించుకున్న విధంగా ఉద్దేశపూర్వక చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి అధికార దురహంకారంతో వ్యవహరిస్తున్నారు’.  
 
హైకోర్టు ఉత్తర్వులూ బేఖాతరు 
‘కోవిడ్‌ వ్యాక్సినేషన్‌పై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాలేదని.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉంటుందని ప్రభుత్వం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ప్రభుత్వ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఎస్‌ఈసీకి మూడ్రోజుల్లోపు అందజేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఉత్తర్వుల కాపీ ఈ నెల 5న ప్రభుత్వానికి అందగా.. 7న తన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీకి తెలియజేసింది.

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 13న ప్రారంభిస్తున్న నేపథ్యంలో.. జనవరి 13 తరువాత సంప్రదింపులకు సమయం కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరాం. కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ 8వ తేదీనే సంప్రదింపులకు హాజరుకావాలని, లేదా తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలియజేయటం ఏకపక్ష నిర్ణయమే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, తాను శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి రాష్ట్రంలోని కోవిడ్‌ పరిస్థితులను.. వ్యాక్సినేషన్‌ ఆవశ్యకతను వివరించాం. కనీసం మొదటి దశ వాక్సినేషన్‌ కార్యక్రమం పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కోరినా పట్టించుకోలేదు’.. అని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ప్రకటనలో వివరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top