పెరుగుతున్న గోల్డ్‌, వెండి అక్రమ రవాణా.. 11,735 కిలోల బంగారం.. | Gold And Silver Smuggling Increasing In India | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోల్డ్‌, వెండి అక్రమ రవాణా.. మాములు ఐడియాలు కాదుగా..

Published Mon, Apr 3 2023 8:49 AM | Last Updated on Mon, Apr 3 2023 8:54 AM

Gold And Silver Smuggling Increasing In India - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో బంగారం, వెండి అక్రమ రవాణా ఏటికేడాది పెరుగుతున్నాయి. కోవిడ్‌ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020–21లో కొంతమేర వీటి అక్రమ రవాణా తగ్గినప్పటికీ తరువాత 2021–22, 2022–23 సంవత్సరాల్లో బాగా పెరిగింది. స్వాధీనం చేసుకున్న వాటిని చూస్తేనే అక్రమ రవాణా పెరిగిందంటే.. ఇక స్వాధీనం చేసుకోకుండా ఎంత అక్రమ రవాణా అయిందో ఎవరికీ తెలియదు. 

దేశంలో 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు అక్రమ రవాణా చేస్తున్న 11,735.04 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి 13,205 కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో 7,632.52 కిలోల వెండి స్వాధీనం చేసుకుని 49 కేసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థికశాఖ వెల్లడించింది. అత్యధికంగా విమానాల ద్వారానే బంగారం, వెండి అక్రమ రవాణా అవుతున్నాయని, తరువాత ఇతర మార్గాలు, ఓడరేవుల ద్వారా కూడా అక్రమ రవాణా సాగుతోందని తెలిపింది. శరీరంలో దాచి మరీ బంగారం అక్రమ రవాణా చేస్తున్నారని పేర్కొంది.

బంగారం, వెండి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి కస్టమ్స్‌ క్షేత్రస్థాయి బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాయని, ప్రయాణికుల ప్రొఫైలింగ్‌ ఆధారంగా విమానాలు, కార్గో సరుకుల లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నాయని తెలిపింది. స్మగ్లర్లు ఉపయోగించే కొత్తకొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. విమాన క్యాబిన్‌ సిబ్బందితోపాటు విమానాశ్రయ సిబ్బంది బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.

బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్‌ సిబ్బంది, విమానాశ్రయ సిబ్బందిని అరెస్టు చేయడంతోపాటు కేసులు నమోదు చేసినట్లు తెలిపింది. 2019–20 నుంచి 2022–23 ఫిబ్రవరి వరకు బంగారం, వెండి అక్రమ రవాణాకు పాల్పడిన క్యాబిన్, విమానాశ్రయ సిబ్బంది 84 మందిని అరెస్టు చేసి 181.61 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బంగారం, వెండి అక్రమ రవాణాను అరికట్టడానికి నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అడ్వాన్స్‌ ప్యాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ద్వారా రిస్క్‌బేస్డ్‌ ఇంటర్‌డిక్షన్‌ సహాయంతో ప్రయాణికుల ప్రొఫైలింగ్‌ వంటి కార్యాచరణకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement