పొంగుతున్న గోదావరి,  శబరి  నదులు

Godavari Flood Rising AP - Sakshi

గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న వరదనీరు  

ధవళేశ్వరం నుంచి 13,08,418 క్యూసెక్కులు కడలిలోకి  

నిలకడగా కృష్ణానది వరద  

ప్రకాశం బ్యారేజి నుంచి 2,76,150 క్యూసెక్కులు సముద్రంలోకి 

సాక్షి, అమరావతి/చింతూరు/ఎటపాక/పోలవరం రూరల్‌/ధవళేశ్వరం/శ్రీశైలంప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌/విజయవాడ: గోదావరి వరద పెరుగుతోంది. కృష్ణానదిలో వరద నిలకడగా కొనసాగుతోంది. గోదావరి, శబరి నదుల వరద తగ్గినట్టేతగ్గి మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంది. మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇక్కడి నుంచి 13.86 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తోంది.

దీంతో కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో గ్రామాల్లోకి నీరు చేరుతోంది. వరదనీరు ప్రధాన రహదారులపై చేరడంతో మూడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కురిసిన భారీవర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి కారణంగా చింతూరు వద్ద శబరినది ప్రవాహం పెరుగుతోంది. సోమవారం రాత్రి వరకు తగ్గుతూ వచ్చిన శబరినది వరద మంగళవారం ఉదయం నుంచి పెరుగుతుండడంతో చింతూరు నుంచి శబరిఒడ్డుకు వెళ్లే వీఆర్‌పురం రహదారిపై నీరు చేరింది.

చింతూరులోని సంతపాకలు, టోల్‌గేట్‌ ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది. మంగళవారం రాత్రికి చింతూరు వద్ద శబరినది 42 అడుగులకు చేరుకుంది. సోమవారం ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు పాక్షికంగా సాగిన రాకపోకలు మంగళవారం నిలిచిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు ముంపునకు గురైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే 48 గేట్ల నుంచి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద నీటిమట్టం మంగళవారం రాత్రి 7 గంటలకు 13.90 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ మిగిలిన 13,08,418 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ధవళేశ్వరం వద్దకు బుధవారం నీటి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.  

శ్రీశైలానికి స్థిరంగా కొనసాగుతున్న వరద 
శ్రీశైలం జలాశయానికి కృష్ణానది వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. మంగళవారం జూరాల, సుంకేసుల నుంచి 3,35,635 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. డ్యాం 10 రేడియల్‌ క్రస్ట్‌గేట్లను 15 అడుగుల మేరకు ఎత్తి 3,75,680 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. రెండు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్‌ నీటిమట్టం 884.20 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌ జలాశయంలోకి 4,07,580 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ కుడి, ఎడమ కాలువలకు 19,283 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం ఆరుగేట్లను ఐదడుగులు, 20 గేట్లను పదడుగులు ఎత్తి స్పిల్‌వే మీదుగా 3,31,406 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు.. మొత్తం 3,64,292 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. సాగర్‌ జలాశయం నీటిమట్టం 586.20 అడుగులకు చేరింది. జలాశయంలో 301.3570 టీఎంసీల నీరు ఉంది. ప్రకాశం బ్యారేజీలోకి 2,91,483 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కాలువలకు 15,333 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 2,76,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

19న మరో అల్పపీడనం
బంగాళాఖాతంలో అల్పపీడనాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం (19న) మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలోను, 13న ఉత్తర బంగాళాఖాతంలోను అల్పపీడనాలు ఏర్పడ్డాయి. ఈ రెండూ వాయుగుండాలుగా బలపడి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల వైపు వెళ్లాయి. దీంతో ఇవి ఉత్తర కోస్తాపై పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా ఈనెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 19, 20 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 19న ఏర్పడనున్న అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
చదవండి: ఆదాయంలేని గుళ్లకు ‘ధూప దీప నైవేద్యం’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top