వరద 'గోదావరి' | Godavari flood to continue for another week | Sakshi
Sakshi News home page

వరద 'గోదావరి'

Jul 10 2025 5:11 AM | Updated on Jul 10 2025 5:11 AM

Godavari flood to continue for another week

ఏలూరు జిల్లాలో ముంపు మండలాల్లో అప్రమత్తం

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు 

పోటెత్తుతున్న గోదావరి, శబరి 

8 రోజుల వ్యవధిలో పోలవరం నుంచి 13.88 లక్షల క్యూసెక్కులు విడుదల

మరో వారం కొనసాగనున్న గోదావరి ఉధృతి 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్‌ ప్రారంభమైంది. 

వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ  ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. 

ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. 

ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు 
చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్‌ చేస్తున్నారు.  ముంపు మండలాల్లో భయం.. భయం పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికకు రహదారులపైకి నీరు చేరడం, 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కే.వెట్రిసెల్వి ఆదేశించారు.  

కొనసాగనున్న ఉధృతి 
బుధవారం మధ్యాహా్ననికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. 

ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న  2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్‌ఫ్లో కొనసాగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement