గోదావరి డెల్టాకు భరోసా 

Godavari Delta Modernization Works With RS 163 Crores - Sakshi

ఆధునికీకరణ పనులకు ప్రాధాన్యం

ఉమ్మడి జిల్లాలో 95 పనులకు ప్రతిపాదనలు

రూ.163.06 కోట్లకు సాంకేతిక అనుమతులు

వచ్చే రబీ నాటికి పూర్తయ్యేలా చర్యలు

శాశ్వత ప్రాతిపదికన రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోదావరి డెల్టా ఆధునికీ కరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిర్వహించేలా సమగ్రంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 11 నియోజకవర్గాల్లో రూ.163.06 కోట్లతో 95 పనుల కోసం సాంకేతికపరమైన అనుమతులు పొందారు. వచ్చే ఏడాది రబీ సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. వీటిలో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణాలు, కాలువల మరమ్మతులు, స్లూయిజ్‌ గేట్ల మరమ్మతులు వంటి కీలక పనులు ఉన్నాయి.  

7.15 లక్షల ఎకరాల ఆయకట్టు 
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 7.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గోదావరి జలాలతో పాటు మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందుతోంది. ఏటా రబీ సీజన్‌ ప్రారంభంలో వీటికి వార్షిక మరమ్మతులు చేస్తుంటారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్‌ 1వ తేదీ నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేశారు. 

ఈ క్రమంలో జిల్లాలో సీజన్‌ ప్రారంభానికి ముందే రూ.22.54 కోట్లతో 180 పనులను ప్రతిపాదించగా 121 పనులకు టెండర్ల ఖరారై వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా వచ్చే రబీ నాటికి శాశ్వత ప్రాతిపదికన గోదావరి డెల్టాలో కీలక పనులు పూర్తి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి సాంకేతికపరమైన, పరిపాలనా అనుమతులు వచ్చాయి. ప్రభుత్వ ఆమోదంతో కొద్ది నెలల్లో టెండర్ల దశకు పనులు చేరుకోనున్నాయి. వీటిలో ప్రధానంగా మేజర్‌ డ్రెయిన్లలో మరమ్మత్తులు, కొన్నిచోట్ల రిటైనింగ్‌వాల్‌ నిర్మాణాలు, స్లూయిజ్‌ గేట్ల మరమ్మత్తులు, ఎర్త్‌ వర్క్స్‌తో పాటు పూడికతీత పనులు ఉన్నాయి.  

పశ్చిమగోదావరిలో.. 
ఆచంట నియోజకవర్గంలో రూ.3.68 కోట్లతో 5 పనులు 
నరసాపురం నియోజకవర్గంలో రూ.28.22 కోట్లతో  2 పనులు 
పాలకొల్లు నియోజకవర్గంలో రూ.19.01 కోట్లతో 5 పనులు  
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రూ.6.41 కోట్లతో 21 పనులు 
ఉండి నియోజకవర్గంలో రూ.38.25 కోట్లతో 18 పనులు 
తణుకు నియోజకవర్గంలో రూ.7.49 కోట్లతో 12 పనులు 
భీమవరం నియోకవర్గంలో రూ.30.14 కోట్లతో 13 పనులు 

ఏలూరు జిల్లాలో.. 
దెందులూరు నియోజకవర్గంలో రూ.14.40 కోట్లతో ఒక పని 
ఉంగుటూరు నియోజకవర్గంలో రూ.8.35 కోట్లతో 
3 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

తూర్పుగోదావరి జిల్లాలో.. 
గోపాలపురం నియోజకవర్గంలో రూ.4.71 కోట్లతో 11 పనులు 
నిడదవోలు నియోజకవర్గంలో రూ.2.37 కోట్లతో 4 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

దెందులూరు నియోజకవర్గంలో మొండికోడు మేజర్‌ డ్రెయిన్‌కు 2.50 కిలోమీటర్ల మేర రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, భీమవరంలో పశ్చిమ డెల్టా డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పనులు, తణుకులో ఎర్రకోడు మీడియం డ్రెయిన్, ఉండిలో కోరుకొల్లు మైనర్‌ డ్రెయిన్, ఇతర మరమ్మతులు ఇలా 95 పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో పాలకొల్లులో రూ.8.10 కోట్ల వ్యయంతో నక్కల మేజర్‌ డ్రెయిన్‌పై డబుల్‌ లైన్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top