తిరుపతిలో వైభవంగా గోదా కల్యాణం | Goda Kalyanam In Tirupati | Sakshi
Sakshi News home page

తిరుపతిలో వైభవంగా గోదా కల్యాణం

Jan 15 2026 9:51 PM | Updated on Jan 15 2026 9:51 PM

Goda Kalyanam In Tirupati

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలో గల మైదానంలో గురువారం రాత్రి కన్నుల పండువగా గోదా కల్యాణం జరిగింది. కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు భక్తి పారవశ్యంతో తన్మయత్వం చెందారు. ముందుగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి అర్చకస్వాములు కల్యాణ వేదిక మీద వేంచేపు చేశారు.

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించారు. అనంతరం తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులు శ్రీవిష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణం, రక్షాబంధనం అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. సర్కారు సంకల్పం, భక్తుల సంకల్పం, మధుపర్క నివేదనం, వస్త్ర సమర్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. 

తదుపరి మహా సంకల్పం, స్వామి, అమ్మవార్ల ప్రవరలు, మాంగల్యపూజ, మాంగల్య ధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన హోమము, లాజ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపారు. వారణమాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి చివరగా నివేదన, మంగళ హారతులు నిర్వహించారు. గోవింద నామ సంకీర్తనలతో గోదా కల్యాణం కార్యక్రమం ముగిసింది.  తర్వాత ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన గోదా కల్యాణం నృత్యరూపకం ఆద్యంతం అలరించింది.

టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సివిఎస్ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు, శ్రీవారి ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement