
ప్రేమ పేరుతో వంచన
యువతిని మోసగించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్
పెళ్లి చేసుకుంటానని రూ.100బాండ్‌పై రాసుకున్న అంగీకార పత్రం
ముహూర్తం పెట్టి, పెళ్లి కార్డులు పంచిపెట్టాక ప్లేటు ఫిరాయించిన యువకుడు
అడిగితే ఎమ్మెల్యే కూన రవి గ్యాంగ్ పేరుతో బెదిరిస్తున్న వైనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఐదేళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ముహూర్తం పెట్టి.. పెళ్లి కార్డులు పంచాక ప్లేటు ఫిరాయించాడు. ఇదేమని అడిగితే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గ్యాంగ్ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ గ్యాంగ్ పేరుతో ఇప్పటికే ఇసుక, ల్యాండ్ సెటిల్‌మెంట్లు జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రూరల్ పోలీసు స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయక తప్పలేదు. వివరాల్లోకి వెళితే..
విశాఖ జిల్లా పరవాడ మండలానికి చెందిన యువతి శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో గల పెద్దమ్మ ఇంటిలో ఉంటుంది. రజక సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఆమదాలవలస మండలం గోపీనగర్‌కు చెందిన మెట్ట శరత్ చంద్రతో పరిచయం ఏర్పడింది. విశాఖలో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయానికి ఆ అమ్మాయి మైనర్. వారి ప్రేమ ప్రయాణం కొనసాగుతున్న తరుణంలోనే శరత్ చంద్ర సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాడు.
అతనికి ఇన్‌స్టాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ప్రేమాయణం కొన్నాళ్లు నడిచాక పెళ్లి చేసుకోమని ఆ యువతి కోరింది. ఎప్పటికప్పుడు అతడు నమ్మిస్తూ వచ్చాడు. ఒక రోజు గట్టిగా నిలదీసేసరికి రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివని, పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని మాట మార్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తను నివాసం ఉంటున్న పెద్దమ్మ ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు గమనించి రిమ్స్‌కు సకాలంలో తీసుకెళ్లి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసుల వరకు వ్యవహారం వెళ్లింది.
ఈ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. 100 రూపాయల బాండ్ పేపర్‌లో ఒప్పందం చేసుకున్నట్టు లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. పెద్ద మనుషులు కూడా సంతకాలు చేశారు. యువతి తల్లిదండ్రులు కట్న కానుకల కింద రూ. 3లక్షల నగదు, 4తులాల బంగారం, 20సెంట్లు భూమి ఇచ్చేందుకు కూడా అంగీకారపత్రం రాసుకున్నారు.
ఈ మేరకు అక్టోబర్ 10న వివాహం ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికార్డులు కూడా ముద్రించి బంధువులకు, స్నేహితులకు యువతి కుటుంబ సభ్యులు పంచారు. కట్నం డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు గోపీనగర్ గ్రామానికి వెళ్లగా శరత్ చంద్ర ఆయన కుటుంబంలోని వారు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కూన రవికుమార్ పేరు చెప్పి గ్యాంగ్‌గా చెలామణి అవుతున్న చైతన్య అనే యువకుడి ప్రోద్బలమే దీనికి కారణమని తెలిసింది. వాళ్లు ఏం చేయలేరని, మామయ్య వెనకున్నారని భరోసా ఇవ్వడంతోనే శరత్ చంద్ర కుటుంబం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు గుర్తించారు.
ఎంత నిలదీసినా అటువైపు నుంచి ఒకటే సమాధానం రావడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో చేసేది లేక యువతి కుటుంబ సభ్యులు శరత్ చంద్ర ఇంటి వద్ద వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పెళ్లికి ససేమిరా అనడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన శరత్ చంద్రతో పాటు అతడి తల్లిదండ్రులు, అతడికి సహకరించిన స్నేహితులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కూన రవి పేరు చెప్పి జడిపిస్తున్నారు..
ఎమ్మెల్యే కూన రవికుమార్ మేనల్లుడట. మెట్ట శ్రీను అట, చైతన్య అట, కిల్లి సాయి, చల్లా వాసు ఇంటికొచ్చి జడిపిస్తున్నారు. తేల్చుకుని రండని కూన రవికుమార్ పంపించారట. మమ్మల్ని భయపెడుతున్నారు. కూన రవి సర్. మేము పేదవాళ్లం. ఐదేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మా పిల్లను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు. మాకు డబ్బు వద్దు, కేసులు వద్దు, న్యాయం కావాలి. ఆ అబ్బాయితో పెళ్లి చేయాలి.
– రమణమ్మ, యువతి పెద్దమ్మ