
గోదావరిలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించండి
అంతర్రాష్ట్ర అనుమతి తీసుకోండి
ఆ తర్వాతే పర్యావరణ అనుమతికి దరఖాస్తు చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు(పీబీఎల్‌పీ) ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఈఏసీ (ఎక్సపర్ట్ అప్రైజల్ కమిటీ) ఏపీ ప్రభుత్వానికి వెనక్కి పంపింది. ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనలు (టీవోఆర్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది.
గోదావరిలో వరద జలాల లభ్యతపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)తో సమగ్రంగా అధ్యయనం చేయించి లెక్క తేల్చాలని సిఫార్సు చేసింది. అంత్రరాష్ట్ర సమస్యలను సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లి.. అనుమతి తీసుకున్న తర్వాతే ఈఐఏపై అధ్యయనం చేసేందుకు టీవోఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు జూన్ 17న ఈఏసీ 33వ సమావేశంలో చర్చించిన అంశాల మినిట్స్‌ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సోమవారం విడుదల చేసింది.
ట్రిబ్యునల్ అవార్డు ఉల్లంఘన అంటూ ఫిర్యాదులు
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టడానికి పర్యావరణ అనుమతి కోసం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేయాల్సి ఉంది.. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయాలంటే తొలుత ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తూ నివేదిక రూపొందించాలి. ఆ నివేదిక రూపకల్పనకు నియమ, నిబంధనలను ఈఏసీ ఖరారు చేస్తుంది. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక రూపకల్పనకు నియమ, నిబంధనల కోసం గత నెల 5న ఏపీ జలవనరుల శాఖ ఈఏసీకి దరఖాస్తు చేసింది.
దీనిపై జూన్ 17న ఈఏసీ 33వ సమావేశంలో సమగ్రంగా చర్చించింది. ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు–1980ని ఉల్లంఘిస్తూ పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని ఆరోపిస్తూ ఈ–మెయిల్‌ల ద్వారా అనేక ఫిర్యాదులు వచ్చాయని ఈఏసీ పేర్కొంది. తొలుత గోదావరిలో వరద జలాల లభ్యతపై సీడబ్ల్యూసీతో అధ్యయనం చేయించి.. నీటి లభ్యత లెక్క తేల్చుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర సమస్యలపై సీడబ్ల్యూసీతో చర్చించి అనుమతి తీసుకోవాలని ఈఏసీ స్పష్టం చేసింది.