మళ్లించేశారు | Funds diverted for the second time in a row in Polavaram | Sakshi
Sakshi News home page

మళ్లించేశారు

May 10 2025 5:41 AM | Updated on May 10 2025 5:55 AM

Funds diverted for the second time in a row in Polavaram

పోలవరంలో వరుసగా రెండోసారి నిధులు డైవర్షన్‌ 

మలి విడత అడ్వాన్స్‌నూ వాడేసిన కూటమి సర్కారు

మార్చి 12న రూ.2,704.81 కోట్లు ఇచ్చిన కేంద్రం 

తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలో జమకు ఆదేశం 

కానీ.. రూ.200 కోట్లు మాత్రమే ఎస్‌ఎన్‌ఏలో జమ 

రూ.2,504.81 కోట్లు ఇతర అవసరాలకు వినియోగం 

అక్టోబరులో తొలి విడత అడ్వాన్స్‌ రూ.2,348 కోట్లు మళ్లింపు 

కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరిలో సర్దుబాటు 

రాష్ట్ర ప్రభుత్వ తీరుతో పునరావాస కల్పనలో తీవ్ర జాప్యం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తిరిగి చెల్లించిన నిధులను మళ్లించారంటూ చంద్రబాబు దు్రష్పచారం

ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్‌నే మళ్లించడంపై పెద్దఎత్తున విమర్శలు

సాక్షి, అమరావతి: వరుసగా రెండోసారి పోలవరం నిధులను కూటమి ప్రభుత్వం మళ్లించేసింది..! ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురైనా తీరు మార్చుకోలేదు..! రెండు నెలల కిందట విడుదలైన మలి విడత నిధులను కూడా వాడేసింది..! కేంద్రం లెక్కలు అడుగుతుండడంతో అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది..! ఇలా పదేపదే నిధులను మళ్లించడం.. నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూ సేకరణలో జాప్యానికి కారణం అవుతోందని అధికారులు వాపోతున్నారు. 

పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి వీలుగా.. నిధుల సమస్య ఉత్పన్నం కాకుండా చూసేందుకు మార్చి 12న కేంద్ర ప్రభుత్వం రెండో విడత అడ్వాన్స్‌గా రూ.2,704.81 కోట్లు ఇచ్చింది. వీటిని తక్షణమే ఎస్‌ఎన్‌ఏ(సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమ చేయాలని సూచించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసింది. మిగతా రూ.2,504.81 కోట్లను ఇతర అవసరాలకు మళ్లించేసిందనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాగా, ఎస్‌ఎన్‌ఏకు జమ చేసినట్లుగా రసీదు పంపాలంటూ పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) నుంచి రోజూ ఒత్తిడి వస్తుండడంతో జల వనరుల శాఖ అధికారులు బెంబేలెత్తుతున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చొరవతో..
పోలవరం నిధుల తిరిగి చెల్లింపు (రీయింబర్స్‌మెంట్‌) ప్రక్రియలో జాప్యంతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర భారం పడుతోందని, అడ్వాన్సులు ఇచ్చి ప్రాజెక్టు పనులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. దీనికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. తదనంతరం.. పోలవరం పనులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.459.68 కోట్లను రీయింబర్స్‌ చేస్తూ.. రూ.2,348 కోట్లను తొలి విడత అడ్వాన్స్‌గా (మొత్తం రూ.2807.68 కోట్లు) విడుదల చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ 2024 అక్టోబరు 9న ఉత్తర్వులిచ్చింది. 

అదే రోజున రాష్ట్ర ఖజానాలో జమ చేసింది. వీటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసి.. పోలవరం ప్రాజెక్టులో కేంద్ర కేబినెట్‌ నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. ఈ నిధుల్లో 75 శాతం ఖర్చు చేశాక.. వినియోగ ధ్రువీకరణ పత్రాలు (యూసీలు) పంపితే మిగతా నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. రెండో విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,704.81 కోట్ల విషయంలోనూ ఇదే నిబంధనలు పెట్టింది. కానీ, కూటమి ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే జమ చేసి, మిగతా నిధులను మళ్లించేసింది.

నాడు గగ్గోలు.. నేడు అడ్వాన్స్‌లే మళ్లింపు
గతంలో పోలవరం ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేసేది. అంటే.. కేంద్రం తిరిగిచ్చేది రాష్ట్ర ప్రభుత్వ నిధులే. వాటిని పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వినియోగించింది. అయినా సరే, పోలవరం నిధులను మళ్లించేశారంటూ సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధులను మళ్లించేయడం గమనార్హం. దీంతో కూటమి ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది రెండోసారి.. 
కేంద్రం గత ఏడాది అక్టోబరు 9న తొలి విడత అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.2,348 కోట్లను కూడా కూటమి ప్రభుత్వం మ­ళ్లించేసింది. అయితే, కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరి రెండో వా­రంలో వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో వేసింది.  

కేంద్రం మరోసారి అసహనం.. 
దాదాపు రెండు నెలల క్రితం విడుదల చేసిన అడ్వాన్స్‌ నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద పీపీఏ, కేంద్ర జలశక్తి శాఖ అసహనం వ్యక్తం చేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నిర్వాసితులకు, సేకరించాల్సిన భూమికి పరిహారం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి మాత్రమే వినియోగించాల్సిన అడ్వాన్స్‌ నిధులను ఇలా వాడేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement