కేంద్ర కేబినెట్‌ ఆమోదంతోనే పోలవరం ప్రాజెక్టుకు నిధులు

Funding for the Polavaram project with the approval of the Central Cabinet - Sakshi

2017–18 ధరల ప్రకారం నిధులిచ్చేందుకు మార్గం సుగమం 

పీపీఏ ప్రతిపాదనలతో సాధ్యం అంటున్న అధికార వర్గాలు

2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యం కాదంటూ జల్‌ శక్తి శాఖకు ప్రతిపాదనలు పంపుతామన్న పీపీఏ

భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరం

ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తి సాధ్యమవుతుందని ప్రతిపాదిస్తామన్న పీపీఏ

కమీషన్ల కక్కుర్తితో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తే తాజా ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడానికి మార్గం సుగమం అవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రాజెక్టు కోసం సమీకరించే భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేందుకు, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.28,191.03 కోట్లు అవసరమని, అలాంటప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన మేరకు 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి నివేదించాలని సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) నిర్ణయించింది. 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. పీపీఏ ఈ విధంగా ప్రతిపాదనలు పంపితే.. సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), టీఏసీ (సాంకేతిక సలహా మండలి), ఆర్‌సీసీ (సవరించిన అంచనా కమిటీ) ఆమోదించిన మేరకు రూ.47,725.74 కోట్లకు కేంద్ర జల్‌ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) ఇస్తుందని, తర్వాత ఆ మేరకు నిధులు ఇచ్చేందుకు జల్‌ శక్తి శాఖ కేంద్ర కేబినెట్‌లో తాజా తీర్మానాన్ని ప్రతిపాదిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రతిపాదనలను కేబినెట్‌ ఆమోదిస్తే 2017–18 ధరల ప్రకారం నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేస్తున్నాయి.

అప్పుడే అభ్యంతరం తెలిపి ఉంటే..
2016 సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటన  చేసినప్పుడు, ఆ ప్రకటనను అమలు చేస్తూ 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, వాటికి ఆమోదం తెలుపుతూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు, 2017 మే 8న పోలవరం మొదటిసారి సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చేందుకు షరతు విధించినప్పుడు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం కనుక అభ్యంతరం తెలిపిఉంటే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంపై గందరగోళం నెలకొని ఉండేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు సర్కార్‌ చేసిన పాపాలే పోలవరం ప్రాజెక్టుకు ఇప్పుడు శాపాలై వెన్నాడుతున్నాయని సాగునీటిరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాజా ధరల మేరకు నిధులు సాధించి 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. రూ.2,234.288 కోట్లను బేషరతుగా విడుదల చేసేందుకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.

ప్రతిపాదనలు పంపడానికే మూడేళ్లు జాప్యం
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తాజా ధరల ప్రకారం ఎంత అంచనా వ్యయం అవుతుందో ప్రతిపాదనలు సమర్పిస్తే కేంద్రానికి పంపి ఆమోదం తీసుకుంటామని 2015 మార్చి 12న జరిగిన తొలి సర్వసభ్య సమావేశంలో పీపీఏ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ తర్వాత వరుసగా మూడు నెలలకు ఒకసారి చొప్పున నిర్వహించిన ఐదు సమావేశాల్లోనూ ఆ విధంగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇలా దాదాపు మూడేళ్ల పాటు జాప్యం చేసి చివరకు 2018 జనవరి 2న 2017–18 ధరల ప్రకారం రూ.57,297.42 కోట్ల అంచనా వ్యయంతో పీపీఏకు ప్రతిపాదనలు ఇచ్చింది. 

నాలుగు కీలక సందర్భాల్లో చంద్రబాబు మౌనం
కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా అప్పటి సీఎం చంద్రబాబు కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంతో 2016 సెప్టెంబర్‌ 7న అర్ధరాత్రి కేంద్రం రాష్ట్రానికికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా పోలవరం నిర్మాణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆ మరుసటి రోజు ప్రత్యేక సహాయంపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది. 2014 ఏప్రిల్‌ 1నాటి ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేస్తామని తెలిపింది. ప్రత్యేక సహాయాన్ని అమలు చేస్తూ 2016 సెప్టెంబర్‌ 30న కేంద్ర ఆర్థిక జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ 2014 ఏప్రిల్‌ 1నాటి ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేసింది.

రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక సహాయంపై ఆమోదముద్ర వేస్తూ 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్‌ 1నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే విడుదల చేయడానికి అంగీకరించింది. డిజైన్‌ మారినా, ధరలు పెరిగినా, అంచనా వ్యయం పెరిగినా, భూసేకరణ వ్యయం పెరిగినా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు 2010–11 ధరల ప్రకారం మొదటిసారి సవరించిన అంచనా వ్యయం రూ.16,010.45 కోట్లకు 2017 మే 8న కేంద్ర జల్‌ శక్తి శాఖ షరతుతో కూడిన పెట్టుబడి అనుమతి ఇచ్చింది. ఆ షరతు ఏమిటంటే.. 2014 ఏప్రిల్‌ 1కి ముందు నీటిపారుదల విభాగానికి చేసిన ఖర్చుపోనూ.. ఆ రోజు నాటి ధరల ప్రకారం మిగిలిన మొత్తాన్ని మాత్రమే విడుదల చేస్తామన్నది. ఈ విధంగా ముఖ్యమైన నాలుగు సందర్భాల్లోనూ టీడీపీ ప్రభుత్వం, అప్పటి సీఎం చంద్రబాబు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా మౌనం వహించారని, అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించి తాజా ధరల ప్రకారం పోలవరానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేసి ఉంటే ఈ రోజు ప్రాజెక్టు అంచనా వ్యయంపై ఇంత గందరగోళం నెలకొని ఉండేది కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top