Friends Who Have Completed Funeral In Prakasam District - Sakshi
Sakshi News home page

‘ఆ నలుగురూ’.. స్నేహితులే

Published Tue, May 4 2021 4:36 AM

Friends who have completed the funeral - Sakshi

కొమరోలు: కరోనా దెబ్బకు బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి. కొన్ని రోజుల కిందట వరకు నవ్వుతూ పలకరించిన వారే.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. చుట్టుపక్కల ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే చాలు.. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోతున్నారు. అంత్యక్రియలు చేసేందుకు సైతం ముందుకు రాలేనంతగా హడలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కొందరు ముందుకు వచ్చి సాయం చేస్తూ ‘ఆ నలుగురు’గా నిలుస్తున్నారు.

మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొమరోలుకు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు గాదంశెట్టి గుప్తా(40) వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 4 రోజుల కిందట రక్త పరీక్ష చేయించగా టైఫాయిడ్‌ అని తేలింది. దీంతో మందులు వాడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున జ్వరం అధికమై.. పరిస్థితి విషమించి మృతి చెందాడు.

వైద్య సిబ్బంది వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ అని తేలింది. అయినా కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులెవరూ ముందుకురాలేదు. ఆయన కరోనాతోనే చనిపోయి ఉంటాడని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఎవరూ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఇరుగు పొరుగు వాళ్లు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. వృద్ధులైన తల్లిదండ్రులేమో కుమారుడికి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్థితిలో లేరు. బిడ్డలు కూడా లేరు.

భార్య ఏమీ చేయలేక సాయం కోసం రోజంతా ఎదురుచూసింది. చివరకు స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్‌ మౌలాలి, కొమరోలు, దద్దవాడ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రమణయ్య, సుబ్బారావు, మాజీ పోస్టల్‌ ఉద్యోగి థామ్సన్, ‘సాక్షి’ రిపోర్టర్‌ కృష్ణారెడ్డి... సోమవారం సాయంత్రం గాదంశెట్టి గుప్తా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. అంతేకాకుండా ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు.. కొంత నగదు సేకరించి అండగా నిలిచారు.

చదవండి: కరోనా విషాదం: వలంటీర్లే ఆ నలుగురై

Advertisement
Advertisement