ఏపీకి నాలుగు స్కోచ్‌ అవార్డులు

Four SKOCH Awards for Andhra Pradesh - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ పాలనా దక్షతకు ఇవి నిదర్శనమన్న మంత్రి అప్పలరాజు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు స్కోచ్‌ అవార్డులు వరించాయి. 2021 సంవత్సరానికి గాను జౌళి, పశు సంవర్ధక, మత్స్యసంపద, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలకు ఈ అవార్డులు దక్కాయి. శనివారం ఢిల్లీలోని ఇండియా హాబిటాట్‌ సెంటర్‌లో జరిగిన 83వ స్కోచ్‌ సమ్మిట్‌లో ఇండియా గవర్నెన్స్‌ ఫోరం అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పశు సంవర్ధక, మత్య్స సంపద, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అవార్డును అందుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలవుతున్న పశు సంరక్షక యాప్, ఈ–ఫిష్, ఆర్బీకే స్థాయిలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లు, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లు, రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న హార్బర్లు వంటి అనేక అంశాలను ఇతర రాష్ట్రాలతో బేరీజు వేసుకొని దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేశారని తెలిపారు. అంతేగాక వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌గా ఉన్నాయని తెలిపారు.

దేశంలోనే ఆర్బీకే వంటి వ్యవస్థ ఏదీ లేదని, దేశానికి ఇది దిక్సూచి అని స్కోచ్‌ సంస్థ ప్రశంసించి ఏపీకి వ్యవసాయ రంగంలో అవార్డు ఇచ్చిందని పేర్కొన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా దక్షత, ప్రజలకు మేలు చేసేందుకు ఆయన పడుతున్న తపన కారణంగానే ఈ అవార్డులు వచ్చాయని మంత్రి తెలిపారు.

ఇలాంటి అవార్డులు ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. కాగా జౌళి శాఖలో వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద అనంతపురం జిల్లాకు అవార్డు లభించింది. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో వైఎస్సార్‌ చేయూత, గ్రామ, వార్డు సచివాలయాలకు ఇచ్చిన అవార్డును శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అందుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top