
‘సాక్షి’తో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణియన్‌స్వామి
ఒకేసారి వందల సంఖ్యలో గోవుల మృతి వెనుక కుట్ర ఉంది
దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి
విపక్ష నేతలపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది
వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు చనిపోతున్నాయని టీడీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు
రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా?.. సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు.. అందుకే ఈ దుస్థితి
రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు
గోవు కేవలం జంతువు మాత్రమే కాదు.. ఆరాధ్య దైవం
ఒకేసారి వందల గోవుల మృతి అనుమానించాల్సిన అంశం
గోవులు చనిపోయాక మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా?.. టీటీడీ వ్యాపార ధోరణితో చూడటం వల్లే ఇలాంటి ఘటనలు
టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది
సీఎం వెంటనే టీటీడీ చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి
గత చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు
ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు
సాక్షి, అమరావతి: టీటీడీ గోశాలలో ఒకేసారి వందల గోవులు చనిపోవడం అనుమానాలు రేకెత్తిస్తోందని, దీనివెనుక కుట్ర ఉందని, అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి, విరాట్ హిందూస్థాన్ సంఘం అధ్యక్షుడు సుబ్రమణియన్‌స్వామి అభిప్రాయపడ్డారు. కొన్ని గోవులే చనిపోయాయని తేలిగ్గా వదిలేసే విషయం కాదని, ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. తిరుపతి నుంచి అధికారికంగా అందుబాటులో ఉన్న సమాచారం సేకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే తిరుమల వెళ్లి పూజల్లో పాల్గొన్న అనంతరం గోవుల మరణంపై అదనపు సమాచారం సేకరించి, జూలై మొదటి వారంలోగా కోర్టును ఆశ్రయించనున్నట్లు వివరించారు.
సమర్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తోందని, ఇదొక సర్వ సాధారణంగా మారిందని సుబ్రమణియన్‌స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లమంది ఆరాధ్య దైవంగా భావించే గోవుల రక్షణకు రాజ్యాంగ పరంగా ప్రాధాన్యం ఉందని.. కానీ, టీటీడీ పెద్దలు, ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని పేర్కొన్నారు. గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని సుబ్రమణియన్‌స్వామి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం చంద్రబాబే తప్పించాలని డిమాండ్ చేశారు.
సుబ్రమణియన్‌స్వామి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘టీటీడీ గోవుల మృతి నాకు చాలా బాధ కలిగించింది. ఎన్ని చనిపోయాయన్నది కాదు. రాజ్యాంగంలో గో సంరక్షణ గురించి స్పష్టంగా ఉంది. ప్రతి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాలి. వయసు మళ్లిన మనుషుల్లాగే గోవులు కూడా చనిపోతున్నాయంటూ టీడీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్లిందని వదిలేస్తారా? ఎవరినైనా వృద్ధులని చంపేస్తుంటే అది సాధారణమే అనుకోవచ్చా? ఇవి పరిణతి లేని వ్యాఖ్యలు.
చంద్రబాబు ప్రభుత్వానిది వ్యాపార ధోరణి
గోవుల జీవనశైలి భిన్నమైనది. చాలా ఊళ్లలో ఎవరి అజమాయిషీ లేకుండా ఆరోగ్యంగా జీవిస్తుంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో చనిపోయే పరిస్థితి సాధారణంగా ఉండదు. టీటీడీలో చంద్రబాబు ప్రభుత్వ వ్యాపార ధోరణి కారణంగా ఇలా జరుగుతుండొచ్చు. గోవులకు సరైన వైద్యం అందించకుండా వదిలేస్తున్నందుకే ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఆషామాషీగా తీసుకోలేం.
గోవుల కళేబరాలను ఏం చేశారన్నది తేలాల్సి ఉంది. మాంసాన్ని రెస్టారెంట్లకు పంపుతున్నారా? గోవు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. టీటీడీ చైర్మన్ దానిగురించి తెలుసుకోవాలి. రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారు ఎవరూ అలా మాట్లాడరు. ఒకేసారి పెద్ద సంఖ్యలో గోవుల మృతి వెనుక టీటీడీ నిర్లక్ష్యం ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అందుకని టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలి.
టీటీడీలో పాలనా వైఫల్యం
వరుస ఘటనలు టీటీడీ పాలనా వైఫల్యాలే. టీటీడీ బోర్డు పాలన అధ్వానంగా ఉంది. సీఎం వెంటనే చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలి. గత ప్రభుత్వంలో టీటీడీ నిర్వహణ చేపట్టినవారు ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారు. చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ఎవరు ఏమడిగినా సమాధానం ఇచ్చేవారు.