కూటమి పాలనలో ఆటవిక రాజ్యం.. బాబు జంగిల్‌ రాజ్‌! | Former CM YS Jagan fires over corruption of coalition leaders | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో ఆటవిక రాజ్యం.. బాబు జంగిల్‌ రాజ్‌!

Jan 29 2026 5:03 AM | Updated on Jan 29 2026 5:04 AM

Former CM YS Jagan fires over corruption of coalition leaders

కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరితెగింపుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నిప్పులు

రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా?  

ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యల్లేవ్‌ 

రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం 

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పతనం 

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం 

రెండేళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా?  

భీమవరం స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్ని సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయట పెడితే, ఏ చర్యా లేదు.  

రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్‌ రాజ్యం అంటే ఇదే.  – వైఎస్‌ జగన్‌ మండిపాటు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి నేతల అవినీతి, విచ్చలవిడితనం, బరి తెగింపు చూస్తుంటే అసలు మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని.. ఇలాంటి ఆటవిక రాజ్యాన్ని ఎప్పుడూ చూసి ఉండమంటూ చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంక్రాంతి సమయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోలు చూస్తుంటే విస్మయం కలుగుతోందన్నారు. ‘మొబైల్‌ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు.. కొత్తపేటలో వ్యాన్లపై రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించారు. మొబైల్‌ వ్యాన్లలో మద్యం అమ్మారు. వాటి కోసం ప్రతి నియోజకవర్గంలో వేలం పాటలు పాడారు. మా పులివెందులలో కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి వేలం పాట నిర్వహించారు. రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి 8, 9 సెంటర్లు పెట్టి నిర్వహించుకున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఇదంతా చేయిస్తోంది..’ అని మండిపడ్డారు. 

‘భీమవరం డీఎస్పీ మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ఆయన యూనిఫామ్‌లో ఉండి.. ‘ఊపేయ్‌.. కుదిపేయ్‌!’ అంటున్నాడు. అసలు మనం ఏ సమాజంలో ఉన్నామో అర్థం కావడం లేదు. ఏం జరుగుతోంది? ఇది ఆటవిక రాజ్యం కాక మరేమిటి?’ అంటూ ధ్వజమెత్తారు. ‘ఇది జంగిల్‌ రాజ్యం. దోచుకున్న సొత్తు.. పైనుంచి కింది వరకు, చంద్రబాబు, లోకే‹Ô  మొదలు కిందిస్థాయి నాయకుడి వరకు.. చివరకు పోలీసులు కూడా మీకింత, నాకింత అని పంచుకున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ పార్టీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. తొలుత ఏలూరు నియోజకవర్గంతో ఈ సమావేశాలు మొదలు కాగా రెండో సమావేశం భీమవరం కార్యకర్తలతో నిర్వహించారు. 

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై శ్రేణులకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు. భీమవరం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్‌ చినమిల్లి వెంకటరాయుడుతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

కూటమి ప్రజా ప్రతినిధుల బరితెగింపు..
కూటమి నేతలు, ప్రజా ప్రతినిధుల బరి తెగింపునకు అడ్డు లేకుండా పోయింది. అవినీతి, విచ్చలవిడితనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏ స్థాయికి వెళ్లారంటే.. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ అసలు అతడు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించి, భయపెట్టి దారుణంగా లైంగికంగా వేధిస్తే.. ఆ అమ్మాయి అన్నీ సాక్ష్యాధారాలతో సహా స్వయంగా బయటపెడితే, ఏ చర్యా లేదు. ఆమదాలవల ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వేధింపులు భరించలేక ఒక గవర్నమెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. అయినా కూడా ఏ చర్యా లేదు. 

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఓ మహిళను బలాత్కారం చేసి, చివరకు అధికార దుర్వినియోగంతో కేసును క్లోజ్‌ చేయించుకున్నాడు. ఎంత దారుణం? మంత్రి సంధ్యారాణి పీఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అతడిని అరెస్టు చేయాల్సింది పోయి, ఫిర్యాదు చేసిన బాధిత మహిళను జైలుకు పంపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్‌ అహ్మద్‌ ఫోన్‌లో ఒక మహిళతో మాట్లాడుతూ, అశ్లీలంగా ప్రవర్తించాడు. 

ఒక మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అశ్లీల రికారి్డంగ్‌ డ్యాన్సులు వేశాడు. స్టేజీపై డ్యాన్సర్లతో కలిసి చిందులు వేశాడు. రాష్ట్రం ఆటవిక రాజ్యంలా మారింది. విచ్చలవిడితనం కనిపిస్తోంది. ఆ స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయింది. ఎక్కడైనా ఇలాంటివి జరిగితే జైల్లో పెట్టాల్సింది పోయి సాక్షాత్తూ చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, ఆయన ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పాలనలో మనం ఉన్నాం. జంగిల్‌ రాజ్యం అంటే ఇదే. ఎమ్మెల్యేలు, మంత్రుల దగ్గర నుంచి అంతా విచ్చలవిడితనం, దోపిడీ కనిపిస్తోంది.  

పథకాలు రద్దు.. హామీలిచ్చి మోసాలు
చంద్రబాబు వచ్చిన తరువాత జరిగింది ఏమిటంటే.. మన పథకాలన్నీ ఒకవైపు రద్దయ్యాయి. మరోవైపు ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ  ఆయన చెప్పిన సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అబద్ధాలుగా తేలిపోయాయి. ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. విపరీతంగా ప్రచారం చేశారు. ప్రకటనలు ఇచ్చారు. చివరకు ఇంటింటికీ బాండ్లు కూడా పంపారు. దానిపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ సంతకాలు కూడా చేశారు. 

పథకాల ద్వారా ఆ ఇంట్లో ఉన్న వారందరికీ ఎంతెంత వస్తుందనేది చెప్పారు. కానీ ఏదీ నిలబెట్టుకోలేదు. ఒక మనిషి ఈ స్థాయిలో అబద్ధాలు చెబుతారా? మోసాలు చేస్తారా? అనేది ఊహకు కూడా అందదు. ఎవరైనా ఇలాంటి అబద్ధాలు చెప్పి మోసం చేస్తే 420 అని కేసు పెట్టి జైల్లో వేస్తారు. కానీ ఒక్క చంద్రబాబు, ఆయన కూటమిలో మాత్రమే కేసులు లేకుండా బయట ఉన్నారు. 

అన్ని వర్గాలకు బాబు మోసాలు..
ఆరోజు ఇంటింటికీ వెళ్లి ఏం చెప్పారు? ఏమన్నారు..? ఆ ఇంట్లో ఎవరైనా పిల్లాడు కనబడితే నీకు రూ.15 వేలు అని, ఆ పిల్లల తల్లులు కనబడితే నీకు రూ.18 వేలు అని, ఎవరైనా ఒక యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని, కండువా కప్పుకుని రైతు కనిపిస్తే నీకు రూ.26 వేలు అని, ఇంకా పెద్దవాళ్లు కనిపిస్తే నీకు రూ.48 వేలు ఇస్తాం అని చెప్పారు. 

ఆ తర్వాత పచ్చి మోసం చేశారు. చివరకు గ్యాస్‌ సిలిండర్లలో కూడా మోసం చేశారు. ఏటా మూడు సిలిండర్ల చొప్పున రెండేళ్లకు కలిపి మొత్తం ఆరు సిలిండర్లు ఇవ్వాలి. కానీ, ఇచ్చింది ఒకటి రెండు మాత్రమే. అది కూడా అందరికీ ఇవ్వలేదు. చివరకు అక్కడా, అలా పచ్చి మోసం చేశారు.

ఆ డబ్బంతా ఏమైంది?.. అంతా డీపీటీ!
మన హయాంలో ఐదేళ్లలో.. రెండేళ్లు కోవిడ్‌ లాంటి సంక్షోభం ఉన్నా మనం చేసిన అప్పు రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే. ఆ అప్పులో వివిధ పథకాల కింద ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ఆ డబ్బు ఎవరికి పోయింది అనే వివరాలు, వారి బ్యాంక్‌ అక్కౌంట్ల నెంబర్లు, వారి ఆధార్‌తో సహా ఇవ్వగలిగే విధంగా మన పాలన సాగింది. 

చంద్రబాబు ఇప్పటికే 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. అంటే మన హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పులో 95 శాతం ఇప్పటికే దాటాడు. మరి ఆ డబ్బంతా ఏమైంది? ఎవరికి పోయింది? అన్న దానికి సమాధానం లేదు. అంతా దోచుకో.. తినుకో.. పంచుకో! అదే డీపీటీ! అది మన కళ్ల ఎదుట కనిపిస్తున్న వాస్తవం. 

రెడ్‌బుక్‌ రాజ్యాంగం..
మరోవైపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పు చేయకపోయినా.. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్‌ చేస్తున్నారు. అసలు తప్పు చేసిన వారిపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పైగా ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు అదే పని చేస్తున్నారు. అంతా విచ్చలవిడి దోపిడీ, రెడ్‌బుక్‌ రాజ్యాంగం. పోలీసులు ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారు. వ్యవస్థలన్నీ పతనమయ్యాయి. మరోవైపు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయాయి. హామీలు ఏవీ అమలు కాలేదు. అన్నీ మోసాలే. 

పథకాలు పోయాయ్‌..
పథకాల అమలు లేదు. విద్యాదీవెన 8 త్రైమాసికాలు బాకీ. మన ప్రభుత్వంలో ప్రతి క్వార్టర్‌కు పిల్లల తల్లుల ఖాతాలో జమ చేశాం. 2024 జనవరి–మార్చి త్రైమాసికం మొదలు.. గత డిసెంబరు వరకు 8 త్రైమాసికాలకు సంబంధించి రూ.700 కోట్ల చొప్పున మొత్తం రూ.5,600 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు. రూ.4,900 కోట్లు బాకీ. ఇక వసతి దీవెన ఏటా రూ.1100 కోట్లు. మొత్తం రూ.2200 కోట్లు బాకీ పెట్టారు. నాడు–నేడు పనులు లేవు. గోరుముద్ద నాణ్యత పడిపోయింది. పిల్లలు చనిపోతున్నారు. టోఫెల్‌ శిక్షణ, ఇంగ్లిష్‌ మీడియం, ట్యాబ్‌లు ఆగిపోయాయి. 

మన హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 43 లక్షల మంది పిల్లలు చదివితే, ఈరోజు ఆ సంఖ్య 33 లక్షలే. అంటే 10 లక్షల మంది పిల్లలు తగ్గారు. ఆరోగ్యశ్రీకి నెలకు రూ.300 కోట్లు ఇవ్వాలి. రూ.6 వేల కోట్లకుగానూ రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రూ.4 వేల కోట్లు బాకీ పెట్టారు. దీంతో ఆస్పత్రులు వైద్యం అందించడం లేదు. వైద్యం పడకేసింది. మరోవైపు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల అమ్మకం దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. చివరకు యూరియా కూడా బ్లాక్‌లో కొనాల్సి వస్తోంది. 

రైతు భరోసా కింద రూ.40 వేలకు బదులు రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. మా హయాంలో ఆక్వా విద్యుత్‌ సబ్సిడీ రూ.3,620 కోట్లు ఇచ్చాం. ఈరోజు పైసా ఇవ్వడం లేదు. మేం యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇచ్చాం. ఇవాళ విద్య, వ్యవసాయం, వైద్య రంగాలు నిర్వీర్యం అయ్యాయి.

ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ..
ఇలాంటి దుర్మార్గమైన పాలన మధ్య వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. పార్టీ కార్యకర్తలు గొప్ప యజ్ఞం చేస్తున్నారు. ప్రతి కష్టంలోనూ ప్రజలకు తోడుగా ఉండాల్సిన ధర్మం మనపై ఉంది. మనం ప్రజలకు ఎన్నో చేశాం. మరి ఏమీ చేయని చంద్రబాబుకు ఈసారి ప్రజలు కచ్చితంగా తగిన బుద్ధి చెబుతారు. మనం ప్రజల పక్షాన ఇలాగే నిలబడాలి. 

చూస్తుండగానే రెండేళ్లు అయిపోయాయి. ఇంకా మూడేళ్లు మాత్రమే మిగిలి ఉంది. అందులో మరో ఏడాదిన్నర గడిస్తే.. నా పాదయాత్ర మొదలవుతుంది. దాదాపు 150 నియోజకవర్గాల్లో నేను పర్యటిస్తా. అలా ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటా.« ఆ యాత్రలో ప్రతి మూడో రోజు బహిరంగ సభ నిర్వహిస్తాం. ప్రజా ఉప్పెనను చూపుతూ, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ, చంద్రబాబు తప్పుడు పాలనను ప్రజలకు వివరిస్తాం. వాటిని ఎండగడతాం.

ప్రతి ఇంటా చర్చ జరగాలి... మీరు చొరవ చూపాలి
ఇప్పుడు మీరంతా కలిసికట్టుగా నిలిచి పోరాడాలి. చంద్రబాబు దారుణ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా చొరవ చూపాలి. మన పాలన, ఈ పాలన మధ్య తేడాను స్పష్టంగా ప్రజలకు వివరించాలి. వాటిపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఆ దిశగా మీరంతా కలసికట్టుగా కృషి చేయాలి. పార్టీ అనుబంధ విభాగాలన్నీ స్ట్రీమ్‌లైన్‌ చేయాలి. అన్నీ వ్యవస్థీకృతం కావాలి. చంద్రబాబు అన్యాయ పాలనను ప్రజల్లో బలంగా ఎండగట్టాలి. ఆ దిశగా మీరు చొరవ చూపాలి. అందరూ కలిసి పని చేయాలి.

ఏ ఒక్క వర్గానికైనా ఒక్కటైనా మంచి జరిగిందా?
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి దాదాపు రెండేళ్లు. ఫిబ్రవరి 11న మూడో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరో మూడేళ్లు మాత్రమే మిగిలింది. మరి ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటంటే.. గత ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దయ్యాయి. మనం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవాళ్లం. 

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ మాదిరిగా భావించేవాళ్లం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపన పడేవాళ్లం. కోవిడ్‌ సంక్షోభం లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజూ, ఏ హామీని ఎగ్గొట్టాలని అనుకోలేదు. ప్రభుత్వానికి ఎన్ని సమస్యలు ఉన్నా, వాటి కంటే ప్రజల సమస్యలే ఎక్కువని భావించి చిరునవ్వుతో స్వీకరించాం. అన్ని హామీలూ అమలు చేశాం. ప్రజలకు ఏ ఇబ్బందీ లేకుండా చూశాం. 

అంతా కలసి పంచుకుంటున్నారు..
ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా దోపిడీ, అవినీతి. అది ఏ స్థాయిలో ఉందంటే.. అసలు పాలకులు ఉన్నారా? అనిపించే పరిస్థితి. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రావడం లేదు. అదంతా తగ్గుతోంది. మరి, అదంతా ఎక్కడికి పోతోంది అంటే..  చంద్రబాబు మొదలు కింది స్థాయి వరకు ఇంత అని పంచుకుంటున్నారు. మద్యం మాఫియా. ప్రైవేటు షాపులన్నీ లాటరీలో వాళ్ల మనుషులకే ఇచ్చుకున్నారు. 

గ్రామస్థాయిలో బెల్టు షాప్‌లు వేలం పాట పాడి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు కొట్టుకోకూడదు కాబట్టి! అక్కడ పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నారు. మద్యం షాప్‌ పక్కనే పర్మిట్‌ రూమ్‌లు, అక్కడ పెగ్గుల్లో అమ్మకం. అక్కడా దోపిడీ. వైన్‌ షాప్‌ల్లో కూడా ఎక్కువ ధరకు అమ్మకాలు. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. ఎమ్మార్పీపై రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒకటి నకిలీ.అలా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోంది. 

ఈరోజు ఇసుక ఫ్రీ అంటున్నా ఎక్కడా ఫ్రీగా లేదు. ఎక్కడ చూసినా లారీలు, మిషన్లతో దోచేసుకుంటున్నారు. ధర చూస్తే గతంలో కంటే డబుల్‌ రేటుకు అమ్ముతున్నారు. మన హయాంలో ఇసుక ద్వారా ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది. ఐదేళ్లకు కలిపి దాదాపు రూ.3,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు ఆ ఆదాయం రావడం లేదు. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు. ఇసుక తరలిస్తున్నారు. ఏ ఒక్క గని వదలడం లేదు. సిలికా, మైకా, లేటరైట్, క్వార్ట్జ్‌.. ఏదీ వదలకుండా అన్నీ దోచుకుంటున్నారు.

జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం..
జగన్‌ 2.0 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. అదీ నా హామీ. క్రితంసారి కోవిడ్‌ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. జగన్‌ 2.0 లో కార్యకర్తలకు టాప్‌ ప్రయారిటీ. వారి ద్వారానే మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ ద్వారానే చంద్రబాబు అన్యాయ, దారుణ పాలన ప్రజల్లో ఎండగడతాం. చిత్తశుద్ధితో కూడిన మంచి పాలన అంటే ఎలా ఉంటుంది? అనేది మనం చూపిస్తే.. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఎలా అన్నదానికి చంద్రబాబు పాలనే ఉదాహరణ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement