
పోలీసుల అభియోగాలు పూర్తిగా అవాస్తవం
న్యాయస్థానంలో సీనియర్ ఐపీఎస్ పీఎస్‌ఆర్ స్వయంగా వాదనలు
సాక్షి, అమరావతి: ‘నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ – 1 పరీక్ష పేపర్లను మాన్యువల్‌గా మూల్యాంకనం చేయలేదు. అందువల్ల అవకతవకలు, కుంభకోణానికి అవకాశమే లేదు..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు న్యాయస్థానానికి నివేదించారు. మాన్యువల్ మూల్యాంకనం కోసం ‘కామ్‌సైన్’ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. తాను కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ –1 పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమన్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ కూటమి సర్కారు నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ న్యాయస్థానం గురువారం విచారించింది. దీనిపై పీఎస్‌ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పీఎస్‌ఆర్‌కు న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది.
పీఎస్‌ఆర్ ఏమన్నారంటే..
‘గ్రూప్ వన్ పేపర్లను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ ప్రతిపాదించారు. ఆమేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాం. దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కొద్ది రోజులు తర్జనభర్జన పడ్డాం. కానీ ఉదయ్ భాస్కర్, ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు. అనంతరం ఇన్‌చార్జ్ చైర్మన్‌గా నియమితులైన రమణారెడ్డి కొద్దికాలమే పదవిలో ఉన్నారు. ఇంతలో నాకు డీజీగా పదోన్నతి లభించింది. నన్ను బదిలీ చేస్తారనే సమాచారంతోపాటు ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్‌ను నియమిస్తారని తెలియడంతో గ్రూప్ వన్ పేపర్ల మూల్యాంకనంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్‌కు మొత్తం విషయాన్ని వివరించా. మాన్యువల్‌గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్‌గా పేపర్ల మూల్యాంకనంపై సమగ్ర నివేదిక సమర్పించా. ఆ తరువాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరోవిభాగానికి బదిలీ చేశారు. నేను బదిలీ అయిన తరువాత అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించారు. ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు. వాటి ఆధారంగానే పోస్టింగులు కూడా ఇచ్చారు. ఇదీ వాస్తవం.
కానీ నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా మాన్యువల్ మూల్యాంకనం చేయించినట్లు... అందులో అవకతవకలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఒకసారి డిజిటల్‌గా, రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు... ఆ రెండింటిలో మాన్యువల్ మూల్యాంకనం నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా చేసినట్లు పోలీసులు చెప్పడం పూర్తిగా అవాస్తవం. డిజిటల్‌గా ఒకసారి, మాన్యువల్‌గా ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారు.
మాన్యువల్ మూల్యాంకనం కూడా నేను ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలగిన తరువాతే చేశారు. కామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏపీపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకులు, ఇతర కాని్ఫడెన్షియల్ పనుల కోసమే నిబంధనల మేరకు ఒప్పందం చేసుకున్నాం. అందుకు బిల్లు చెల్లించాం. వీటిని వక్రీకరిస్తూ మాన్యువల్ మూల్యాంకనం కోసం ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అభియోగాలు మోపడంలో నిజం లేదు’ అని పీఎస్‌ఆర్ ఆంజనేయులు కోర్టుకు నివేదించారు.