
శ్రీ సత్యసాయి జిల్లా : సోమందేపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షాత్తూ మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బాలికలకు మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా.. హాస్టల్ నేలపైనే ఉన్న చికిత్స అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇదే విషయంపై ఆరా తీసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు.
బాలికలు గురువారం రాత్రి తిన్న ఆహారం కలుషితమవడంతో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దీంతో బాలికలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరుకుని వసతిగృహంలోనే వారికి చికిత్స అందిస్తున్నారు.
అయితే,బాలికల ఆరోగ్యంపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ బాలికల వసతి గృహానికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాలికల్ని పరామర్శించారు. బాలికలకు హాస్టల్‌లో కాకుండా మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ సమయంలో పోలీసులు అత్యుత్సాహం చేశారు. హాస్టల్‌లో బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఆహారం, భద్రత వంటి వివరాల్ని ఆరా తీయగా.. మంత్రి సవిత బాలికల్ని పరామర్శించేందుకు వస్తున్నారంటూ మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్‌తో పాటు ఇతర వైఎస్సార్‌సీపీ నేతలను బలవంతంగా బయటకు పంపారు. మీడియా ప్రతినిధులపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఓ విలేకరి సెల్ ఫోన్‌ను లాక్కొని పగులగొట్టారు. ఈ ఘటనలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
