తిరుపతిపై గత పాలకుల నిర్లక్ష్యం: నాటి పాపాలు.. నేటి శాపాలు! | Sakshi
Sakshi News home page

తిరుపతిపై గత పాలకుల నిర్లక్ష్యం: నాటి పాపాలు.. నేటి శాపాలు!

Published Wed, Nov 24 2021 12:35 PM

Floods In Tirupati Due To The Negligence Of The TDP Government - Sakshi

సాక్షి, తిరుపతి: నలభై ఏళ్ల క్రితం తిరుపతి పరిధిలో సుమారు 44 వరకు చెరువులు, కుంటలు ఉండేవి. కాలక్రమేణా అందులో చాలావరకు కబ్జాకోరల్లో చిక్కిపోయాయి. శేషాచలం కొండల నుంచి వచ్చే వర్షపు నీటిని నగరం వెలుపలకు తరలించే ఒరవ కాలువలు సైతం ఆక్రమణకు గురయ్యాయి. దీనిపై 2017లో అప్పటి అధికారులు నాటి టీడీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వెంటనే కబ్జాలను తొలగించి చెరువులు, కాలువలు, కుంటలను పునరుద్ధరించకుంటే తిరుపతికి ముప్పు తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ గత ప్రభుత్వం సదరు నివేదికను బుట్టదాఖలు చేసింది. ఆ నిర్లక్ష్యమే నేడు తిరుపతి నగరాన్ని నిలువునా ముంచింది.

చెరువులు.. కుంటలు మాయం! 
తిరుపతి నగరం చుట్టుపక్కల గతంలో పేరూరు పెద్ద చెరువు, తుమ్మలగుంట, అవిలాల, కలికాల చెరువు, చిన్నరాయల చెరువు. వెటర్నరీ కళాశాల సమీపంలో పందిగుంట, అలిపిరి సమీపంలో కొండగుంట, మెటర్నరీ ఆస్పత్రి వెనుక సింగారగుంట, ఐఎస్‌ మహల్‌ ప్రాంతంలో బొమ్మగుంట, దిగువన రామచంద్రగుంట. అలాగే నరసింహ తీర్థం, గంగమ్మ గుడి ఎదురుగా తాతయ్యగుంట, ఆర్టీసీ బస్టాండు స్థలంలో తాళ్లపాక చెరువు. కపిలతీర్థం, కరకంబాడి, కొర్లగుంట మధ్యలో ముదితినాయని గుంట, మురికినేని గుంట, లింగాలమ్మ చెరువు, సింగిరిగుంట, అడవి సింగన్న గుంట, అడివి వాని గుంట, పాత రేణిగుంట రోడ్డులో కొరమీనుగుంట, కైకాల చెరువు ఉండేవి. ప్రస్తుతం వీటిలో పేరూరు, తుమ్మలగుంట, అవిలాల చెరువులు మాత్రం మిగిలాయి. మిగిలిన చెరువులను కబ్జారాయుళ్లు మాయం చేసేశారు.

వరద నీటికి దారేది! 
తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలో ప్రధానంగా నాలుగు పెద్ద కాలువలు ఉన్నాయి. శేషాచలం కొండల నుంచి వచ్చే వర్షపు నీరు కపిలతీర్థం, ఎస్వీ, వెటర్నరీ వర్సిటీలు, వ్యవసాయ కళాశాల మీదుగా వెళ్లే కాలువల ద్వారా పేరూరు, తుమ్ములగుంట, అవిలాల చెరువులకు చేరాలి. అక్కడి నుంచి ఓటేరు చెరువు మొరవ నుంచి యోగిమల్లవరం మీదుగా స్వర్ణముఖి నదిలో కలవాలి. అలాగే ఎస్వీయూ, పద్మావతి కళాశాల పరిసరాల్లో నుంచి వచ్చే వర్షపు నీరు మజ్జిగ కాలువ మీదుగా స్వర్ణముఖి నదికి చేరాలి.

మాల్వాడీ గుండం నుంచి ప్రవహించే వర్షపు నీరు ఎన్‌జీఓ కాలనీ, రైల్యే కాలనీ, అశోక్‌ నగర్, కొర్లగుంట మీదుగా వినాయక సాగర్‌ చెరువు, చింతలచేను, కరకంబాడి మీదుగా దిగువకు ప్రవహించేవి. అన్నమయ్య కూడలి, పళణి థియేటర్‌ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీరు లక్ష్మీపురం, శ్రీనివాసపురం, పద్మావతిపురం నుంచి కొరమేనుగుంట, దామినేడు చెరువుకు చేరాలి. అవి నిండగానే స్వర్ణముఖి నదిలోకి వెళ్లేవి. అయితే ఈ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయింది. కొద్దిపాటి వర్షానికే నగరంలోని రోడ్లు తటాకాలను తలపించే పరిస్థితి ఏర్పడింది.

నివేదికపై నిర్లక్ష్యం 
తిరుపతిని 2017లో వచ్చిన తుపాను ముంచెత్తింది. వరద తాకిడికి కాలువలు ఉప్పొంగడం, శేషాచల కొండల నుంచి వచ్చిన వర్షపు నీరు జతకలడవంతో నగరం జలమయమైంది. అప్పట్లో లక్ష్మీపురం, గాంధీపురం, ఎస్టీవీనగర్, కొరమీనుగుంట, కొర్లగుంట, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీ, మారుతీనగర్, శివజ్యోతినగర్, రైల్వేకాలనీ, మధురానగర్, తాతయ్యగుంట, కట్టకిందపల్లె, ఎర్రమిట్ల, రాజీవ్‌నగర్, మాధవనగర్, కొత్తూరు, ఆటోనగర్‌ ముంపునకు గురయ్యాయి. అప్పటి కలెక్టర్‌ సిద్ధార్థజైన్, కార్పొరేషన్‌ కమిషనర్‌ వినయ్‌చంద్‌ క్షేత్రస్థాయిలో పర్యటించి కారణాలను తెలుసుకున్నారు.


కరకంబాడి రోడ్డులో ఆక్రమణలకు ధ్వంసమైన కాలువ 

కాలువలను సర్వే చేయించి ఆక్రమణలను గుర్తించారు. వెంటనే కబ్జాలను తొలగించి కాలువలను విస్తరించకుంటే భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించారు. అంతటితో ఆగకుండా ఆక్రమణల తొలగింపునకు అనుమతులు ఇవ్వాలని పలుమార్లు విన్నవించారు. ఈ క్రమంలోనే నాటి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాలువల విస్తరణకు అప్పట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం తిరుపతికి ఇంతటి దయనీయస్థితి వచ్చి ఉండేది కాదు.


టీడీపీ హయాంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆటోనగర్‌లో ఇదీ పరిస్థితి (ఫైల్‌) 

బాబు హయాంలో ఇష్టారాజ్యం
తిరుపతి పట్టణాభివృద్ధికి 1981లో తుడా ఆవిర్భవించిన తర్వాత చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. దీనిపై 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఆటోనగర్‌ శంకుస్థాపనకు వచ్చినప్పుడు స్థానికులు నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో ఆటోనగర్‌ ఏర్పాటైతే సమీపంలోని పెద్దచెరువు, దామినేడు చెరువు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో అందరూ భయపడినట్లుగానే దామినేడు, పెద్దచెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చంద్రబాబు హయాంలో కబ్జాలపర్వయం తారస్థాయికి చేరింది. తిరుపతి పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువలను తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారు. 40 అడుగుల వెడల్పుగల కాలువలు కూడా నగరం నడిబొడ్డులోకి వచ్చేసరికి 5 నుంచి 10 అడుగులకు కుంచించుకుపోవడం గమనార్హం.

 

గుండెలవిసేలా రోదిస్తున్న ఈ మహిళ పేరు గాయత్రి. ఎస్టీవీ నగర్‌లోని పిఎల్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌ సమీపంలో నివాసం. ఈనెల 18న ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఈమె భర్త సుబ్బారావు వరదల కారణంగా నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. ఇప్పటికీ ఆచూకీ కరువైంది. టీడీపీ హయాంలోని ఆక్రమణల కారణంగా నీరు నగరాన్ని ముంచెత్తడంతో ఇప్పుడు ఈ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. 

తిరుపతి రూరల్‌ మండలం పేరూరు పంచాయతీ హరిపురం కాలనీ మీదుగా ప్రవహించే ప్రధాన కాలువ పూర్తిగా కనుమరుగైంది. అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ కాలువ ప్రాంతాన్ని నాటి టీడీపీ నాయకులు పోటీ పడి ఆక్రమించుకున్నారు. కాలువ, కాలువ పోరంబోకు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఆ పాపం నేడు శాపమై తిరుపతి నగర దక్షిణ ప్రాంతాన్ని వరద నీటి రూపంలో పీడిస్తోంది. ఆ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి చానల్స్‌ పూర్తిగా కనుమరుగవడం గమనార్హం.

తిరుపతి ఎల్బీనగర్‌ మీదుగా పది అడుగుల మేర ప్రవహించే వర్షపు నీటి కాలువ ఆక్రమణకు గురవడంతో ఐదు అడుగుల మేర కుంచించుకుపోయింది. 2002లో ఈ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. నాటి టీడీపీ నాయకుల చర్యలతో ప్రస్తుతం ఆ ప్రాంతంతో పాటు చుట్టుపక్క కాలనీలను వరద ముంచెత్తింది.

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement