కృష్ణమ్మ కళకళ.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద

Flood Water Reaches Almatti And Narayanpur projects - Sakshi

ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు పోటెత్తుతున్న వరద

తుంగభద్రలోకి ఒక్కరోజే 40 వేల క్యూసెక్కులు

కర్నూలు సిటీ/రాయచూరు రూరల్‌/హొసపేటె/ధవళేశ్వరం: మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఆల్మట్టి డ్యామ్‌కు ఎగువ నుంచి 45,534 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 43,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా నారాయణపూర్‌ డ్యామ్‌ వైపు ఉరకలేస్తోంది. నారాయణపూర్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 33.03 టీఎంసీలు కాగా ఇప్పటికే 29.05 టీఎంసీల నీరు చేరింది. దీంతో డ్యామ్‌లోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు.

తుంగభద్ర డ్యామ్‌లో వరద పరవళ్లు:
కర్ణాటక ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురవడంతో తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఒక్కరోజే 40 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో డ్యామ్‌లో జలకళ ఉట్టిపడుతోంది. మరో రెండు రోజుల్లో నీటినిల్వ 40 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉంది. డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 37.897 టీఎంసీల నీరు ఉన్నట్టు తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు. ఈ నెల 12న కర్ణాటక మునిరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీ (ఇరిగేషన్‌ కన్సల్టెన్సీ కమిటీ) సమావేశంలో ఈ నెల 18 నుంచి ఎల్‌ఎల్‌సీ, హెచ్చెల్సీ కాల్వలకు నీటిని విడుదల చేయాలని కర్ణాటక అధికారులు నిర్ణయించారు. ఎల్‌ఎల్‌సీ కాల్వలో రాంసాగరం వద్ద జరుగుతున్న పనుల వల్ల నీటిని విడుదల చేయవద్దని ఏపీ ఇంజనీర్లు కోరడం, ఏపీ వాటా నీటికి ఇండెంట్‌ పెట్టకపోవడంతో నీటి విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

మరింత పెరిగిన గోదావరి వరద:
ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గోదావరి ఉధృతి శుక్రవారం మరింత పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద జలాలు బ్యారేజ్‌కు వచ్చి చేరుతున్నాయి. శుక్రవారం సాయంత్రం బ్యారేజ్‌ వద్ద 9.95 అడుగులకు నీటిమట్టం చేరింది. 1,37,390 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top