Andhra Pradesh Flood Receding Godavari - Sakshi
Sakshi News home page

గోదావరిలో వరద తగ్గుముఖం 

Sep 12 2021 4:22 AM | Updated on Sep 12 2021 12:05 PM

Flood receding in Godavari - Sakshi

కొవ్వూరులో ఆర్చ్‌ రైలు వంతెన–పాత రైలు వంతెన మధ్య గోదావరి

సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది.  

ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి
ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్‌ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.  

2,600 కుటుంబాలు తరలింపు 
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement